సద్దుల సంబురం

ABN , First Publish Date - 2022-10-04T05:23:16+05:30 IST

రంగు రంగుల పూలు.. బతుకమ్మ పాటలు.. నృత్యాలతో పూల పండుగ వెల్లివిరిసింది. తీరొక్క పూలతో సోమవారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రజలు సద్దుల బతుకమ్మను అట్టహాసంగా జరుపుకున్నారు.

సద్దుల సంబురం
బతుకమ్మ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో తొమ్మిదో రోజు అట్టహాసంగా పూల పండుగ
  •  పూల వనాలుగా పల్లెలు, పట్టణాలు 
  •  ఊరు వాడా సద్దుల బతుకమ్మ వేడుకలు
  • ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తుంది
  •  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగు రంగుల పూలు.. బతుకమ్మ పాటలు.. నృత్యాలతో పూల పండుగ  వెల్లివిరిసింది.  తీరొక్క పూలతో  సోమవారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రజలు సద్దుల బతుకమ్మను అట్టహాసంగా జరుపుకున్నారు.  పల్లెలు, పట్టణాలు,  పూలవనాలుగా మారాయి.  బతుకమ్మ ఆడుతూ మహిళలు సందడిగా గడిపారు.  సామూహికంగా  బతుకమ్మలను పేర్చి  ఆడిపాడారు. అనంతరం  ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. 

వికారాబాద్‌,అక్టోబరు 3: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని, పేద ధనిక భేదం లేకుండా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, పురపాలక సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు.  8 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ రూ. 300 కోట్లతో మహిళలకు బతుకమ్మ చీరలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 114 మంది డయాలసిస్‌ రోగులకు మంత్రి పింఛన్‌ పత్రాలను అందజేశారు. ఉత్తమ బతుకమ్మలు పేర్చిన డీఆర్డీఏకు ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ఐసీడీఎస్‌ శాఖకు ద్వితీయ బహుమతిగా రూ. 5 వేలు,  ప్రోత్సాహక బహుమతులు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అందరికి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్మన్‌ సునీతామహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు మహిళలు  జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ.  తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలల్లో పూజించడం జరిగిందన్నారు.  ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌ మాట్లాడుతూ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ మంజుల , ఎంపీపీ చంద్రకళ, డీఆర్‌డీవో కృష్ణన్‌, జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకదేవి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌ షర్మిల, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.

లక్ష్మాపూర్‌లో బతుకమ్మ ఆడిన మంత్రి మల్లారెడ్డి

శామీర్‌పేట: మూడుచింతలపల్లి మండలంలో సోమవారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ హరిక, మహిళలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి సద్దుల సంబురాలను జరుపుకున్నారు.  లక్ష్మాపూర్‌లో మహిళలతో కలిసి మంత్రి మల్లారెడ్డి, ఎంపీపీ హరిక బతుకమ్మ ఆడారు. అలాగే జగ్గంగూడలో సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామతా నవరాత్రోత్సవాల్లో ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్‌,  భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  లక్ష్మాపూర్‌లో ఎంపీపీ హరిక, సర్పంచ్‌ ఆంజనేయులతో కలిసి మంత్రి మల్లారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 





Updated Date - 2022-10-04T05:23:16+05:30 IST