టూరిజం హోటల్‌కు మోక్షం

ABN , First Publish Date - 2022-09-17T06:45:45+05:30 IST

తిరుపతి నగరం అలిపిరి సమీపంలో ఎనిమిదేళ్ళుగా అసంపూర్తిగా వుండిపోయిన త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణంపై ఎట్టకేలకు పర్యాటక శాఖ దృష్టి సారించింది.

టూరిజం హోటల్‌కు మోక్షం
నిర్మాణం పూర్తి కాని టూరిజం హోటల్‌ భవనం

రూ. 22 కోట్లతో 2009లో మంజూరు

రూ. 7 కోట్లు ఖర్చు చేశాక ఆగిన నిర్మాణం

రూ. 11 కోట్లతో పెండింగ్‌ పనులకు త్వరలో టెండర్లు


తిరుపతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం అలిపిరి సమీపంలో ఎనిమిదేళ్ళుగా అసంపూర్తిగా వుండిపోయిన త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణంపై ఎట్టకేలకు పర్యాటక శాఖ దృష్టి సారించింది. పర్యాటకులు, యాత్రికుల కోసం రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో 2009లో ఏపీ టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ మంజూరు చేసిన హోటల్‌ భవనం పనులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఏపీ టూరిజం కార్పొరేషన్‌ ప్యాకేజీల ద్వారా తిరుమలకు వస్తున్న యాత్రికులకు వసతి, భోజనం అందించేందుకు కార్పొరేషన్‌కు శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు లేవు. దీంతో ప్రైవేటు భాగస్వాములపై ఆధారపడాల్సి వస్తోంది. కొవిడ్‌ అనంతరం తిరుమలకు పూర్తిస్థాయిలో యాత్రికులు వస్తున్న నేపధ్యంలో తమ ద్వారా వస్తున్న యాత్రికులకు సొంతంగా సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో కార్పొరేషన్‌ పెండింగ్‌లో వున్న త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణంపై దృష్టి పెట్టింది. పెండింగ్‌ పనుల పూర్తికి రూ. 11 కోట్ల అంచనాతో త్వరలో టెండర్లు పిలవనుంది.రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచీ కూడా ఏపీ టూరిజం కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న రోజువారీ ప్యాకేజీల ద్వారా యాత్రికులు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. తిరుపతికి చేరుకునే యాత్రికులను కార్పొరేషన్‌ యంత్రాంగం గతంలో ప్రైవేటు హోటళ్లలో బస చేయించేది. తర్వాత వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల తీసుకెళ్ళి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి తీసుకురావడం, అక్కడ నుంచీ మళ్ళీ కార్పొరేషన్‌ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతోంది. తర్వాత టీటీడీకి చెందిన శ్రీనివాసం వసతి సముదాయంలో 140 గదులను, రెస్టారెంట్‌ను లీజు ప్రాతిపదికన తీసుకుని వాటిలో యాత్రికులకు వసతి ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ క్రమంలో సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని భావించిన కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు 2009లో అలిపిరి సమీపంలో రుయాస్పత్రి ఎదురుగా త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. రూ. 22 కోట్ల అంచనాతో భవనం మంజూరు చేసింది. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా నాలుగు అంతస్తులతో కూడిన భవన నిర్మాణానికి డిజైన్‌ రూపొందించారు. సెల్లార్‌లో 50 వాహనాలు పార్క్‌ చేసే సదుపాయం వుంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెస్టారెంట్‌, బాంకెట్‌ హాలు, కార్పొరేషన్‌ కార్యాలయం వుంటాయి. మిగిలిన నాలుగు అంతస్తుల్లో మొత్తం 103 గదులు వుంటాయి. 2010లో కార్పొరేషన్‌ సొంతంగా భవన నిర్మాణం చేపట్టింది. 2014 నాటికి రూ. 7 కోట్ల వ్యయంతో భవన నిర్మాణం దాదాపు పూర్తి అయింది. అప్పటికి కార్పొరేషన్‌కు నిధుల కొరత ఎదురవడంతో పనులు ఆపేసింది.


