పాపం.. ప్రైవేటు ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-05-10T04:58:31+05:30 IST

కరోనా వల్ల ప్రైవేటు పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దాదాపు ఏడాది పైబడి విద్యా సంస్థలకు సెలవు కావడంతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయా ఉపాధ్యాయులు కుటుంబాలను నెట్టుకుని రావడం కోసం నానా అవస్థలు పడుతున్నారు.

పాపం.. ప్రైవేటు ఉపాధ్యాయులు

కొవిడ్‌ కారణంగా నిత్యం విద్యా సంస్థలకు సెలవులు 

జీతాలు చెల్లించని యాజమాన్యం

కానరాని ప్రభుత్వ సాయం

కలెక్టరేట్‌, మే 9: కరోనా వల్ల ప్రైవేటు పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దాదాపు ఏడాది పైబడి విద్యా సంస్థలకు సెలవు కావడంతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయా ఉపాధ్యాయులు కుటుంబాలను నెట్టుకుని రావడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. 

ఒకటి రెండు నెలలు కాదు ఏడాది నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది మార్చి 23 నుంచి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఉపాధ్యాయులంతా ఇంటి నుంచి బయటకు రాలేదు. అప్పట్లో కొన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సాయం అందించింది. కానీ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయలకు ఎలాంటి సహకారం అందివ్వలేదు. దీంతో కొంత మంది ఉపాధ్యాయలు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. వివిధ కంపెనీలు, ప్రైవేటు పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకున్నారు. గత నవంబరులో కొన్ని తరగతులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి గత నెల వరకూ అంటే నాలుగు నెలలు పాటు మాత్రమే విద్యా సంస్థలు పని చేశాయి. ఇప్పుడు కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో ఉండటంతో మరోసారి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయలు ఇంటికే పరిమితమయ్యారు. ఇతర పనులకు వెళ్లలేక అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన  తెలంగాణలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు కాస్త ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. ఇక్కడ అటువంటి పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 545 పైబడి ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200 వరకూ ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ, ఐటీఐ, డైట్‌తోపాటు వివిధ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 12 నుంచి 13 వేల మంది వరకూ పని చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు. 


Updated Date - 2021-05-10T04:58:31+05:30 IST