ఎట్టకేలకు మోక్షం

ABN , First Publish Date - 2022-08-13T06:30:18+05:30 IST

రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరీక్షణకు తెరపడింది. ఫీల్డ్‌ అసిసెంట్ల(ఎఫ్‌ఏ)ను విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎట్టకేలకు మోక్షం
ప్రభుత్వం ఎఫ్‌ఏలను తిరిగి తీసుకోవడంతో డీఆర్‌డీఏ పీడీకి స్వీట్లు పంచుతున్న ఎఫ్‌ఏలు

- విధుల్లో చేరిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు

- రెండేళ్ల నిరీక్షణకు తెర

- జిల్లాలో మొత్తం 730 మంది ఎఫ్‌ఏలు ఉండగా.. విధుల్లో చేరిన 628 మంది

- తేలని సస్పెన్షన్‌ అభ్యర్థుల భవితవ్యం

- తీసుకుంటారా.. తీసుకోరా?


కామారెడ్డి, ఆగస్టు 12: రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరీక్షణకు తెరపడింది. ఫీల్డ్‌ అసిసెంట్ల(ఎఫ్‌ఏ)ను విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జిల్లాలోని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు విధుల్లో చేరారు. కొన్నేళ్లుగా ఆందోళనలు, సమ్మె, ధర్నాలు చేపట్టిన ఎఫ్‌ఏలకు కొన్ని నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. తిరిగి విధుల్లోకి చేర్చుకుంటామని స్పష్టం చేయగా నెలల తరబడి పడిగాపులు కాశారు. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 730 మంది ఎఫ్‌ఏలు ఉండగా ప్రస్తుతం 628 మంది విధుల్లో చేరగా మిగిలిన వారి పరిస్థితేంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు విధుల్లో చేరడంతో పంచాయతీ కార్యదర్శులకు సైతం పని భారం తగ్గనుండడంతో పాటు ఉపాధి హామీ పనులు తిరిగి పుంజుకోనున్నాయి.

నిబంధనలు సడలిస్తారా..

2020 మార్చిలో ఎఫ్‌ఏలు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయగా ప్రభుత్వం ఎఫ్‌ఏలను తొలగించిన సంగతి తెలిసిందే. మళ్లీ విధుల్లోకి తీసుకుంటారని ఆశించగా ఆడియాసలయ్యాయి. గ్రామాల్లో పనుల్లో ఎంపిక, జాబ్‌కార్డుల జారీ, కూలీలకు పని కల్పించడంలో కీలకంగా వ్యవహరించేవారు. సమ్మెతో ఎఫ్‌ఏలను తొలగించిన ప్రభుత్వం వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాదిలో ఈజీఎస్‌ అమలులో భాగంగా అన్ని గ్రామాలకు క్షేత్ర సహాయకులను కాంట్రాక్ట్‌ పద్ధతిపై నియమించింది. దాదాపు 15 ఏళ్లుగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు కీలకంగా పని చేశారు. జిల్లాలో 730 మంది ఉండగా పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు నిర్వహించారు. కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో కొందరికి రెండేసి గ్రామాల బాధ్యతలు ఉండేవి. ఇందులో భాగంగానే జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి సగటున 30కిపైగా పని దినాలు కల్పించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.10వేలు, అంతకన్నా తక్కువ పని దినాలు కల్పించిన వారికి రూ.5వేలు వేతనం ఇచ్చేలా మార్పులు చేస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పనిదినాలు సగటున 10లోపు ఉన్న ఎఫ్‌ఏలను తొలగిస్తామని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఎఫ్‌ఏలు సమ్మెకు దిగారు. సమ్మెలో పాల్గొన్న ఫీల్డ్‌ అసిసెంట్లు విధులకు హాజరుకావడం లేదని విధుల్లోంచి తొలగించింది. అప్పటి నుంచి ఎఫ్‌ఏలు ఉపాధి విధులకు దూరమయ్యారు. తాజాగా విధుల్లోకి తీసుకునప్పటికీ నిబంధనలను సడలిస్తారా.. అవే నిబంధనలు కొనసాగిస్తారా అనేది స్పష్టత లేదు.

సస్పెన్షన్‌పై తేలని భవితవ్యం

సస్పెండ్‌ అయిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల భవిత్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వారి ప్రస్తావన లేకపోవడంతో ఫీల్డ్‌పై ఉన్నవారినే విధుల్లోకి తీసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడడం, పలువురు విధులకు హాజరుకాకపోవడం, మరికొందరు రాజీనామా చేయడం, ఇంకొందరు లక్ష్యం చేరుకోక ఉద్యోగాలను కోల్పోయారు. మరి వారి పరిస్థితి ఎలా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా రెండేళ్లు పైగా పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తుండగా తాజా నిర్ణయంతో భారం తగ్గనుందని వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


విధుల్లోకి చేరడం సంతోషంగా ఉంది

- పరుశురాం గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవడం సంతోషంగా ఉంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లతో ప్రభుత్వం గ్రామాల్లో పనులను చేపట్టిన వాటిని పూర్తిచేసి అధికారులకు అందజేస్తాం. నూతన ఒరవడితో పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.  రెండేళ్ల నిరీక్షణకు గత కొన్ని నెలల కిందట సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటనతో ఊరట కలిగినా నెలల తరబడి పడిగాపులు కాశాం. ఏది ఏమైనా ప్రస్తుతం విధుల్లోకి తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌కు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లకు ఫీల్డ్‌అసిస్టెంట్ల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.


సస్పెండ్‌ చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవాలి

- అంజాగౌడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు, కామారెడ్డి

ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లలో కొందరిని సస్పెండ్‌ చేసింది. వారిపై పూర్తి క్లారిటీని ఇవ్వలేదు. సస్పెండ్‌ చేసిన వారిని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. రెండు సంవత్సరాలుగా పనులు లేక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం గుర్తించి సస్పెండ్‌ అయిన వారిని కూడా విధుల్లోకి తీసుకునేలా జీవోను విడుదల చేయాలి. విధుల్లోకి తీసుకోవడం హర్షించదగిన విషయం.

Updated Date - 2022-08-13T06:30:18+05:30 IST