వృద్ధురాలికి అండగా సఖి కేంద్రం

Jun 15 2021 @ 00:49AM
చౌటుప్పల్‌లోని సఖి కేంద్రానికి చేరుకున్న వృద్ధురాలు

సిద్దిపేట టౌన్‌, జూన్‌ 14: మానసికస్థితి సరిగ్గాలేని వృద్ధురాలికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని సఖి కేంద్రం అండగా నిలిచింది. గజ్వేల్‌ బస్సు డిపో వద్ద మూడు రోజులుగా ఓ వృద్ధురాలు భిక్షాటన చేస్తున్నది. వివరాలు అడిగితే చెప్పలేకపోతున్నది. ఆమె గురించి తెలుసుకున్న గజ్వేల్‌ సీడీపీవో వెంకటరాజమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని సఖి కేంద్రాన్ని ఫోన్‌లో సంప్రదించారు. వృద్ధురాలి పరిస్థితి తెలిపి సహాయం చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన కేంద్రం నిర్వాహకులు కేస్‌ వర్కర్‌, పారామెడికల్‌ సిబ్బందిని సోమవారం గజ్వేల్‌కు పంపించారు. వారు పోలీసుల సహాయంతో వృద్ధురాలిని గుర్తించి కొవిడ్‌ పరీక్ష చేశారు. నెగటివ్‌ రావడంతో ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. వృద్ధురాలికి వైద్యం అందజేస్తామని, ఆమె పూర్తిగా కోలుకుని వివరాలు తెలిపితే బంధువులకు అప్పగిస్తామని చౌటుప్పల్‌లోని సఖి కేంద్రం నిర్వాహకులు తెలిపారు. అప్పటి వరకు కేంద్రంలోనే సంరక్షిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on: