అన్న కోసం సైనికుడవ్వాలనుకొని.. ఆ కల తీరకముందే రాకేశ్‌ విషాదాంతం

ABN , First Publish Date - 2022-06-18T08:39:40+05:30 IST

సైన్యంలోకి వెళ్లాలన్న అన్న కోరిక నెరవేరలేదు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో ఆ కల అలాగే ఉండిపోయింది. దానిని తమ్ముడి..

అన్న కోసం సైనికుడవ్వాలనుకొని.. ఆ కల తీరకముందే రాకేశ్‌ విషాదాంతం

రెండేళ్లుగా కఠోర శ్రమ.. ఫిజికల్‌గా ఎంపిక 

రాత పరీక్ష కోసం హనుమకొండలో శిక్షణ

‘అగ్నిపథ్‌’పై నిరసనలో తూటాలకు బలి

అగ్నిపథ్‌ తర్వాత.. నక్సలిజంలోకి వెళ్లాలా..?

ఆర్మీలోకి వెళ్లాలనుకుంటే అవమానిస్తారా?

అధికారులను నిలదీసిన ఆందోళనకారులు


ఖానాపురం, జూన్‌ 17: సైన్యంలోకి వెళ్లాలన్న అన్న కోరిక నెరవేరలేదు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో ఆ కల అలాగే ఉండిపోయింది. దానిని తమ్ముడి ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. సైనికుల గాథలు చెప్పి స్ఫూర్తి రగిలించాడు. దీంతో తమ్ముడు ఆ దిశగా ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు ‘అగ్నిపథ్‌’ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఆయనే వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ (22). స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమారస్వామి-పూలమ్మ రైతు దంపతులు. వీరికి రామ్‌రాజ్‌, రాకేశ్‌ కుమారులు. ఉష, రాణి కుమార్తెలు. ఉషకు పెళ్లయింది. రాణి ఆర్మీలో బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌గా బెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2015లో నర్సంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో రామ్‌రాజ్‌ ఇంటివద్దే ఉంటున్నారు. తమ్ముడు రాకేశ్‌ సైన్యంలో చేరితే తన కల నెరవేరినట్లే అనుకున్నారు.


రాకేశ్‌ అవివాహితుడు. దబీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో టెన్త్‌, నర్సంపేటలో ఇంటర్‌ పూర్తి చేశాడు. హనుమకొండలోని న్యూసైన్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. రెండేళ్లుగా ఆర్మీ ఉద్యోగం కోసం పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది హకీంపేటలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని అన్ని ఈవెంట్లలో ఎంపికయ్యారు. ఇటీవల ఆర్మీ (బీఎ్‌సఎఫ్‌) సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాల శరీర దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలో ఉంటూ రాత పరీక్షల కోచింగ్‌ తీసుకుంటున్నారు. 


నిరసన తెలిపేందుకు వెళ్లి.. 

 రాకేశ్‌.. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పఽధకంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో ఈవెంట్స్‌లో ఎంపికైన అభ్యర్థులందరూ వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రం తీరుపై నిరసన తెలపడానికి   హనుమకొండ నుంచి ఉదయం సికింద్రాబాద్‌కు రైలులో వెళ్లారు. అక్కడ పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. రాకేశ్‌ మృతిని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్మీ ఉద్యోగం వస్తుందంటూ తరచూ చెప్పేవాడని గుర్తుచేసుకునాన్నారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో నిత్యం పోటీ పరీక్షల గురించే చర్చించేవాడని తోటి మిత్రులు తెలిపారు. రాకేశ్‌ మృతి విషయం తెలిసి నానమ్మ చిలుకమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Updated Date - 2022-06-18T08:39:40+05:30 IST