సినిమా రివ్యూ: గార్గి(Sai pallavi)

Published: Fri, 15 Jul 2022 13:27:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: గార్గి(Sai pallavi)

సినిమా రివ్యూ: గార్గి

విడుదల తేదీ: 15–07–2022

నటీనటులు: సాయిపల్లవి, కాళీ వెంకట్‌, ఆర్‌.ఎస్‌.శివాజీ, ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాష్‌, కలైమణి శరవణన్‌ తదితరులు.

కెమెరా: స్రైయంతి, ప్రేమకృష్ణ

సంగీతం: గోవింద్‌ వసంత,

ఎడిటింగ్‌: షఫీక్‌ మహ్మద్‌ అలీ, 

నిర్మాతలు: రవిచంద్రన్‌, రామచంద్రన్‌, థామస్‌ జార్జ్‌, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్‌ రామచంద్రన్‌;

సమర్పణ: రానా దగ్గుబాటి

రచన, దర్శకత్వం: గౌతమ్‌ రామచంద్రన్‌.


కమర్షియల్‌ సినిమాలతోపాటు, కథా బలమున్న చిత్రాలతోనూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు సాయిపల్లవి. ఇటీవల ‘విరాటపర్వం’లో వెన్నెలగా ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆమె మరో బలమైన కథ ‘గార్గి’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రానా సమర్పించారు. ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌తోనే సాయిపల్లవి మరో ప్రయోగం చేసిందనే టాక్‌తో అంచనాలు పెరిగాయి. రానా రాక మరింత బలానిచ్చింది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులకు ఆకట్టుకుందో చూద్దాం. 


కథ: 

గార్గి (సాయిపల్లవి) నెల్లూరులో ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. తండ్రి బ్రహ్మానందం (ఆర్‌.ఎస్‌.శివాజీ) ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుంటారు. రాత్రి అయినా తండ్రి ఇంటికి రాకపోవడంతో ఆ అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళ్లగా తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో బ్రహ్మానందాన్ని పోలీసులు అరెస్ట్‌ చేసారని తెలుసుకుని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంది. అయితే తండ్రి ఏ తప్పూ చేయలేదని గార్గి బలంగా నమ్ముతుంది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. ఆమె తరఫు వాదించడానికి ఏ న్యాయవాది ముందుకు రారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి నిరపరాధి అని నిరూపించడానికి ‘గార్గి’ ఏం చేసింది. న్యాయం పోరాటంలో విజయం సాధించిందా లేదా? ఆమెకు అండగా నిలిచింది ఎవరు? అన్నది మిగతా కథ. 

సినిమా రివ్యూ: గార్గి(Sai pallavi)

విశ్లేషణ:
తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన తండ్రిని నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఓ కూతురు చేసిన న్యాయ పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. రెగ్యులర్‌ కోర్టు డ్రామా సినిమాల్లా కాకుండా కాస్త భిన్నంగా సాగింది. గార్గి పరిచయం నుంచి తండ్రి ఆరెస్ట్‌ వరకూ ప్రతి సన్నివేశం వేగంగా పరుగు తీస్తుంది. డిస్కర్షన్‌ లేకుండా దర్శకుడు నేరుగా కథలో తీసుకెళ్లిపోయాడు. మైనర్‌ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచార సంఘటనల్ని చెబుతూ చాలా చిత్రాలే వచ్చాయి. ఒక్కో సినిమాది ఒక్కో స్టైల్‌. ఇలాంటి కథల్లో ఉండే ఎమోషన్‌ జర్నీని హృదయాన్ని కదిలించేలా తెరకెక్కించడంలోనే దర్శకుడి ప్రతిభ కనిిపిస్తుంది. ఓ వ్యక్తిపై నింద పడితే బాధిత కుటుంబాన్ని సమాజం ఎలా చూస్తుంది. వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దోషిగా ముద్రపడిన కుటుంబాలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి అన్నది హృద్యంగా చూపించారు. ‘నిందితుల కుటుంబాల పట్ల మీడియా పరిధి దాటి ఎలా ప్రవర్తిస్తుంది, ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుంది’ అన్నది ఆసక్తిగా తెరకెక్కించారు. ‘గార్గి’ తండ్రి అరెస్ట్‌ తర్వాత కుటుంబం ఎదుర్కొనే సంఘర్షణల సన్నివేశం ఆకట్టుకుంది. అయితే మరీ వివరంగా ఆ సన్నివేశాన్ని చెప్పడంతో కథ వేగం కాస్త తగ్గిన భావన కలుగుతుంది. ‘గార్గి’ కోర్టు మెట్లు ఎక్కడం.. ఏ అనుభవం లేని లాయర్‌ కేసును వాదనకు తీసుకోవడంతో ఏం జరగబోతుందా అన్న ఆసక్తి కలుగుతుంది. న్యాయమూర్తి ముందు వాద ప్రతివాదనలు చాలా సహజంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అయితే కోర్టు రూమ్‌ సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించాయి. ఇంటర్వెల్‌ తర్వాత మరింత ఆసక్తిగా కథ సాగుతుంది. కేసులో గెలిచేందుకు గార్గి, లాయర్‌తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేయడం. బాధిత బాలిక కుటుంబాన్ని కలిసి ఆ  పాప తండ్రి చెప్పే మాటలు, పడే ఆవేదన హృదయాన్ని తాకుతాయి. ‘ఇష్టపడి చెప్పేది న్యూస్‌ కాదు.. జరిగింది చెప్పేది న్యూస్‌’ అంటూ మీడియాకు సెటైర్లు కూడా వేశారు. నమ్మకాలు, సాక్ష్యాలతో కోర్టుకు పని లేదని, కావలసింది ఆధారాలు అని చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ దర్శకుడు లాజిక్‌ను ఫాలో అయ్యాడు. కథ చిన్నదే.. ఆయన తెరపై చెప్పిన తీరు.. ఇచ్చిన సందేశం పెద్దది.. గొప్పది. ఊహించని క్లైమాక్స్‌ సినిమాకు ప్లస్‌గానూ, మైనస్‌గానూ అనుకోవచ్చు.

ఇక నటీనటుల  పని తీరుకొస్తే... ‘గార్గి’ క్యారెక్టర్‌లో, టీచర్‌గా సాయిపల్లవి ఒదిగిపోయారు. ఇలాంటి భావోద్వేగ పాత్రలు పోషించడంలో ఆమెది ప్రత్యేకశైలి అని మరోసారి నిరూపించింది. తన నటన, హావభావాలతో కథకు, పాత్రకు ప్రాణం పోసింది. ఎమోషనల్‌ సీన్స్‌లో కంట తడి పెట్టించింది. లాయర్‌ గిరీశంగా కాళీ వెంకట్‌ అద్భుతంగా నటించారు. బాలిక తండ్రిగా కలైమామణి నటన హృదయాన్ని తాకుతుంది. లైంగిక వేధింపులకు సంబంధించిన సన్నివేశాల్ని ఎక్కడా అశ్లీలత, అసభ్యతకు చోటు లేకుండా సోల్‌ను మాత్రమే చూపించారు. న్యాయమూర్తి పాత్రకు ట్రాన్స్‌జెండర్‌ను తీసుకోవడంలో దర్శకుడి ప్రత్యేకత కనిపిస్తుంది. జయప్రకాశ్‌, ఐశ్వర్య లక్ష్మీ పాత్రల మేరకు నటించారు. మగాడిలో పొగరు ఎక్కడ ఉంటుందో.. ఆడ పిల్లలో నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. ఈ కేసుకి తీర్పు చెప్పడానికి నేనే కరెక్ట్‌’ అంటూ ట్రాన్స్‌జెండర్‌తో చెప్పించిన డైలాగ్‌ విజిల్స్‌ వేయిస్తుంది. కథ, కథనం, సాయిపల్లవి నటన, ఊహకు అందని క్లైమాక్స్‌, కుటుంబ భావోద్వేగాలు సినిమాకు ఎసెట్‌ అయ్యాయి. బాధిత కుటుంబం మానసిక క్షోభను మాత్రమే కాదు, దోషులుగా చిత్రీకరించబడిన కుటుంబ పరిస్థితిని చూపించిన ఈ చిత్రం దర్శకుడు ఎవరి పక్షానా లేకుండా ఇరువైపుల నిలబడ్డాడు. తండ్రిని నిర్దోషిగా నిరూపించడం కోసం ‘గార్గి’ పడిన  తపన, ఒత్తిడి చూసి ప్రేక్షకుడు చలించేలా, బాధిత బాలిక తండ్రి బాధను ఫీలయ్యేలా చేశారు. కోర్టు రూమ్‌ సన్నివేశాలు, అక్కడక్కడా కాస్త నత్తనడకన సాగడం డ్రా బ్యాక్‌ అనుకోవచ్చు. టెక్నికల్‌గా సినిమా స్టాండర్డ్స్‌లో ఉంది. గోవింద్‌ వసంత నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ. కెమెరా వర్క్‌ బావుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఓ నిందితుడు, బాధిత బాలిక కుటుంబాల మధ్య ఎమోషనల్‌గా సాగే ఈ కథ ఓ సెక్షన్‌ ఆడియన్స్‌ని తప్పకుండా మెప్పిస్తుంది. సందేశంతో కూడిన ఈ ఎంగేజింగ్‌ కథ భావోద్వేగ కథల్ని, కొత్తదనం కోరుకునే వారిని తప్పకుండా అలరిస్తుంది. సందేశాలు, కథలతో క్లాసులు ఇచ్చే చిత్రాలు నచ్చని వారికి, పూర్తిగా కమర్షియల్‌ చిత్రాలకు అలవాటుపడిన వారికి ఈ కథ అంతగా నచ్చకపోవచ్చు. ఫైనల్‌గా డైరెక్టర్‌ చేసిన గుడ్‌ అటెంప్ట్‌ అని చెప్పొచ్చు.

ట్యాగ్‌లైన్‌: మంచి ప్రయత్నం! 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International