CM Jagan అత్యంత సన్నిహితుల మధ్య మాటలు దూరం.. అసలు ట్విస్టంతా ఇందులోనే...!

ABN , First Publish Date - 2022-05-23T18:11:37+05:30 IST

ఇద్దరూ వైసీపీలో పవర్‌ సెంటర్లు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. ఇటీవల వీరి మధ్య మాటలు కరువయ్యాయి. ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరుకు దిగారు

CM Jagan అత్యంత సన్నిహితుల మధ్య మాటలు దూరం.. అసలు ట్విస్టంతా ఇందులోనే...!

వారిద్దరూ కలిశారు....కానీ మనసులు కలిశాయో లేదో తెలియదు.  సీఎం ఆదేశాలతో మాట కలిపారు. సజ్జల ఇంటికి విజయసాయి వెళ్లారు.... పైగా సజ్జల ఇంటికి వెళ్ళిన ఫోటోను ట్విట్టర్‌లో విజయసాయి పంచుకున్నారు.  ఒకే పార్టీలోని వీళ్లు ఇద్దరూ కలిస్తే విశేషం ఏముందని అనుకోవచ్చు..  అసలు ట్విస్టంతా ఇందులోనే  ఉంది... వీళ్లు ఇద్దరి భేటీ వెనుక పెద్ద కథే ఉంది... ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూడండి. 


ఇద్దరి మాటలు కరువు..!

సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి. ఇద్దరూ  వైసీపీలో పవర్‌ సెంటర్లు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. ఇటీవల వీరి మధ్య మాటలు కరువయ్యాయి. ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరుకు దిగారు. ఈ ఇగో వార్‌ తట్టుకోలేకే సీఎం జగన్‌ విజయసాయిని ఉత్తరాంధ్ర బాధ్యతలకు పరిమితం చేశారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు, కేంద్రంతో లాబీయింగ్‌, సీబీఐ కేసులు తదితర అంశాలను విజయసాయి  పర్యవేక్షించారు. సజ్జల రామకృష్ణారెడ్డిని  ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా రాయలసీమ బాధ్యతలతో పాటు,  పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయ బాధ్యతలు, ప్రభుత్వ పాలనలో కీలక వ్యవహారాలను అప్పగించారు. ఈ నేపథ్యంలో విజయసాయిపై విశాఖలో భూకబ్జా ఆరోపణలు, అక్కడ పార్టీ నేతలతో విభేదాలు తదితర అంశాలు  తెరపైకి వచ్చాయి.


ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన జగన్

మరోపక్క ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో సజ్జలపై అనేక విమర్శలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణలో చాలామంది తమకు పదవి రాకుండా సజ్జలే అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో  మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తరువాత, పార్టీ వ్యవహారాల పై జగన్‌ దృష్టి సారించారు. అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లను నియమించారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిని తొలగించి  వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. విజయసాయిని అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌గా, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్ల సమన్వయ కర్తగా నియమించారు.


ఒకరిని కలిసి, మరొకరిని కలవకపోతే..!

సజ్జలకు పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ కర్తగా, పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు అప్పచెప్పారు.  దీంతో విజయసాయిని తాడేపల్లికి పరిమితం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఈ బాధ్యతలు అప్పగించాక ఇద్దరూ  పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేయాల్సి రావడం.  తాడేపల్లి నుంచే బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ప్యాలెస్‌లో తలనొప్పి ప్రారంభమైంది. అసంతృప్త నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు  ఎమ్మెల్యేలు, పార్టీ కేంద్ర కార్యాలయానికి  వచ్చినపుడు వీరిద్దరిని కలిసి వెళ్ళిపోతే ఏ గొడవా ఉండదు. అలాకాక వీరిలో ఒకరిని కలిసి, మరొకరిని కలవకపోతే, అలాంటివారిని టార్గెట్‌ చేస్తున్నారని   పార్టీలో ప్రచారం సాగుతోంది. 


జగన్‎కు నచ్చని కొత్త మంత్రుల వ్యవహార శైలి

ఈ వ్యవహారం జగన్‌ వరకూ వెళ్లిందిట. ఓపక్క ఇంటా, బయటా తలనొప్పులు. మరోపక్క  జనంలో వ్యతిరేకత.  కేడర్‌లోనూ, నేతలలోనూ అసంతృప్తి. అంతగా నచ్చని కొత్త మంత్రుల వ్యవహార శైలి. వీటన్నింటితో జగన్‌కు ఇబ్బందిగా ఉంటే  సజ్జల, విజయసాయి తీరు పుండుమీద కారం చల్లినట్టు అయిందట. దీంతో నేతలిద్దరినీ ప్యాలెస్‌కు పిలిపించి క్లాస్‌ పీకారని తెలిసింది. ఉన్న తలనొప్పులు చాలక మీరు తెచ్చే ఈ గొడవలు ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సింది పోయి మీరే తలనొప్పిగా మారితే ఎలా అని క్లాస్ పీకినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మీ ఇద్దరి మధ్యే సమన్వయం లేకపోతే ఎలా అని సిఎం ప్రశ్నించినట్టు తాడేపల్లి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.  


జులై 8న ప్లీనరీని ఎక్కడ..?

సీఎం క్లాస్‌ పీకిన తరువాతే  సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి విజయసాయి వచ్చారు.  సుమారు గంట సేపు ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. తరువాత ఈ విషయాన్ని ఫోటోతోపాటు విజయసాయి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎప్పుడూ వెళ్లని వ్యక్తి ఇంటికి వెళితే ఇలానే ట్విట్టర్‌లో పెడతారని వైసీపీ నేతే ఒకరు కామెంట్‌ పోస్టు చేశారు. పార్టీ నేతలకు, క్యాడర్‌కు మెసేజ్‌ ఇచ్చేందుకే ఇలా ట్విట్టర్‌లో పెట్టినప్పటికీ నిన్న, మొన్నటి వరకూ వీరి ఇరువురి మధ్య సఖ్యత లేదంటూ సాగిన ప్రచారం ఇప్పుడు నిజమేనని పరోక్షంగా అంగీకరించినట్టు అయిందంటున్నారు. 


వీరి మధ్య పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌ల అంశంపై చర్చించిన తరువాత జులై 8వ తేదీన ప్లీనరీని ఎక్కడ, ఎలా నిర్వహించాలనే అంశం పై చర్చలు జరిగాయట. కొసమెరుపు ఏమిటంటే ఎప్పుడు తెల్ల గడ్డం, నెరసిన జుట్టుతో కనిపించే విజయసాయి, ఈసారి గుండుతో కొత్త గెటప్‌లో కనిపించారు. ఇరువురూ గంట మాట్లాడుకున్నప్పటికీ, సజ్జల మాత్రం ఇది రోటీన్‌ భేటీనేనని తేలికగా కొట్టిపారేశారు. విజయసాయి మాత్రం వీఐపీని కలిసిన విధంగా, ట్విట్టర్‌లో పెట్టుకున్నారు. ఈ భేటీ వెనుక సిఎం జగన్‌ క్లాస్‌ పీకిన స్టోరీయే ఉందని పార్టీ వర్గాలటాక్‌.

Updated Date - 2022-05-23T18:11:37+05:30 IST