Advertisement

సాయిబాబా ‘ఆమరణ దీక్ష’ హక్కుల పోరాటమే!

Oct 21 2020 @ 03:21AM

అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్న స్థితిలో, అచేతనంగా మరణించే బదులు, కనీసం పోరాడి తనతో పాటు రాజకీయ ఖైదీల హక్కుల్ని సాధించుకోవాలనే సాయిబాబా తపనను మనందరం బలపర్చాల్సిందే. ఏ శిక్ష ఐనా పరివర్తనను ప్రేరేపించేట్టు ఉండాలి. పగపట్టినట్టు ఉంటే అది శిక్ష కాదు. ప్రశ్నించే హక్కుపై కక్ష తీర్చుకోవటం అవుతుంది. ప్రజాస్వామ్య విలువలు లోపించిన సమాజం, జైళ్ళు అనేక అసహజ మరణాలకు కేంద్రాలవుతాయి. వాటిని ప్రశ్నించే స్థితి కూడా వుండదు. పూర్తిగా నియంతృత్వం, ఫాసిజం రాజ్యమేలుతుంది. హత్రాస్‌ ఘటనలోవలె తామే చంపేస్తారు. తామే శవాన్ని కాల్చేస్తారు. బాధితుడే దోషి అన్నట్టు పెంపుడు మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. మొన్నటి వరకు మావోయిస్టు కావటాన్ని నేరంగా చూసిన ప్రభుత్వాలు, నేడు ప్రశ్నించటాన్ని కూడా నేరంగా భావిస్తున్నాయి.


ఢిల్లీలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జి.ఎన్. సాయిబాబాకు గడ్చిరోలి మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్నదని ఆరోపించి, ఆయనపై కుట్రపూరిత కేసులు నమోదు చేసి, అన్యాయంగా శిక్ష వేసి, నాగపూర్‌ సెంట్రల్‌ జైలు అండా సెల్‌ లో బంధించారు. ఆయన ఆ శిక్షను అనుభవిస్తూనే ఖైదీల కనీస హక్కులను సాధించడం కోసం నేటి నుంచి (అక్టోబర్ 21) మొదలుపెట్టనున్న ఆమరణ దీక్షకు ప్రజాస్వామిక వాదులందరూ మద్దతు ప్రకటించి విజయవంతం చేయాలి.


నేటి ప్రభుత్వం ఫాసిస్టు వైఖరితో సమాజంలో ప్రశ్నించే గొంతులను మాట్లాడనీయకుండా జైళ్ళల్లోకి నెడుతున్నది. ఈ వైఖరితోనే 90% వికలాంగుడైన జి.ఎన్‌. సాయిబాబాను తప్పుడు కేసులతో అరెస్టు చేశారు. సాయిబాబా ఒక రాజకీయ ఖైదీ. రాజకీయ ఖైదీలకూ జైళ్ళల్లో హక్కులుంటాయి. హక్కులు లేకుండా సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ ఉండడు. అసలు కొన్ని దేశాల్లో ‌‌వికలాంగులను జైళ్ళల్లో నిర్బంధించడమే ఉండదు. కాని ఇక్కడ మాత్రం నిర్బంధమే కాదు, నిర్బంధ కాలంలో ఏ రాజకీయ ఖైదీకైనా జైళ్ళ మాన్యువల్ ప్రకారం లభించే కనీస హక్కులనూ నిరాకరిస్తున్నది మహరాష్ట్ర ప్రభుత్వం. ఈ హక్కుల్లో ప్రధానమైనది ‘ఆరోగ్య హక్కు’. సాయిబాబాకు ఆరోగ్య హక్కు లేనేలేనట్టు ఆయనకు అందాల్సిన వైద్యాన్ని అందనివ్వకుండా, ఇవ్వాల్సిన మందులను ఇవ్వకుండా, జీవించే హక్కు కోల్పోయేలా చేస్తున్నది. 


తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న సాయిబాబా ప్రతి రోజూ సుమారు 14 రకాల మందులను తీసుకోవాలి. ఆ మందులను కుటుంబ సభ్యులు జైలు అధికారులకు అందించారు కూడా. కానీ జైలు అధికారులు వాటిని సాయిబాబాకు ఇవ్వటం లేదు. దీని వల్ల సాయిబాబా ప్రాణాపాయ స్థితికి చేరువయ్యారు. అసలే చిన్నతనంలో పోలియో మూలంగా ఆయనకు రెండు కాళ్ళు అచేతనంగా ఉంటాయి. తక్కిన శరీరం నిత్యం ‘ఫిజియోథెరపీ’ తీసుకోవటం వలన కండరాల కదలికలకు ఆటకం లేకుండా ఉండేది. కాని జైలులో ఆ సదుపాయం లేక ఇప్పటికే రెండు చేతులు పైకి లేవని స్థితికి చేరాయి. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్న స్థితిలో, అచేతనంగా మరణించే బదులు, కనీసం పోరాడి తనతో పాటు రాజకీయ ఖైదీల హక్కుల్ని సాధించుకోవాలనే సాయిబాబా తపనను మనందరం బలపర్చాల్సిందే. ఎంతో ప్రాణాపాయంతో మొదలవుతున్న ఈ ఆమరణ దీక్షా పోరాటాన్ని విజయవంతం చేయడం ద్వారానే మనం సాయిబాబా ‘జీవించే హక్కు’ను కాపాడుకోగలం. సాయిబాబాకు బతకాలంటే జైల్లో కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో ఆయన పోరాటానికి మద్దతుగా బయట సమాజంలో కూడా పోరాటాన్ని, ఉద్యమాన్ని నిర్మించగలిగితే రాజకీయ ఖైదీల హక్కుల్ని కాపాడుకున్నవాళ్ళం అవుతాం. రాజకీయ ఖైదీల్ని కాపాడుకోవటమంటే మనందరి ప్రశ్నించే హక్కును మనం కాపాడుకోవటమే. 


ఈ ఆమరణ దీక్ష వల్ల సాయిబాబా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నవారు ఎక్కువమందే ఉన్నారు. కాని ఆయనకు పోరాటం తప్ప గత్యంతరం లేని పరిస్థితిని కల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వ దమన నీతిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులందరిపైనా ఉన్నది. ఒకవైపు భీమాకోరేగావ్ ఆరోపితుల్ని విడిపిస్తాం అన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. వెంటనే ఎన్‌.ఐ.ఎ. ప్రవేశించి కేసును తన ఆధీనంలోకి తీసుకుంటున్నది. కాని నాగపూర్‌ జైలు మహారాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కదా ఉండేది. వికలాంగుడికి మందులను కూడా అందకుండా చేయటమంటే అతని జీవించే హక్కును ప్రభుత్వం కాలరాచినట్టే కదా!


ఏ శిక్ష ఐనా పరివర్తనను ప్రేరేపించేట్టు ఉండాలి. పగపట్టినట్టు ఉంటే అది శిక్ష కాదు. ప్రశ్నించే హక్కుపై కక్ష తీర్చుకోవటం అవుతుంది. ప్రజాస్వామ్య విలువలు లోపించిన సమాజం, జైళ్ళు అనేక అసహజ మరణాలకు కేంద్రాలవుతాయి. వాటిని ప్రశ్నించే స్థితి కూడా వుండదు. పూర్తిగా నియంతృత్వం, ఫాసిజం రాజ్యమేలుతుంది. హత్రాస్‌ ఘటనలోవలె తామే చంపేస్తారు. తామే శవాన్ని కాల్చేస్తారు. బాధితుడే దోషి అన్నట్టు పెంపుడు మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. మొన్నటి వరకు మావోయిస్టు కావటాన్ని నేరంగా చూసిన ప్రభుత్వాలు, నేడు ప్రశ్నించటాన్ని కూడా నేరంగా భావిస్తున్నాయి. సమాజం మొత్తాన్ని కశ్మీర్‌లాగా ఒక బహిరంగ జైలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడుగు వేయాలంటే చక్రబంధం లాంటి పరిస్థితి. మొన్నటిదాకా ప్రజా సంఘాల తలలపైనే వేలాడిన ‘నిర్బంధం’ కత్తి నేడు సమాజంలో ప్రతి సామాన్యుడినీ భయపెడుతున్నది. ఇలాంటి స్థితిలో ప్రజాస్వామిక వాదులకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఆమరణ దీక్షతో జి.ఎన్. సాయిబాబా మొదలుపెడుతున్న ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం దానికి మద్దతుగా నిలవటమే కాదు, అందులో భాగస్థులమై విజయవంతం చేసే బాధ్యతనూ తీసుకోవాలి. బుద్ధి జీవులందరు రాజకీయ ఖైదీలవుతున్న ఈ ప్రమాదకర స్థితిని ఎదిరించాలి. ప్రతి ఖైదీకీ హక్కులుంటాయి. వాటి అమలు కోసం అందరం ఒక్కటై నినదిద్దాం.

ఎన్‌. నారాయణ రావు

ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.