సాగుదారు.. బేజారు!

Jul 26 2021 @ 23:10PM

ధరల పతనంతో కుదేలైన రైతన్న

చేదు మిగిల్చిన మామిడి

పెట్టుబడులు కూడా దక్కక ఆర్థిక ఊబిలోకి..

నిమ్మ.. కర్షకుడి కంట చెమ్మ

ఇంటి గుమ్మం దాటన పసుపుకొమ్ము


తక్కువ శ్రమతో లాభసాటి సేద్యం చేద్దామనే ఉద్దేశంతో వాణిజ్య పంటల వైపు మళ్లిన రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. తీపిని పంచాల్సిన మామిడి చేదును మిగల్చగా, నిమ్మ రైతుకు కన్నీరొలికింది. గతేడాది దిగుబడులను అమ్ముకోలేని క్రమంలో పసుపు సాగుకు కర్షకులు దూరమయ్యారు. కాలువ నీటి పారుదల అవకాశం లేని మెట్ట ప్రాంతాల్లో వాణిజ్య పంటలే రైతుల జీవనాధారం. అయితే ఈ ఏడాది అన్ని పంటలు రైతులను నట్టేట ముంచాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మెట్ట రైతు మరింత రుణగ్రస్తుడయ్యాడు. 


నెల్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : గూడూరు డివిజన, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలో నిమ్మ విస్తారంగా సాగవుతోంది. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. గూడూరు నిమ్మ మార్కెట్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సీజనలో ఈ మార్కెట్‌ నుంచి దేశవ్యాప్తంగా నిమ్మ కాయలు ఎగుమతి అవుతాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మార్కెట్‌ ప్రస్తుతం వెలవెలబోతోంది. కిలో ధర 5 రూపాయలకు పడిపోవడంతో మార్కెట్‌కు కాయలు తేవడం కన్నా తోటల్లోనే వదిలేయం ఉత్తమమని రైతులు నిర్ణయించుకున్నారు. జిల్లా నుంచి ఏటా 3.20 లక్షల టన్నుల వరకు నిమ్మకాయల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దిగుబడులు వచ్చాయి. అయితే, ధర మాత్రం దారుణంగా పతనమైంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో కిలో నిమ్మ 80-120 రూపాయలు పలకగా మే నాటికి రూ.30 నుంచి50కి పడిపోయింది. జూన, జూలై నెలల్లో ఆ ధర మరింత దిగజారి కిలో రూ.5 నుంచి పదికి చేరింది. కిలో ధర రూ.30 పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుత ధర కోతలు, రవాణాకు కూడా సరిపోవు. దీంతో రైతులు పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. కరోనా కారణంగా దేశంలోని పెద్ద మార్కెట్లు మూతపడటం ఒక కారణం కాగా నిమ్మ ఉప ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు లేకపోవడం ధరల పతనానికి మరో కారణం. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు నాణ్యతను బట్టి రూ.7 నుంచి 20 పలుకుతోంది.


డీలాపడిన ఫలరాజు


గత ఏడాది బంగినపల్లి రకం టన్ను లక్ష రూపాయలు పలికింది. ఈసారి 12 నుంచి 13 వేలకు అమ్ముకోవాల్సి వచ్చింది. తోతాపూరి రకం గత ఏడాది టన్ను రూ.25 వేల నుంచి 30 వేలు పలికింది. ఈ ఏడాది రూ.7-8వేలకు మించలేదు. సీజన దాదాపుగా ముగిసిపోతుండగా గత రెండు మూడు రోజులుగా ధర కాస్త పెరిగింది. కానీ ఇప్పటికే 95 శాతానికిపైగా పంట అతి తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. జిల్లాలో 30 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి ఎకరంపై రైతుకు 30 నుంచి 40వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ధర పతనం కారణంగా రైతులకు ఈ పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. పూత దశలో వర్షాలు పడటంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు 3 టన్నులకు మించి రాలేదు. దీనికి తోడు ధర పతనం కావడంతో పంట సాగు కోసం రైతులు పెట్టిన 90 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. 


