జోరుగా నిషేధిత గడ్డిమందు విక్రయాలు

ABN , First Publish Date - 2021-06-17T06:23:23+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిషేధిత గడ్డి మందు విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

జోరుగా నిషేధిత గడ్డిమందు విక్రయాలు
జగిత్యాలలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

- గట్టి నిఘా.. తనిఖీలు

- అయినా ఆగని అమ్మకాలు

జగిత్యాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిషేధిత గడ్డి మందు విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఓ వైపు గడ్డి మందు విక్రయాలపై అధికారులు పటిష్ట నిఘా పెడుతూ తనిఖీలు చేస్తున్నా రు. వ్యాపారులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా అమ్మకాలు ఆగడం లేదు.

- నిషేధిత జాబితాలో..

పంటల సాగులో చీడ పీడలను నియంత్రించేందుకు, కలుపు మొక్కలను నివారించేందుకు, అధిక దిగుబడులకు రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మోతాదుకు మించి వినియోగం వల్ల ఆహారోత్పత్తులపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలతో  గ్లైఫోసెట్‌ అమ్మకాలపై  నిషేధం విధిం చింది. ప్రధానంగా పత్తి, తేయాకు పండించే ప్రాంతాల్లో విక్రయాలపై సంపూర్ణంగా నిషేధం విధించింది. జగిత్యాల జిల్లాలో వరి విస్తీర్ణం భారీగా ఉంటోంది. ఎప్పుడు పంట పొలాల్లో నీరు ఉంటుండడం తో గట్లపై గడ్డి మితిమీరి పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులు గట్లపై నుంచి నడవడానికి సైతం వీలులేనంతగా గడ్డి పెరుగుతోంది. దీంతో పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గట్లపై గడ్డి సమస్యను నివారించడానికి రైతులు గ్లైఫోసెట్‌ మందును వినియోగిస్తుంటారు. 

- విస్తృత తనిఖీలు..

జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో గల దుకాణాల్లో ఓ వైపు పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.  గ్లైఫోసెట్‌ మందు విక్రయాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని అటు విక్రయాలు, ఇటు కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్లో ఇతర ప్రాంతాల్లోని రైతులు గడ్డి మందు కావాలంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అనుమతి పత్రాన్ని పొంది  గ్లైఫోసెట్‌ను కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. దీనిని ఆసరగా చేసుకొని అటు వ్యాపారులు, ఇటు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో పత్తి, తేయాకు సాగులేని ప్రాంతాల రైతుల పేరిట నిషేధిత మందును కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు మరింత పకడ్బందీగా వ్యవహ రించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


మరింత కఠినంగా వ్యవహరిస్తాం

- సురేశ్‌ కుమార్‌, డీఏవో, జగిత్యాల

జిల్లాలో గడ్డి మందు విక్రయాలపై మరింత పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాము. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాము. వ్యాపారులకు విక్రయాలు జరపవద్దని సూచించాము. దుకాణాల్లో గల నిల్వలు, స్టాకు రిజిస్టర్లను పరిశీలిస్తున్నాము. భవిష్యత్‌లో మరింత కఠిన చర్యలు తీసుకుంటాము.


Updated Date - 2021-06-17T06:23:23+05:30 IST