అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం: సజ్జల

ABN , First Publish Date - 2022-01-24T22:27:00+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు నచ్చజెప్పేందుకే కమిటీ వేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరాం: సజ్జల

అమరావతి: ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగుల ప్రతినిధులకు నచ్చజెప్పేందుకే కమిటీ వేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు తొలగించేందుకు చర్చలకు రావాలని కోరామన్నారు. పీఆర్సీ జీవోలు అమలు నిలపాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. చర్చలకు వస్తారని మంగళవారం కూడా ఎదురుచూస్తామని తెలిపారు. చర్చలకు రావాలని మరోసారి సమాచారం పంపుతామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


పీఆర్సీ జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న సమయంలో పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆదివారం పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరగటానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజుకు మంత్రి  పేర్ని నాని, సూర్యనారాయణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని కోరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-01-24T22:27:00+05:30 IST