మగ్గిపోతున్న పసుపు నిల్వలు


ఉదయగిరి ప్రాంతంలో పసుపు రైతులు గత ఏడాది పసుపును అమ్ముకోలేక, ఈ ఏడాది పసుపు సాగు  విరమించుకున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల్లో పసుపు సాగు చేస్తారు. గత ఏడాది ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటం రూ.6,850 మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో ఈ ఏడాది రైతులు ధైర్యంగా పసుపు సాగు చేశారు. కానీ  ఈ ఏడాది ప్రభుత్వం పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ధర గణనీయంగా పతనమైంది. గత ఏడాది బహిరంగ మార్కెట్‌లో క్వింటం 7నుంచి 8వేల వరకు అమ్ముడుపోగా ఈ ఏడాది 4500 నుంచి 5200కు మించి పలకడం లేదు. ఈ ధరకు కూడా కొనేవారు లేకపోవడంతో సుమారు వందల క్వింటాళ్ల పసుపు నిల్వలు రైతుల ఇళ్లలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు ప్రాధేయపడుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. దీంతో ఈ కారు పసుపు సాగుకు రైతులు విరామం ప్రకటించారు. జూన నెలలో పంట వేయాల్సి ఉంది. సాదారణ విస్తీర్ణం 400 ఎకరాలు కాగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి కేవలం రెండు హెక్టార్లు అంటే ఐదు ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 

చేమగడ్డల ధరలూ పడిపోయాయి. దళారుల ప్రమేయం ఎక్కువవడంతో గడ్డలకు మార్కెట్టే లేదంటూ కిలో 5-8 రూపాయలకు అడుగుతున్నారు. దీంతో సాగుదారులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. 

 

 

రవాణాలేక నష్టపోయా


మా పొలంలో బంగినపల్లి మామిడి చెట్లు పెంచుతున్నాను. ఈ సీజనలో కాపు బాగా వచ్చింది. కరోనా వల్ల రవాణా వ్యవస్ధ స్ధంబించడంతో మామిడిపండ్లు ఇతర ప్రాంతాలకు రవాణా చేయలేకపోయాము. కర్ప్యూ సమయం,సడలింపుల వల్ల వ్యాపారం అంతంత మాత్రమే సాగింది. పండ్డు మార్కెట్టులో ఎక్కువ కావడంతో ధర తగ్గించి అమ్మాల్సి వచ్చింది.ప్రతీ ఏటా జిల్లా నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాషా్ట్రలకు రవాణా చేయలేకపోయాం. పండ్ల రవాణా చేయలేనందు వల్ల, పండ్లు చెట ్లనుంచి రాలిపడ్డాయి. ఇప్పటికీ చెట్ల కింద రాలిన పండ్లను తొలగించనేలేదు. కరోనా వల్ల పండ్లు బాగా వచ్చినప్పటికీ గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక నష్టపోయాము.

- సోమవరపు సురేష్‌రెడ్డి, మామిడి సాగు రైతు, ముదివర్తి.అప్పులే మిగిలాయి


పసుపు పంట సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలాయి. తాను రెండెకరాల్లో పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షలు ఖర్చయ్యింది. గతేడాది నవంబర్‌ కురిసిన వర్షాలకు దిగుబడి బాగా తగ్గింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.4,500ల నుంచి రూ.5,200లు పలుకుతుంది. ఈ ధరకు పెట్టుబడులు కూడా రావు. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్న ఆశతో దిగుబడులు నివాసాల్లో నిల్వ చేసుకొన్నాం. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిల్వ చేసిన పసుపును కాపాడుకొనేందుకు అవస్థలు పడడంతోపాటు నాణ్యత కోల్పోతుంది. 

- ఈర్ల శంకర్‌, రైతు, కొత్తపల్లి


గిట్టుబాటు ధర కల్పించాలి


నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ నిమ్మకాయలు రూ. 5 నుంచి రూ. 15 వరకు ధర పలుకుతున్నాయి. గతంతో పోలిస్తే సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, దుక్కి ధరలు పెరగడంతో రైతులు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. కేజీ నిమ్మకాయలు కనీస ధర రూ. 30 ఉంటేనే ఖర్చులకు సరిపోతుంది. లేదంటే నష్టాలు చవిచూడాల్సివస్తుంది. 

- కే.వెంకటేశ్వర్లురాజు, నిమ్మరైతు

ఉదయగిరి రూరల్‌ : కొత్తపల్లిలోని ఓ రైతు ఇంట్లో పసుపు నిల్వలు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.