మీరే జీవితం కావాలి

ABN , First Publish Date - 2022-09-16T05:30:00+05:30 IST

మీరు జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? లేదా మీ అహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? జీవితం పట్ల సున్నితత్వం ఉండాలి.

మీరే జీవితం కావాలి

మీరు జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? లేదా మీ అహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? జీవితం పట్ల సున్నితత్వం ఉండాలి. సరే. మరి ఈ సున్నితత్వం అంటే ఏమిటి? అది పుట్టుకతోనే వస్తుందా? దాన్ని మనం పెంపొందించుకోవాలా? ఇవన్నీ ప్రశ్నలే.


పసిపిల్లలందరూ ఒకేలా కనిపిస్తారు. కానీ వారు ఒక్కొక్కరూ మరొకరికన్నా భిన్నంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎలా ఏడుస్తారు? ఎలా పాకుతారు? చేతులెలా కదిలిస్తారు? ఎలా చూస్తారు?... ఇలా ప్రతి విషయంలోనూ భేదం ఉంటుంది. అందరూ ఒకేలా ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. పెద్దలు ఎలా భిన్నంగా ఉంటారో... పిల్లలు కూడా అంతే. అయితే. ఒకరు ఒక విధమైన సామర్థ్యంతో, మరొకరు అలాంటి సామర్థ్యం లేకుండా పుట్టవచ్చు. కానీ జీవితంపట్ల సున్నితత్వంతో ఉండడం అనేది కేవలం పుట్టుక మాత్రమే నిర్ణయించే విషయం కాదు.

 

పుట్టుక కొన్ని విషయాలను నిర్ణయించవచ్చు. మీరు ఆరంభంలో అందరికన్నా ముందుండి... పోటీ పూర్తయ్యేసరికి చివరిస్థానంలో మిగిలిపోవచ్చు. లేదా ఆరంభంలో... చివరిలో ఉన్నప్పటికీ, పోటీలో గెలవవచ్చు. ఇది సాధ్యమే. పుట్టుక కచ్చితంగా ఒక నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతుంది. కానీ అదే ఏకైక నిర్ణయాత్మక అంశం కాదు. జీవితమే నిర్ణయాత్మకమైన అంశం. మీరు జీవితం పట్ల సున్నితంగా మారాలంటే... ‘మీరే ఒక సంపూర్ణ జీవితం’ అని గ్రహించాలి. మీరు ఇరవై నాలుగు గంటల్లో... ఎన్ని క్షణాలు జీవితంలో ఒక భాగమై జీవిస్తున్నారు? ఎక్కువ సమయం మీరు ఒక ఆలోచనతోనో, భావంతోనో, భావోద్వేగంతోనో, అభిప్రాయంతోనో, వేదాంతంతోనో, విశ్వాసంతోనో, బంధంతోనో, మరి దేనితోనో ఉంటారు.


ప్రస్తుతం మీరు అహాన్ని కేంద్రంగా కలిగి ఉన్నారు. ‘నేను చాలా సున్నితమైన వ్యక్తిని’ అని మీరు అంటున్నారంటే... మీకు చాలా బలమైన, పెద్ద అహం ఉందన్నమాట. సున్నితంగా ఉండడం అంటే... ఊరికే మనసును కష్టపెట్టుకోవడం, కోపం తెచ్చుకోవడం, విసుగు చెందడం కాదు. మీరు జీవితం పట్ల సున్నితంగా ఉన్నట్టైతే... ఎదుటి వ్యక్తి జీవితాన్ని కూడా మీ జీవితంలాగానే భావిస్తారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నదంతా మీలాంటి జీవితమే. కేవలం ఒక ఆలోచనతోనో, భావనతోనో కూర్చుంటే... ఈ విశ్వంతో ఏకత్వాన్ని అనుభూతి చెందలేరు. 


యోగా పేరుతో మనం చేసేదంతా... జీవితం పట్ల సున్నితంగా మారడానికే. అలా మారడానికి మీరు ఏం చేయాలంటే... మీ అనుభూతులకు, ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించండి. ఒక రోజు అలా ప్రయత్నించి చూడండి. అకస్మాత్తుగా... చల్లగాలిని, వర్షాన్ని, పూలను, మనుషులను.... ఇలా ప్రతిదాన్నీ పూర్తిగా భిన్నమైన రీతిలో అనుభూతి చెందగలుగుతారు. మీలోని జీవం మరింత క్రియాశీలంగా పరిణతి చెందడాన్ని హటాత్తుగా గమనిస్తారు. అప్పుడు మీరు జీవితం పట్ల సున్నితంగా మారుతారు. ఎదుటివారి పట్ల కూడా సున్నితంగా ఉంటారు. ఎందుకంటే... అప్పుడు నేను అంటే కేవలం ఈ శరీరమేనని మీరు భావించరు. ఆ నేను అంతటా వ్యాపించి ఉందని గ్రహిస్తారు. కాబట్టి మీరే జీవితమైతే.... మీ జీవితం మీరు సున్నితత్వంతో ఉంటారు.  ప్రస్తుతం మీరు జీవితాన్ని పక్కన పెట్టి... మిగతా అన్నిటి కోసం ప్రయత్నిస్తున్నారు. అదే అసలు సమస్య. మీ శరీరం, మీ  ఆలోచన, మీ భావోద్వేగాలు చెబుతున్నది ముఖ్యం కాదని మీరు గుర్తించినప్పుడు... మీరు ఆకస్మికంగా జీవితంపట్ల గాఢమైన సున్నితత్వాన్నికలిగిన వారవుతారు. 


సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2022-09-16T05:30:00+05:30 IST