ఏర్పాట్లు సరే.. అనుమతులేవీ?

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

సాగర్‌ జలాశయంలోని నీటికి కుడి, ఎడమ కాలువకు వినియోగించేందుకు ఇరు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ అనుమతులు తప్పనిసరి.

ఏర్పాట్లు సరే.. అనుమతులేవీ?
కుడి కాలువ

సందిగ్ధంలో కుడి కాలువకు నీటి విడుదల

కేఆర్‌ఎంబీ అనుమతి ఇస్తేనే..

అనుమతుల కోసం ప్రతిపాదనలు 

సాగర్‌ కుడి కాలువకు 132 టీఎంసీల నీరు కేటాయింపు

15 నుంచి నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు

ఏర్పాట్లు చేస్తున్న జలవనరుల శాఖ


సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 15న నీటి విడుదల చేయాలని ప్రభుత్వం జలవన రుల శాఖను ఆదేశించింది. కుడికాలువకు 132 టీఎంసీల నీటిని కేఆర్‌ఎంబీ కేటాయించింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. నిర్ణీత తేదీన కుడి కాలువకు నీటిని విడుదల చేసేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి అనుమతి లభించాలి. ఈ అనుమతుల కోసం ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ప్రతి పాదనలు పంపింది. ప్రభుత్వం ముందుగా ప్రకటిం చిన తేదీన నీటిని విడుదల చేసేందుకు బోర్డు అను మతుల కోసం ఎదురు చూస్తోంది. కేటాయించిన నీటిని నెలలవారీగా వినియో గానికి కూడా కేఆర్‌ ఎంబీనే షెడ్యూల్‌ను కూడా ప్రకటించాల్సి ఉంది.      ఈ అంశాలను పరిశీలిస్తే నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. అయితే నీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను జలవనరుల శాఖ చేస్తోంది. 


 నరసరావుపేట, జూలై5: సాగర్‌ జలాశయంలోని నీటికి కుడి, ఎడమ కాలువకు వినియోగించేందుకు ఇరు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ అనుమతులు తప్పనిసరి. ఈ దిశగా ముందునుంచే ప్రయత్నాలు చేయకుండానే ప్రభుత్వం నీటి విడుదల తేదీని ప్రకటించింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, జలాశయాలలోకి వరద ప్రవాహం అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు వరద నీటి అంచనా వేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే సాగర్‌ నుంచి సాగునీటి విడుదల చేసే అంశంపై కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా అల్మటి, తుంగభద్ర జలాశయాలు ఇంకా నిండలేదు. ఇవి నిండాలంటే 129.30 టీఎంసీల నీరు ఆ డ్యామ్‌లకు రావాల్సి ఉంది. కనీసం 100 టీఎంసీల వరద వస్తేనే ఆ రెండు జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తారు. నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులలో నీటినిల్వలు పూర్తిస్థాయిలోనే ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నిండాలంటే ఇంకా 171.99 టీఎంసీల నీరు అవసరం. ఈ జలాశయానికి ఉన్న నీటి నిల్వలతో పాటు ఇంకా 125 టీఎంసీల నీరు వస్తేనే సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. దాదాపు 225 టీఎంసీల నీటి లోటు ఉంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొనే కేఆర్‌ఎంబీ కుడికాలువకు నీటి విడుదలపై నిర్ణయిస్తుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. కృష్ణానదీ పరివాహ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే ఆ మేరకు నీటి నిల్వలు జలాశయాలకు చేరే అవకాశం ఉంటుంది. కుడికాలువకు నీటిని విడుదల చేసేందుకు ముందుగా ప్రకటించిన తేదీని అమలు చేయాలంటే కేఆర్‌ఎంబీతో చర్చలు జరిపి అనుమతులు పొందేందుకు కృషి చేయాలి. అప్పుడే ప్రభుత్వం ప్రకటించిన తేదీ 15న నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఏ మేరకు ప్రభుత్వం స్పందిస్తుందో చూడాలి. కేఆర్‌ఎంబీ నుంచి నీటి విడుదల ఇంకా అనుమతులు రాలేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 

 

తాగునీటి సరఫరా నిలిపివేత

కుడి కాలువకు సాగర్‌ జలాశయం నుంచి తాగునీటి సరఫరాను నిలిపివేసినట్టు జలవనరుల శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. సుమారు ఆరు టీఎంసీల నీటిని సరఫరా చేశారు. జూన్‌ 20న నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. 

 


Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST