ltrScrptTheme3

గుదిబండ

Oct 19 2021 @ 00:51AM

తలనొప్పిగా గ్రామ సచివాలయాల నిర్వహణ

పంచాయతీలపై ప్రతినెలా అదనపు భారం

ఆర్థిక పరిపుష్టి లేని చోట్ల మరిన్ని అవస్థలు 

నెలకు రూ.10వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి

ఈ-సేవల ఆదాయాన్ని కూడా ఇవ్వని ప్రభుత్వం

నిఽధులు లేక ఆందోళన వ్యక్తంచేస్తున్న సర్పంచ్‌లు

పంచాయతీ కార్యదర్శులతో విభేదాలు

గ్రామ పంచాయతీలకు సచివాలయ వ్యవస్థ గుదిబండగా తయారైంది. వాటి నిర్వహణ పెను భారంగా మారింది. అసలే రాబడి లేక కునారిల్లుతున్న సమయంలో ఒకవైపు కరోనా విపత్కర పరిస్థి తులు, ఇంకో వైపు సచివాలయాల నిర్వహణ బాధ్యతతో సర్పంచ్‌లు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొం టున్నారు.  సాధారణంగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్స్‌ మాత్రమే ఉంటాయి. అయితే ఆర్థిక సంఘం నిధులను అధికారులు విద్యుత్‌ చార్జీలకు లాగేసుకోవడంతో చిల్లిగవ్వ లేదు. ఇంటిపన్నులు, నీటిపన్నులు, చేపల చెరువులు, ఇతరత్రా ద్వారా జనరల్‌ ఫండ్స్‌ వస్తుంటాయి. ఏడాదిన్నర నుంచి కరోనాతో ఆ ఆదాయం కూడా  పడిపోయింది. దీంతో ఉన్న అరకొర నిధులతో వివిధ రకాల పనులు చేస్తూ గడుపుకొస్తున్నారు. ఈ పరిసి ్థతుల్లో సచివాలయాల భారం ఎలా మోయాలో అర్థంకాక సర్పంచ్‌లు,  కార్యదర్శులు తలలు పట్టుకొంటున్నారు. 

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 18 : అసలే గ్రామ పంచాయతీల పరిస్థితి అంతంతమాత్రం. పైగా ఉన్న కాస్తంత నిఽధులను కరెంట్‌ బిల్లులకు, పాత బకాయిల చెల్లింపులకు ఇటీవలే అధికారులు బలవంతంగా లాగేసుకున్నారు.  ఆదాయం లేక నిధులు రాక అల్లాడుతున్న ఈ సమయంలో సచివాలయాల నిర్వహణ ఖర్చులు కూడా పంచాయతీల నుంచే చెల్లించాల్సి ఉండటంతో మరింత భారంగా మారింది. ప్రభుత్వం పంచాయతీలకు ఆదాయం పెంచడం అటుంచి ఇంకా ఖర్చులను మోపడంపై సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,051 గ్రామపంచాయతీలతోపాటు, ఒక నగర పాలక సంస్థ, మూడు మునిసిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో 884 సచివాలయాలు ఏర్పాటు చేయగా, పట్టణాల్లో 174 వార్డు సచివాలయాలు కలిపి 1,058 ఉన్నాయి.  ఒక్కో సచివాలయంలో 10 నుంచి 18మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గ్రామ సచివాలయాల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు, వార్డు సచివాలయాలను మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ఒక్కో పంచాయతీపై నెలకు రూ.10వేల భారం

అంతంతమాత్రంగా ఉన్న గ్రామ పంచాయతీలకు సచివాలయాల నిర్వహణ కష్టంగా మారింది. ఆయా పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదే సమయంలో ప్రతినెలా సచివాలయాల నిర్వహణకు డబ్బులు చెల్లించలేక అటు సర్పంచ్‌లు, ఇటు పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయి రెండో ఏడాది గడుస్తున్నా వాటి నిర్వహణకు ప్రభుత్వం ఇంతవరకూ  పైసా కూడా మంజూరు చేసిన పరిస్థితి లేదు. దీంతో ప్రతినెలా విద్యుత్‌ బిల్లులతోపాటు ప్రింటింగ్‌ పేపర్లు, మంచినీటి సౌకర్యం, ఇతరత్రా అన్నిరకాల బిల్లులను స్థాయిని బట్టి రూ.6వేల నుంచి రూ.10వేలపైనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ-సేవల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వానికి..

సచివాలయాలకు వివిధ రకాల పనుల కోసం వెళ్లే ప్రజానీకం, రైతులు వాటికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను చెల్లించి నమోదు చేసుకుంటున్నారు. సచివాలయాల్లో ఈ-సేవల ద్వారా ప్రతిరోజూ ఆదాయం బాగానే వస్తోంది. అయితే దాన్ని ఏరోజుకారోజు బ్యాంకుల్లో జమచేయడం తప్ప డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. ఒక్కో సచివాలయానికి రోజుకు వేలల్లో ఆదాయం వస్తున్నా నిర్వహణకు మాత్రం ప్రభుత్వం ఒక్కపైసా కూడా మంజూరు చేయకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య విభేదాలు

సచివాలయాల నిర్వహణ విషయంలో అక్కడక్కడా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రతినెలా చెల్లింపులు చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే ఆ పనిచేసేందుకు నిధులు లేకపోవడం, ఉన్న అరకొర నిధులతో సర్పంచ్‌లు గ్రామంలో ఏదో ఒక అవసరమైన పనిచేసేందుకు చూస్తుండటంతో వారి మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. మరికొన్ని పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అప్పులు తెచ్చి సచివాలయాల నిర్వహణను పంచాయతీ కార్యదర్శులే చేయాల్సి రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.