సాగర్‌ 22 క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2021-08-03T06:43:34+05:30 IST

సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద ఉధృతి పెరగటంతో సోమవారం 22 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ 22 క్రస్టుగేట్ల నుంచి నీటి విడుదల
సాగర్‌ 22 గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు

3,33,051క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాక

నాగార్జునసాగర్‌/చింతలపాలెం, ఆగస్టు 2: సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద ఉధృతి పెరగటంతో సోమవారం 22 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.50 అడుగులు (305.8030టీఎంసీలు) ఉంది. శ్రీశైలం క్రస్టుగేట్ల నుంచి 2,74,320 క్యూసెక్కులు, మొదటి జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 30,182 క్యూసెక్కులు, రెండో జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 33,549క్యూసెక్కులు మొత్తం ఎగువ నుం చి సాగర్‌ జలాశయానికి 3,38,051క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం ఉదయం సాగర్‌ 22 క్రస్టుగేట్లను 10అడుగుల మేర ఎత్తి 3,19,374క్యూసెక్కు లు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 33,333క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 601 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీతో 1800క్యూసెక్కులు, వరద కాల్వతో 600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు ఎటువంటి నీటి విడుదల లేదు. సాగర్‌ నుంచి మొత్తం 3,55,708క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి 3,38,051క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

సాగర్‌లో పర్యాటకుల సందడి

సాగర్‌ ప్రాజెక్టు క్రస్టుగేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్‌ జలాశయం వద్దకు వచ్చారు. సాగర్‌ ప్రాజెక్టు ముందున్న కొత్త వంతెన వద్ద, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి వెళ్లే దారిలో, దయ్యాలగండి పుష్కరఘాట్‌ వద్ద పర్యాటకులు సరదాగా గడిపారు. హాలియాలో సీఎం సభకు వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు వీఐపీ హోదాలో వచ్చి ప్రధాన డ్యాం నుంచి నీటి విడుదల దృశ్యాలు తిలకించారు. 

పులిచింతల ప్రాజెక్టులో 17క్రస్టుగేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్‌ 22 క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో సూ ర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 3,34,661క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 17క్రస్టుగేట్లను 2.5మీటర్లు ఎత్తి 3,06,248క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్‌హౌస్‌ నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ మూడు యూనిట్ల ద్వారా 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు టీఎస్‌ జెన్కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77 టీఎంసీలు) కాగా 172.20అడుగులు (41.53టీఎంసీలు)చేరింది.

Updated Date - 2021-08-03T06:43:34+05:30 IST