2014లో ప్రైవేటు భాగస్వామికి అప్పగించినా జరగని పనులు

నిధుల కొరతతో నిర్మాణం ఆపేసిన కార్పొరేషన్‌ అదే ఏడాదిలోనే ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు పూర్తి చేయించాలని భావించి తిరుపతికే చెందిన ఓ ప్రైవేటు స్టార్‌ హోటల్‌ యాజమాన్యానికి అవకాశం ఇచ్చింది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేసి తర్వాత వారే లీజుపై హోటల్‌ నడుపుకునేలా అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. టెండర్లు పిలిచింది. ఐదేళ్ళయినా పనులు మొదలు పెట్టకపోవడంతో 2019లో అగ్రిమెంట్‌ను రద్దు చేసిన కార్పొరేషన్‌ అధికారులు భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సొంతంగానే పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో టెండర్లు పిలవదలుచుకున్నప్పటికీ కొవిడ్‌ కారణంగా రెండేళ్ళ పాటు ఆ ప్రతిపాదన పెండింగ్‌లో వుండిపోయింది. కొవిడ్‌ ప్రభావం తొలగిపోయాక 2021 డిసెంబరులో పెండింగ్‌ పనుల పూర్తికి టెండర్లు ఆహ్వానించగా కేవలం మూడు బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. పరిశీలనలో రెండు బిడ్లు సాంకేతిక అనర్హత కారణంగా చెల్లుబాటు కాలేదు. మిగిలిన బిడ్‌ దాఖలు చేసిన సంస్థకు అర్హత వున్నప్పటికీ సింగిల్‌ టెండరును ఆమోదించరాదన్న నిబంధన వుండడంతో ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేయాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో హోటల్‌ పనులు పూర్తి చేయడానికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. మొత్తం అంచనా వ్యయం రూ. 22 కోట్లలో 2014 వరకూ జరిగిన పనులు పోనూ మిగిలిపోయిన రూ. 11 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండరు అర్హత సాధించి నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టరుకు హోటల్‌ నిర్వహణ బాధ్యత కూడా అప్పగించేలా టెండరు నిబంధనలు రూపొందించారు.33 ఏళ్ళ పాటు లీజుకు కేటాయించనున్నారు. అయితే ఈ మార్గంలో మద్యం షాపులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించని కారణంగా పర్యాటక శాఖకు చెందిన త్రీ స్టార్‌ హోటల్‌లో కేవలం రెస్టారెంటు మాత్రమే నడిపే వీలుంటుంది. బార్‌ నిర్వహించడానికి నిబంధనలు అంగీకరించవు.


త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణం పూర్తయితే యాత్రికులకు సొంతంగా వసతి

అలిపిరి సమీపంలో హోటల్‌ నిర్మా ణం పూర్తయితే యాత్రికులకు సొం తంగా వసతి కల్పించే వీలుంటుంది. గతంలో టీటీడీకి చెందిన శ్రీనివాసం వసతి సముదాయంలో గదులు లీజుపై తీసుకున్నందున పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. తర్వాత విష్ణునివాసంలో కూడా గదులు లీజు పై తీసుకున్నప్పటికీ సంస్థ బస్సుల పార్కింగ్‌కు అక్కడ అనువుగా వుండేది కాదు. అందువల్ల గత్యంతరం లేక ప్రైవేటు హోటళ్ళపై ఆధారపడాల్సి వస్తోంది. యాత్రికుల నుంచీ వసూలు చేస్తున్న మొత్తంలో ప్రైవేటు వసతికి చెల్లించగా స్వల్ప మొత్తమే కార్పొరేషన్‌కు మిగులుతోంది. అందువల్ల అన్ని సౌకర్యాలూ వుండేలా డిజైన్‌ చేసిన త్రీ స్టార్‌ హోటల్‌ నిర్మాణం పూర్తయితే యాత్రికుల వసతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Updated Date - 2022-09-17T06:45:45+05:30 IST