చిన్నారులను బలిగొన్నది

ABN , First Publish Date - 2021-07-27T05:50:24+05:30 IST

రోజూ మాదిరిగానే సోమవారం కూడా ఆ గిరిజన మహిళలు దుస్తులు ఉతుక్కునేందుకు సమీపంలోని పెద్దేరు నది వద్దకు వెళ్లారు.

చిన్నారులను బలిగొన్నది
మృతి చెందిన చిన్నారుల వద్ద రోదిస్తున్న తల్లి తండ్రులు

పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి

కళ్లెదుట నీటిలో కొట్టుకుపోతున్నా కాపాడలేని నిస్సహాయ స్థితిలో మహిళలు

విగతజీవులైన బిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

లోవ గవరవరంలో విషాదఛాయలు


మాడుగుల రూరల్‌, జూలై 26: 


రోజూ మాదిరిగానే సోమవారం కూడా ఆ గిరిజన మహిళలు దుస్తులు ఉతుక్కునేందుకు సమీపంలోని పెద్దేరు నది వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత నలుగురు పిల్లలు కూడా అక్కడకు వెళ్లారు. మహిళలు బట్టలు ఉతుక్కుంటుండగా, పిల్లలు సమీపంలో ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తరువాత పిల్లలు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఏం జరిగిందోనని ఆందోళన చెందుతూ మహిళలంతా ఒక్క ఉదుటన అక్కడకు వెళ్లారు. పిల్లలు నీటిలో మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ కనిపించారు. ఎవరికీ ఈత రాకపోవడంతో ఆందోళన చెందుతూ గ్రామంలోకి పరుగులు తీశారు. గ్రామస్థులు హుటాహుటిన నది వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే చిన్నారులు నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. తమకు సాగు, తాగునీరు అందించే పెద్దేరు నదే తమ బిడ్డలను బలిగొంటుందని కలలో కూడా ఊహించలేదని భోరున విలపించారు.  


మాడుగుల మండలం జమ్మాదేవిపేట పంచాయతీ లోవగవరవరం గిరిజన గ్రామం. ఈ ఊరుకి సమీపంలో పెద్దేరు నది ఉంది. దుస్తులు ఉతుక్కునేందుకు నిత్యం మహిళలు నది వద్దకు వెళుతుంటారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వంతల రాజకుమారి, గేదెల శివకుమారి, గేదెల ఎర్రయ్యమ్మ బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత వంతల రాజకుమారి కుమార్తె వెంకట ఝాన్సీ (10), గేదెల శివకుమారి అక్క కుమార్తె వంతల జాహ్నవి (11)తోపాటు నీలాపు రాజులమ్మ కుమారుడు మహేంద్ర (7), వంతల అమ్మాజీ కుమార్తె షర్మిల (7) నది వద్దకు వెళ్లారు. మహిళలు బట్టలు ఉతుక్కుంటుండగా, అక్కడికి సుమారు 50 మీటర్ల దూరంలో చిన్నారులు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు నదిలో రాళ్లు వున్న చోట నీటిలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా వుండడంతో నీటిలో మునిగిపోయారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో వున్న మహిళలు ఆందోళన చెందుతూ అక్కడకు వెళ్లారు. అప్పటికే పిల్లలు నీటిలో మునుగుతూ తేలుతూ, గుమ్మి వున్న ప్రదేశంపైపు కొట్టుకుపోయారు. మహిళల్లో ఎవరికీ ఈత రాకపోవడంతో వెంటనే గ్రామంలోకి వెళ్లి, విషయం చెప్పారు. గ్రామస్థులు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలు అప్పటికే నీటిలో మునిగిపోయారు. ఈత వచ్చిన యువకులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గుమ్మి ఉన్నచోట మృతదేహాలు లభించడంతో ఒడ్డుకు చేర్చారు. విగతజీవులైన బిడ్డలను చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. 


నీలాపు నాగరాజు, రాజులమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కుమార్తె పెద్దది కాగా, నదిలో మునిగి చనిపోయిన మహేంద్ర (7) చిన్నవాడు. వంతల చినబాబు, రాజకుమారి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె వెంకట ఝాన్సీ (10). వంతల పోతురాజు, అమ్మాజీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో షర్మిల (7) పెద్దది. కాగా మిగిలిన ఇద్దరు (మగ పిల్లలు) చిన్నవాళ్లు. వంతల గాంధీ, అమ్మాజమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో జాహ్నవి (11) చిన్నకుమార్తె.  


పిన్ని ఇంటికి వచ్చి...


వంతాల జాహ్నవి సొంతూరు చింతపల్లి మండలం రాజుపాకలు. వంతల గాంధీ, అమ్మాజమ్మ ఈమె తల్లిదండ్రులు. గాంధీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అమ్మాజమ్మ చెల్లెలు గేదెల శివకుమారి మాడుగుల మండలం లోవగవరవరంలో ఉంటున్నది. కొవిడ్‌ వల్ల పాఠశాలలు ఇంకా తెరవకపోవడంతో జాహ్నవి ఇటీవల లోవగవరవరంలో పిన్ని ఇంటికి వచ్చింది. సరదాగా ఆడుకోవడానికి పిల్లలతో కలిసి నది వద్దకు వెళ్లి, నీటిలో మునిగి మృతిచెందింది.



Updated Date - 2021-07-27T05:50:24+05:30 IST