ఆరునెలలుగా అందని జీతాలు

ABN , First Publish Date - 2022-05-06T06:12:05+05:30 IST

రాష్ట్రంలో సంచార వైద్యం సందిగ్ధంలో పడింది.

ఆరునెలలుగా అందని జీతాలు
పశువులకు వైద్యం చేస్తున్న దృశ్యం

సందిగ్ధంగా జిల్లాలో  సంచార పశువైద్యం 

తొమ్మిది నెలలుగా బడ్జెట్‌ బంద్‌ 

నిలిచిపోయిన మందుల సరఫరా 

కేవలం జీవీకే సహకారంతో నిర్వహణ

నిర్మల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో సంచార వైద్యం సందిగ్ధంలో పడింది. రాష్ట్రంలోని వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం సంచార వైద్య సేవ ఆసుపత్రులు కొనసాగుతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో ఒక సంచార పశువైద్య ఆసుపత్రి కోసం ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పశువులకు అత్యవసరమైన వైద్యసేవలను అందిస్తున్నారు. 108, 104 మాదిరిగానే పశువులకు కూడా అత్యవసర వైద్యం అందించేందుకు కోసం 1962 సంచార పశువైద్యశాల పేరిట ప్రభుత్వం 2017 సంవత్సరంలో దీనిని ప్రారంభించింది. మనుషులకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాని , ఇతర అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు గాని 108 మాదిరిగానే 1962 కూడా సంచార పశువైద్య శాల కూడా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది. 1962కు ఫోన్‌ గానే అందగానే వైద్య సిబ్బంది తక్షణం అక్కడికి అంబులెన్స్‌లో చేరుకొని పశువులకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. ఒక్కో వ్యాన్‌లో వెటర్నరీ డాక్టర్‌తో పాటు మొత్తం నలుగురు సిబ్బంది ఉంటారు. అయితే సంచార పశువైద్యానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి బడ్జెట్‌ను విడుదల చేయకపోతుండడం ప్రస్తుతం సమస్యగా మారింది. బడ్జెట్‌ లేని కారణంగా రాష్ట్రంలోని వంద సంచార పశువైద్యశాలలో పని చేస్తున్న డాక్టర్‌లు, సిబ్బందికి గత ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. అలాగే నిధుల కొరత కారణంగా పశువైద్యానికి సంబందించిన మందులు సరఫరా కూడా నిలిచిపోయింది. 

పశువైద్య సేవలకు ఆటంకం

సంచార పశువైద్య శాలలకు బడ్జెట్‌ను నిలిపివేయడంతో డాక్టర్‌లు, సిబ్బందికి ఆరునెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో పశువైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బడ్జెట్‌ కొరత కారణంగా పశువైద్యానికి సంబందించి మందులు కూడా సరఫరా కావడం లేదు. గత ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు కేవలం జిల్లాలోనే 27,194 పశువులకు సంచార పశువైద్యశాల ద్వారా అత్యవసర చికిత్సలు అందించారు. రాష్ట్రంలోని మొత్తం వంద సంచా ర పశువైద్యశాలల ద్వారా ఈ ఏడాదిలో సుమారు రెండు లక్షల కు పైగా వైద్యచికిత్స అందించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరైనా అత్యవసర పశువైద్యం కోసం ఫోన్‌ చేస్తే 1962 అంబులెన్స్‌లు పశువులకు వైద్య సేవలు అందించలేని స్థితి నెలకొంది. 

ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు

రాష్ట్రంలోని వంద మొబైల్‌ సంచార పశువైద్యశాలలకు సంబంధించి అంబులెన్స్‌లో పనిచేస్తున్న వందమంది వెటర్నరీ డాక్టర్‌లతో సహా మరో మూడు వందల మంది సిబ్బందికి కలిపి మొత్తం 400 మందికి గత ఆరునెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. తొమ్మిది నెలల నుంచి మొబైల్‌ అంబులెన్స్‌ల నిర్వహణ కోసం బడ్జెట్‌ను కూడా విడుదల చేయడం లేదు. కనీసం మందులను కూడా సరఫరా చేయకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. తమకు ఆరు నెలల నుంచి చెల్లించని జీతాలను వెంటనే చెల్లించాలని సంచార పశువైద్య సిబ్బంది కోరుతున్నారు. 

జీవికే సహకారంతో నిర్వహణ

కాగా రాష్ట్రంలోని వందఅసెంబ్లీ నియోజకవర్గాల్లో 2017 సంవత్సరం నుంచి 1962 అంబులెన్స్‌ పేరిట సంచార పశువైద్యశాలలను ప్రభుత్వం జీవీకే సంస్థ సహకారంతో నిర్వహిస్తోంది. 108 అంబులెన్స్‌ తరహాలోనే పశువులకు కూడా అత్యవసర వైద్య సేవలు అందించడం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం వరకు సంచార వైద్యశాలల వ్యవస్థ సక్రమంగా నడిచినప్పటికి ఏడాది నుంచి మాత్రం నిధుల కొరతతో సంచార పశువైద్యం సందిగ్ధానికి లోనవుతోంది. 

జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం

గత ఆరు నెలల నుంచి తమకు జీతాలు రావడం లేదు. జీతాలు లేక తాము కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. తమ జీతాల చెల్లింపు విషయమై ఇప్పటికే పశువైద్య శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశాం. బడ్జెట్‌ లేని కారణంగా జీతాలు చెల్లించడం లేదు. పశువులకు తాము ఇప్పటి వరకు క్లిష్టమైన అత్యవసర చికిత్సలు అందించాం. తమ సేవలకు సరియైున గుర్తింపు లభించడం లేదు. ప్రభుత్వం ఇకనైనా తమ సేవలను గుర్తించి జీతాలు చెల్లించాలి.

- శేఖర్‌, పారావెట్‌, సంచార వైద్యశాల 


ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు

సంచార పశువైద్యశాల డాక్టర్లు , సిబ్బందికి ప్రభుత్వం నుంచి జీతాలు విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవికె సంస్థ సహకారంతో సంచార పశువైద్యశాలలను నిర్వహిస్తోంది. అంబులెన్స్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అత్యవసర చికిత్సలు అందుతున్నాయి. సంచార పశువైద్య సిబ్బంది జీతాలకు సంబందించి తమకు వినతి పత్రం అందించారు. తాము ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాం. 

Read more