పట్టింపు లేక.. ప్రాణాలకు ముప్పు..!

ABN , First Publish Date - 2021-09-12T07:51:45+05:30 IST

సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి రహదారిపై ఉన్న ఇసుక, మట్టి ఒక కారణమని స్థానికులు, సినీ ప్రముఖులు, పోలీసులు చెబుతున్నారు.

పట్టింపు లేక.. ప్రాణాలకు ముప్పు..!

  • రహదారుల నిర్వహణ పట్టని జీహెచ్‌ఎంసీ
  • ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించి.. పట్టించుకోని వైనం
  • ఆ మార్గాలలో ఇసుక, కంకర మేట.. తొలగించని ప్రైవేట్‌ ఏజెన్సీ 
  • మాన్‌సూన్‌ బృందాలు ఏం చేస్తున్నట్లు 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి రహదారిపై ఉన్న ఇసుక, మట్టి ఒక కారణమని స్థానికులు, సినీ ప్రముఖులు, పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలం వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడానికి రోడ్డు  సరిగ్గా లేకపోవడమే కారణమంటున్నారు. ఈ ప్రమాదంతో నగర రహదారుల నిర్వహణ దుస్థితి మరోమారు చర్చనీయాంశంగా మారింది. గుంతలు, ప్యాచ్‌ల మరమ్మతులను పక్కన పెడితే, రోడ్లపై ఉన్న ఇసుక, మట్టి, కంకర కూడా తొలగించే పరిస్థితి లేదు. పారిశుధ్య కార్మికులున్నా, వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఎందుకిలా, పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ప్రైవేట్‌ ఏజెన్సీ పరిధిలో ఆ రోడ్డుపై ఇసుక/మట్టి మేట వేసినా పట్టించుకోకపోవడానికి కారణమేంటి అంటే అధికారులు సమాధానం దాటవేస్తున్నా రు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపై ఇసుక, కం కర కనిపిస్తోంది.  సాధారణ వేగంతో వెళ్లే వాహనదారులూ ఇసుక, కంకర  వల్ల అదుపు తప్పి కింద పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తీవ్ర గాయాలతో, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. ఇంకొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి.


మాన్‌సూన్‌ బృందాలు ఏం చేస్తున్నాయి..? 

ప్రధాన రహదారులపై పారిశుధ్య కార్మికులకు ప్రమాదాలు జరుగుతోన్న నేపథ్యంలో స్వీపింగ్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. దుర్గం చెరువు నుంచి ఐకియా మార్గంలోనూ మిషన్లతో స్వీపింగ్‌ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. యంత్రాలు కంకర, ఇసుక వంటివి పూర్తిగా తొలగించలేవు.  మనుషులే వీటిని తొలగించాలి. యంత్రాలు స్వీపింగ్‌ చేసే మార్గాల్లో పారిశుధ్య కార్మికులు పని చేయరని, రోడ్డు నిర్వహణలో భాగంగా కాంట్రాక్టు సంస్థలే ఈ విషయాన్ని చూ సుకుంటున్నాయని హెల్త్‌, శానిటేషన్‌ విభాగం అధికారొకరు తెలిపారు.  మార్గంలో ఇసుక, కంకర, ఇతర వ్యర్థాల తొలగింపునకు ప్రైవేట్‌ ఏజెన్సీ కార్మికులను నియమించిందా..? లేదా..? అన్న విషయమూ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. 


వర్షాకాలం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృం దాలు వర్షాలు లేనప్పుడు ఏం చేస్తున్నాయో ఎవరి కీ తెలియని పరిస్థితి. కాంట్రాక్టర్లకు మేలు చేసే క్రమంలోనే ఇంజనీరింగ్‌ అధికారు లు మాన్‌సూన్‌ బృందాల పనితీరును పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తముతోంది.


ప్రైవేట్‌ ఏజెన్సీ పరిధిలో... 

ప్రమాదం జరిగిన రహదారి టీఎ్‌సఐఐసీ పరిధిలోకి వస్తుంది. మెరుగైన నిర్వహణలో భాగంగా ఐటీ కారిడార్‌లోని ప్రధాన మార్గాలను కాంప్రెహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా సంస్థ జీహెచ్‌ఎంసీ ద్వారా ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించింది. ఈ మార్గాల్లో రహదారుల నిర్మాణం, మరమ్మతు, నిర్వహణ పనులు, స్వీపింగ్‌ కూడా ఆ సంస్థనే చేయాలి. కానీ, ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుక, కంకర కొకొల్లలుగా కనిపిస్తోంది. సంబంధిత ఏజెన్సీ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. నగరంలోని 709 కి.మీల మెయిన్‌ రోడ్లను నాలుగు ఏజెన్సీలకు అప్పగించారు. ప్రైవేట్‌ సంస్థల అధీనంలో ఉన్న మార్గాల్లో రోడ్డుపై గుంత ఏర్పడితే నిర్ణీత సమయంలో పూడ్చివేయాలనీ, ఇసుక, కంకర మేటలను ఎప్పటికప్పుడు తొలగించాలనీ ఒప్పందంలో ఉంది. ఈ మేరకు ప్రకారం పని చేయని పక్షంలో ఏజెన్సీలకు పెనాల్టీ వేయాలి. కానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు.



Updated Date - 2021-09-12T07:51:45+05:30 IST