బీమా.. ధీమా

ABN , First Publish Date - 2020-07-12T10:50:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.

బీమా.. ధీమా

రైతుబీమాతో అభయం

ఆన్నదాతకు ఆర్థిక భరోసా

బాధిత కుటుంబాలను ఆదుకుంటున్న పథకం


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)  

రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. కుటుంబ పెద్ద అకాలమరణం చెందితే ఆ కుటుంబాన్ని ఈ పథకం ఆదుకంటోంది. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబంలోని  పిల్లలకు  ఆర్థిక భరోసా కల్పిస్తోంది.  గత సంవత్సరం అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పొడిగించింది. పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 582 మంది రైతుల కుటుంబాలకు రూ.29.10 కోట్లు పరిహారంగా అందజేశారు. 


ఆదుకోవడమే లక్ష్యం...

కుటుంబ పెద్ద చనిపోయినా రైతు కుటుంబం ధీమాతో బతికాలనేదే రైతుబీమా పథకం లక్ష్యం. 18 నుంచి 60 ఏళ్ల రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. నామిని అకౌంట్లో డబ్బులు నేరుగా జమ అవుతాయి. ప్రభుత్వం నుంచి అందిన రూ. 5 లక్షల పరిహారం ఆ కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతోపాటు పిల్లల చదువులకు రైతు బీమా పథకం ఎంతో ఉపయోగ పడుతోందని గ్రామీణ ప్రజలంటున్నారు. 


582 కుటుంబాలకు లబ్ధి...

2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం రైతులు 1,16,936 ఉండగా రైతు బీమాకు 67,782 మంది అర్హత పొందారు. వారిలో 357 మంది చనిపోయారు. అర్హత ఉండి మృతి చెందిన మొత్తం 357 మందిలోని  ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ. 17.85 కోట్లు నామినీలకు అందజేశారు. 


2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,37,409 మంది రైతుల్లో  67,782 మంది రైతు బీమా పొందేందుకు అర్హులున్నారు. ఇప్పటికి 263 మంది మృతి చెందారు. వారిలో 225 మందికి బీమా క్లైయిమ్‌ అయింది. ఆ రైతు కుటుంబాలకు రూ. 11.25 కోట్లు అందజేశారు. 


ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు

రైతు కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. క్లైముల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎప్పటికప్పుడు క్లైములు పరిష్కరించి పది రోజుల్లో బీమా పరిహారం రైతు కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో రికార్డుల ప్రకారం ప్రస్తుతం 1,37,409 మంది రైతులుంటే అందు లో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. 18 నుంచి 60 ఏళ్లు ఉన్న రైతులు 67,782  మంది ఉన్నారు.


వీరికి ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ. 2271ల పూర్తి ప్రీమి యం చెల్లించింది. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా రైతులు, వారి నామినీలను అధికారులు సేకరించి అప్‌ లోడ్‌ చేశారు. రైతు సహజ మరణం అయినా బీమా చెల్లిస్తారు. రైతు చనిపోయిన తరువాత  48 గంటల్లో బీమా సొమ్ముకు దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, నామినీ బ్యాంకు అకౌం టు వివరాలు తెలియజేస్తు మండల ఏవో కార్యాల యంలో దరఖాస్తు చేసుకోవాలి.  అధికారులు ధ్రువీకరిం చుకొని పది రోజుల్లో రైతు నామిని అకౌంట్లో రూ. 5 లక్షలు జమ చేస్తారు. ఏదైన డబ్బులు జమ కాకపోతే వడ్డీ కలిపి చెల్లించాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. 

Updated Date - 2020-07-12T10:50:52+05:30 IST