సాగు..తున్నారు

Jul 25 2021 @ 23:38PM
పత్తిలో కలుపు తొలగింపుకు అరక తొలుతున్న రైతు

ఊపందుకున్న పంటల సాగు

జిల్లావ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు

ఇప్పటికి పంటలు 12 శాతం సాగు

 

జిల్లా సాధారణ వర్షపాతం :  212.8(ఎంఎం)

నమోదైన వర్షపాతం     :  270.5 (ఎంఎం)

పంటల సాగు లక్ష్యం : 5,20,214  హెక్టార్లు

పంటలు సాగైన విస్తీర్ణం : 58,886 హెక్టార్లు

పత్తి సాగు సాధారణ విస్తీర్ణం : 1,69,500 హెక్టార్లు

పత్తి సాగైన విస్తీర్ణం : 35,815 హెక్టార్లు

మిరప సాగు సాధారణ విస్తీర్ణం : 73,777 హెక్టార్లు

మిరప సాగైన విస్తీర్ణం : 526 హెక్టార్లు

వరి సాగు సాధారణ విస్తీర్ణం : 1,99,581 హెక్టార్లు

వరి సాగైన విస్తీర్ణం : 19,435 హెక్టార్లు

అపరాలు సాగు సాఽధారణ విస్తీర్ణం : 32,719 హెక్టార్లు

అపరాలు సాగైన విస్తీర్ణం : 1,468 హెక్టార్లు


వరుణుడు కరుణించాడు. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వర్షాభావం వీడింది. సాగునీటి కష్టాలు తీరాయి. దుక్కులు దున్ని వాన కోసం ఎదురుచూస్తున్న రైతులు ఇటీవల కురిసిన వర్షాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వాన నీటితో పొలాలు సాగుకు సిద్ధమయ్యాయి. పంటల సాగు ఊపందుకుంది. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటికీ పంటల సాగు 12 శాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటికే వేసిన పంటలు ఇటీవల కురిసిన వర్షాలతో కళకళ లాడుతున్నాయి. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో పొలాలను సిద్ధం చేసి పత్తి, మిరప విత్తనాలను నాటుతున్నారు. వర్షాలతో పత్తి పంట సాగు ఆశాజనకంగా ఉంది.  వరి సాగు నామమాత్రంగా ఉంది. 


నరసరావుపేట, జూలై 25: జిల్లావ్యాప్తంగా పది రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పంటల సాగు లక్ష్యం 5,20,214 హెక్టార్లు. ఇప్పటి వరకు 58,886 హెక్టార్లలో పంటల సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు విస్తృతంగా పత్తి సాగు చేపట్టారు. 35,815 హెక్టార్లలో పత్తి సాగైనట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి సాగు సాధారణ విస్తీర్ణం 1,99,581 హెక్టార్లు. ఇప్పటి వరకు 19,435 హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. మిరప 73,777 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా స్వల్పంగా 526 హెక్టార్లలో ఇప్పటికి మిరప సాగైనట్టు వ్యవసాయ శాఖ చెపుతున్నది. అపరాలు  1,468 హెక్టార్లలో సాగు చేశారు. పత్తి సాధారణ విస్తీర్ణం 1,69,500 కాగా 35,815 హెక్టార్లలో సాగు చేశారు. కృష్ణా డెల్టాకు సాగు నీరు విడుదల కావడంతో ఆ ప్రాంతంలో వరి సాగు ఊపందుకునున్నది. శ్రీశైలం జలశయానికి వరద నీరు పోటెత్తుతుండటంతో సాగర్‌కు కూడా వరద ప్రవాహం పెరిగింది. దీంతో సాగర్‌ కుడి కాలువ ఆయకట్టులో కూడా వరి సాగుపై ఆశలు నెలకొంటున్నాయి.


నిండుకుండల్లా జలశయాలు

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తున్నది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాల జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది.  ఈ జలాశయానికి 3,50,408 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. నారాయణ్‌పూర్‌ జలాశయానికి 3,14,574 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా ఇక్కడ నుంచి 3,33,827 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగాను 6.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడ నుంచి శ్రీశైలంకు 3,30,741 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 215.81 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం కాగా 117.77 టీఎంసీల నిల్వలు ఉన్నాయి.  శ్రీశైలంకు 3,62,868 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా ఇక్కడ నుంచి 36,059 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో 312.05 టీఎంసీలు పూర్తి నిల్వ సామర్థ్యం కాగా 183.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగర్‌కు 31,784 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. వరద ప్రవాహం శ్రీశైలానికి ఇలాగే మరో వారం రోజులు కొనసాగుతుందన్న అంచనా. ఈ క్రమంలో సాగర్‌ ఆయకట్టులో సాగు నీరు విడుదల చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.