పాపం.. దివ్యాంగులు

ABN , First Publish Date - 2021-10-11T05:42:08+05:30 IST

డోన్‌ పట్టణానికి చెందిన ఈయన పేరు మధు.

పాపం.. దివ్యాంగులు
డోన్‌ పట్టణానికి చెందిన మధు

  1. అర్హత ఉన్నా పింఛన్‌ కట్‌
  2. అర్జీలు ఇచ్చినా.. ‘స్పందన’ లేదు
  3. షరతుల పేరిట పేర్లు తొలగింపు
  4. సిబ్బంది తప్పిదాలకు లబ్ధిదారులు బలి


డోన్‌ పట్టణానికి చెందిన ఈయన పేరు మధు. తొంభై శాతం డిజేబిలిటీ ఉండడంతో ఏ పనీ చేసుకోలేడు. ప్రభుత్వం అందించే పింఛను మీద ఆధారపడి జీవిస్తున్నాడు. రెండు నెలల క్రితం డోన్‌ 4వ వార్డు నుంచి 12వ వార్డుకి మారాడు. అప్పటి నుంచి పింఛను నిలిపివేశారు. వలంటీర్లను అడిగితే వార్డు మారింది కాబట్టి వివరాలు మార్చుకోవాలి అని చెప్పారు. వివరాలు మార్చుకున్న తర్వాత అంతా సరిగానే ఉందన్నారు. తీరా పింఛను కోసం వెళ్తే వివరాలు పూర్తిగా నమోదు కాలేదు కాబట్టి రావడం లేదని అంటున్నారు. ఇలా ఆ వార్డు, ఈ వార్డు అంటూ తిప్పుతుండడంతో స్పందనలో అర్జీ పెట్టేందుకు వచ్చాడు. ‘ఏ పని చేద్దామన్నా కాలు, చేయి సహకరించదు. అలాంటి నాకు పింఛను నిలిపివేస్తే ఎలా బతకాలి..? నాలాంటి వారిని ఇబ్బందులు పెట్టకుండా అధికారులు వెంటనే పింఛను మంజూరు చేయాలి’ అని కోరుతున్నాడు.


కర్నూలు(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు దిగులు పట్టుకుంది. కొన్నేళ్ల నుంచి పింఛన్‌తో భరోసా పొందుతున్న వారికి అనుకోని కష్టం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, ఏవో సాకులు చెప్పి పింఛన్‌ నిలిపివేస్తున్నారు. అందరిలా పని చేసుకుని ఉపాధి పొందుదామని అనుకున్నా, శరీరం సహకరించ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నిస్సహాయులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. భారం తగ్గించుకునేందుకు షరతుల పేరిట అర్హులను జాబితా నుంచి తప్పిస్తోంది. విషయం ఏమిటని వలంటీర్లు, అధికారులను అడిగితే ‘మీరు అనర్హులు’ అని సమాధానం ఇస్తున్నారు. వివిధ కారణాలతో పింఛన్లు అగిపోయిన వారిలో 40 ఏళ్ల నుంచి పింఛను తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. 


ఇదేం తీరు..?

తాము అధికారంలోకి వస్తే పింఛను మూడు వేలకు పెంచుతామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పెంచడం మాట దేవుడెరుగు, ఇప్పటి వరకు వస్తున్న పింఛను ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. దివ్యాంగుల పింఛన్ల జాబితాలో కోతలను చూస్తే అది నిజమేననిపిస్తుంది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందని, వేలిముద్రలు సరిగా పడలేదని, కుటుంబ సర్వే కాలేదని.. ఇలా వివిధ కారణాలతో జిల్లా యంత్రాంగం దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేస్తోంది. వివరాలను మరోసారి నమోదు చేసుకుంటే పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఒక్కసారి ఆగిపోయిన పింఛను మళ్ళీ పొందాలంటే అర్హులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వలంటీర్ల, అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని, పరిష్కార మార్గం చూపడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది విషయంలో అధికారులు కనీసం స్పందించడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దివ్యాంగులు వాపోతున్నారు. 


అర్హులకు అన్యాయం


ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. మరోవైపు అన్ని అర్హతలు ఉన్నా పింఛను మంజూరు కాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు, అనారోగ్య కారణాతో దివ్యాంగులుగా మారిన వారి పరిస్థితి దుర్భరంగా తయారైంది. సంపాదించే వ్యక్తి ఒక్కసారిగా మంచానికి పరిమితం అయితే, బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురువుతుంది. భార్యా, పిల్లలను పోషించుకోలేక దివ్యాంగులు మనోవేదనకు గురవుతున్నారు. సదరం క్యాంపులో ఇచ్చిన డిజేబిలిటీ పత్రాలు చూపిస్తున్నా, అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. 



Updated Date - 2021-10-11T05:42:08+05:30 IST