రామయ్యకు సహస్ర కలశాభిషేకం

ABN , First Publish Date - 2021-02-28T05:00:48+05:30 IST

భద్రాచలంలో నిర్వహిస్తున్న సహస్ర కలశాభిషేక మహోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు శనివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

రామయ్యకు సహస్ర కలశాభిషేకం
రామయ్యకు కలశాభిషేకం నిర్వహిస్తున్న వేదపండితులు

ఉత్సవ మూర్తులకు సహస్రధారతో అభిషేకం

నేటి నుంచి నిత్య కల్యాణాల పునరుద్దరణ

వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం

భద్రాచలం, ఫిబ్రవరి 27:  భద్రాచలంలో నిర్వహిస్తున్న సహస్ర కలశాభిషేక మహోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు శనివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు మంజరి అద్ది గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, ప్రసాద నివేదన చేశారు. ఈ క్రతువుతో ఈ మహోత్సవాలు ముగియడంతో ఆదివారం నిత్యకల్యాణాలను పునరుద్దరించనున్నారు. కార్యక్రమంలో స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామచంద్రాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, ఆలయ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌ పాల్గొన్నారు.  

వైభవంగా రంగనాయకస్వామి కల్యాణం

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో రంగనాయకస్వామి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. స్థానిక రంగనాయకుల గుట్టపై వేంచేసి ఉన్న శ్రీదేవి-భూదేవి సమేత రంగనాయకస్వామికి ధ్యాన మందిరంలో కల్యాణంను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ముందుగా కల్యాణ సామాగ్రిని భద్రాద్రి దేవస్థానం తరపున రామాలయం నుంచి మేళతాళాలు, కోలాటాల నడుమ ధ్యాన మందిరంకు తీసుకొచ్చారు. అనంతరం కల్యాణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. కల్యాణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరపున కల్యాణమూర్తులకు పట్టు వస్ర్తాలు సమర్పించారు.  భద్రాచలంలోని శిల్పినగర్‌లో గల శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవతా శక్తిపీఠంలో శనివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. కార్యక్రమలోఓ ఆలయ వ్యవస్థాపకులు కేవీ సుబ్రమణ్య శర్మ, విశ్వతేజ శర్మ, వెంకటేశ్వరరావు, శ్రవణ్‌కుమార్‌, జనార్దనరావు, రమాదేవి, వాణి, మహాలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T05:00:48+05:30 IST