జూలై 15న సాగర్‌ నీరు విడుదల

ABN , First Publish Date - 2022-05-21T06:42:21+05:30 IST

సాగర్‌ నీరు ఈ ఏడాది ముందుగానే జూలై 15న విడుదల చేయాలని నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.

జూలై 15న సాగర్‌  నీరు విడుదల
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి నాగార్జున

చివరి ఆయకట్టు వరకూ ఇవ్వాలి

నియోజకవర్గాల వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి

అధికారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం 

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 20 : సాగర్‌ నీరు ఈ ఏడాది ముందుగానే  జూలై 15న విడుదల చేయాలని నిర్ణయించినట్లు  జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. చివరి ఆయకట్టు వరకూ నీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్‌లోని స్పందన హాలులో శుక్రవారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహామండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా సాగునీటి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జంగిల్‌ క్లియరెన్స్‌, కాలువల మరమ్మతు పనులను సత్వరమే  పూర్తి చేయాలని సూచించారు. సాగునీరు ఏ రోజుల్లో ఎంత మొత్తంలో ఏ ప్రాంతానికి విడుదల చేయాలో సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ వివరాలను రైతులకు తెలియజేయడంతోపాటు, ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయడంతోపాటు రైతుభరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయడంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సాగునీటి పంపిణీలో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. జడ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కాలువ మరమ్మతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల దెబ్బతిన్న చీమకుర్తి- కారుమంచి కాలువ గట్టుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. సమావేశంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, డాట్‌ శాస్త్రవేత్త వరప్రసాద్‌, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, పీడీసీసీబీ చైర్మన్‌ మాదాసి వెంకయ్య, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌,  అధికారులు ఆశాదేవి, బేబిరాణి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌రెడ్డి, యుగంధర్‌, వెంకట రమణ, శీనారెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు. కాగా పశువుల కోసం ప్రభుత్వం ఒంగోలు నియోజకవర్గానికి కేటాయించిన అంబులెన్స్‌ను మంత్రులు సురేష్‌, నాగార్జున, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తదితరులు ప్రారంభించారు. 



Updated Date - 2022-05-21T06:42:21+05:30 IST