కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం

ABN , First Publish Date - 2021-07-26T06:56:15+05:30 IST

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అర్హుల జాబితా సిద్ధమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో రేషన్‌ కార్డుల జారీలో ఇంతకాలం జాప్యం చోటుచేసుకుంది.

కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం

నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో పంపిణీ

శ్రీకారంచుట్టనున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

26,698 మంది అర్హులు


(ఆంద్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) /సూర్యాపేట సిటీ, భువనగిరి రూరల్‌: కొత్త రేషన్‌ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. అర్హుల జాబితా సిద్ధమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో రేషన్‌ కార్డుల జారీలో ఇంతకాలం జాప్యం చోటుచేసుకుంది. ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రేషన్‌ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 26 నుంచి 30వ తేదీవరకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. 


ఉమ్మడి జిల్లాలో 26,698 మంది అర్హులుగా అధికారులు జాబితా రూపొందించారు. అందులో నల్లగొండ జిల్లాకు చెందిన లబ్ధిదారులు 11,395మంది, సూర్యాపేట జిల్లాకు చెందిన వారు 9,369, యాదాద్రి జిల్లాకు చెందిన వారు 5,934 మంది ఉన్నారు. ప్రస్తుతం కార్డుదారుడి పేరున, కుటుంబ సభ్యుల సంఖ్య, రేషన్‌షాపు తదితర వివరాలతో కూడిన ఒక పత్రాన్ని ఇస్తారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి కార్డును అందజేస్తారు. కొత్త కార్డుల లబ్ధిదారులకు ఆగస్టు నెల నుం చి రేషన్‌ అందనుంది. కాగా, ఈనెల 26న ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో, 12గంటలకు నల్లగొండలో, మధ్యాహ్నం 3గంటలకు యాదాద్రి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌లో రేషన్‌ కార్డుల పంపిణీని మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించనున్నారు.


మూడేళ్లుగా ఎదురుచూపులు

కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రభుత్వం 2018లో దరఖాస్తు లు తీసుకుంది. సూర్యాపేట జిల్లాలో 11,113 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వాటిని పరిశీలించి క్షేత్రస్థాయి సర్వే అనంతరం 9,369 మందిని అర్హులుగా గుర్తించారు. 1,744మంది అనార్హులుగా తేల్చారు. సూర్యాపేట మండలంలో అత్యధికంగా 1,943 దరఖాస్తులు రాగా, 1,457మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అర్హుల జాబితాను రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయానికి పరిశీలనకు పంపారు. నాటి నుంచి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రేషన్‌ కార్డు లేకపోవడం లేకపోవడంతో పలు సంక్షేమ పథకాలకు వీరు దూరమయ్యారు. కాగా, నూతన రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను గుర్తించి, వారికి వెంటనే కార్డులు మంజూరు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశంలో నిర్వహించి కలెక్టర్లను అదేశించడంతో జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. మునిసిపాలిటీల పరిధిలో మునిసిపల్‌ సిబ్బంది, గ్రామాల్లో వీఆర్‌ఏలు సర్వే చేసి తుది నివేదికను అందజేయగా, జాబితా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు అందింది. దీంతో ఆ జాబితాను ప్రభుత్వానికి నివేదించగా, ఈ నెల 26వ తేదీ నుంచి కార్డుల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. యాదాద్రి జిల్లాలో 17మండలాల పరిధిలో 421 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 481 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెల రేషన్‌ కార్డుదారులకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2,13,805 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 6,65,3 32 మందికి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం ప్రతి నెలా 4251.083మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేస్తున్నారు. కాగా, జిల్లాలో కొత్తగా 5934మంది రేషన్‌కార్డులకు అర్హులుగా అధికారులు గుర్తించారు. అందుకు 14,414 యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున 86.484 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఆగస్టు నెల నుంచి అదనంగా పంపిణీ చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 11,395 మందిని అర్హులుగా గుర్తించారు.


వచ్చే నెల నుంచే బియ్యం పంపిణీ

ఉమ్మడి జిల్లాలో కొత్తగా గుర్తించిన 26,698 రేషన్‌కార్డుదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందనుంది. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేశారు. లబ్ధిదారులు అధికారుల నుంచి గానీ, లేదా మీ-సేవ కేంద్రాల్లో రేషన్‌కార్డు పత్రాన్ని ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేటాయించిన సమీపంలోని రేషన్‌దుకాణానికి వెళ్లి సదరు పత్రాన్ని డీలర్లుకు చూపితే బియ్యం పంపిణీ చేస్తారు.

Updated Date - 2021-07-26T06:56:15+05:30 IST