గౌరవ వేతనంలోనూ కోతలే!

ABN , First Publish Date - 2021-03-03T06:45:37+05:30 IST

వలంటీర్లను నియమించి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకున్న ప్రభుత్వం.. ఆ వలంటీర్లు బండెడు చాకిరీ చేస్తున్నాం.

గౌరవ వేతనంలోనూ కోతలే!

బయోమెట్రిక్‌ ఇవ్వని వారికి.. సచివాలయానికి రాని రోజుల్లో కోత

విజయవాడ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లను నియమించి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకున్న ప్రభుత్వం.. ఆ వలంటీర్లు బండెడు చాకిరీ చేస్తున్నాం. వేతనాలు పెంచాలి’ అని డిమాండ్‌ చేసినపుడు.. ‘మీరు ఉద్యోగులు కాదు.. సేవకులు మాత్రమే’ అని సాక్షాత్తు ముఖ్యమంత్రే అన్నారు’ మీరు బయోమెట్రిక్‌ వేయనవసరం లేదు. అవసరం ఉన్నపుడే సచివాలయాలకు వెళ్లండి’ అని చెప్పారు. చివరికి ఆ సేవకులను కూడా ప్రభుత్వం రోడ్డు కూలీలను చేసింది. విజయవాడ నగరంలో బయోమెట్రిక్‌ ఇవ్వని కారణంగా వార్డు వలంటీర్ల వేతనాలకు కోతలు పడ్డాయి. కనీస వేతనం కోసం డిమాండ్‌ చేస్తే ఉన్న వేతనాలు కూడా తీసేస్తారా? అని లబోదిబోమంటున్నారు. సచివాలయాలకు వచ్చి బయోమెట్రిక్‌ ఇవ్వని కారణంగా వార్డు వలంటీర్ల వేతనాలు ఆ మేరకు కట్‌ కావటంతో.. బాధితులు కార్పొరేషన్‌కు వెళ్లి అడిషనల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కార్పొరేషన్‌ అధికారులు నోరు మెదపలేదు’ బయోమెట్రిక్‌ వేయనవసరం లేదు.. అవసరమైతేనే కార్యాలయాలకు వెళ్లండి.. మీరు ఉద్యోగులు కాదు.. సేవకులు మాత్రమే’ అని వారికి సర్ది చెప్పిన ప్రభుత్వం ఇలా వలంటీర్లను రోజు కూలీలుగా మార్చి వేయటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బయోమెట్రిక్‌ ప్రాతిపదికన జీతాలు కట్‌ చేయటంతో వందల సంఖ్యలో వార్డు వలంటీర్లు లబోదిబోమంటున్నారు. నగరంలో 4800 మంది వార్డు వలంటీర్లకు గాను 3800 మంది విధులు నిర్వహిస్తున్నారు. బండెడు చాకిరీ చేయలేక వెయ్యికి పైగా వార్డు వలంటీర్ల షార్టేజి ఉంది. ఉన్న వలంటీర్లపై వార్డు సచివాలయాల పరిధిలో విపరీతమైన పనిభారం పెరిగిపోయింది. వార్డు సచివాలయ ఉద్యోగులతో సమానంగా తాము కూడా పనిచేస్తునప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుగా విజయవాడ పరిధిలోనే వార్డు వలంటీర్ల నుంచే డిమాండ్‌ వచ్చింది. బండెడు చాకిరికి తగినట్టుగా గౌరవ ప్రదమైన వేతనం కూడా అందుకోలేక పోతున్నామని  నగరంలోని వలంటీర్లంతా సంఘటితమై కార్పొరేషన్‌ను ముట్టడించారు. కార్పొరేషన్‌ ముట్టడి సందర్భంగా.. వలంటీర్లను ఉద్యోగులుగా కాకుండా సేవకులుగా ప్రభుత్వం ముద్ర వేసింది. తీరా వేతనాలు అందుకునే సమయానికి తమను రోజు కూలీలను చేశారని వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. కనీస వేతనాలు పెంచాలని ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కేస్తారా అని వార్డు వలంటీర్లు వాపోతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతన జాబితాలను పరిశీలిస్తే.. అనేక చిత్రమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంత మంది వలంటీర్లకు రూ. 165 నుంచి రూ. 500 లోపు వేతనాలే వచ్చాయి. మరికొందరికి రూ. 1500 నుంచి రూ. 3 వేల వరకు వచ్చాయి. వారిలో రూ. 4 వేలు వచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనికి కారణం వార్డు వలంటీర్లు బయోమెట్రిక్స్‌ ఇవ్వకపోవటమేనని తెలుస్తోంది.

సీఎఫ్‌ఎంఎస్‌ సమస్యలతో ఆరు నెలలుగా వేతనాలు అందుకోని వలంటీర్లు ప్రభుత్వ సీఎఫ్‌ఎంఎస్‌ సమస్యలతో నగరంలోని వార్డు వలంటీర్లు ఆరు నెలలుగా తమ గౌరవ వేతనాలను అందుకోలేకపోతున్నారు. గత ఆరు నెలలు, మూడు నెలలు, రెండు నెలలుగా గౌరవ వేతనాలను అందుకోని కొందరికి మాత్రమే ఈ నెలలో ఒకేసారి ఇచ్చారు.. ఇలాంటి బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరి సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. రాజకీయంగా సిఫార్సులు చేయించుకున్న వలంటీర్ల సీఎఫ్‌ఎంఎస్‌ సమస్యలే పరిష్కారమవుతుండటం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని వార్డు వలంటీర్లు పెదవి విరుస్తున్నారు.

Updated Date - 2021-03-03T06:45:37+05:30 IST