సమగ్ర శిక్షలో ఉద్యోగుల విభజన

ABN , First Publish Date - 2022-09-26T06:40:58+05:30 IST

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల విభజన పూర్తయింది.

సమగ్ర శిక్షలో ఉద్యోగుల విభజన

పారదర్శకత లోపించిందనే విమర్శలు

అస్మదీయులకు విశాఖలోనే పోస్టింగ్‌

సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారు కూడా కొనసాగింపు

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని వేర్వేరుగా చూపించడంపై అభ్యంతరాలు

అధికారుల తీరును తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు


విశాఖపట్నం/అనకాపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల విభజన పూర్తయింది. ఇప్పటికే సెక్టోరియల్‌ అఽధికారులను విభజించిన అధికారులు తాజాగా కింది స్థాయి ఉద్యోగులను మూడు జిల్లాలకు సర్దేశారు. అయితే విభజనలో సరైన పద్ధతి పాటించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారంటున్నారు. విశాఖ కార్యాలయంలో వున్న డీటీపీ ఆపరేటర్‌లను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ అంటూ వేర్వేరుగా గుర్తించడంతో కొందరు సీనియర్లకు అన్యాయం జరిగిందని, సమాన పనికి సమాన వేతనం తీసుకునే డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పేరుతో సీనియారిటీని గుర్తించకుండా అస్మదీయులైన వారికోసం వేర్వేరుగా సీనియారిటీ ఖరారు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. 

అనంతగిరి ఎంఈవో కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను గతంలో డెప్యూటేషన్‌పై విశాఖపట్నం తీసుకువచ్చారు. అయితే జిల్లాల విభజనలో సదరు ఆపరేటర్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లాకు పంపాల్సి ఉండగా... విశాఖలోనే కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా మినిమం టైమ్‌ స్కేలు అమలుచేయకుండా విశాఖ నుంచి అల్లూరి జిల్లాకు పంపడం వల్ల తమకు ఆర్థిక భారమని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరు సెక్టోరియల్‌ అధికారులు గడువు ముగిసినా సిఫారసు లేఖలతో ఇక్కడే కొనసాగుతున్నారు. వీరిని కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలు రాలేదు. గత ప్రభుత్వంలో సమగ్ర శిక్షా అభియాన్‌కు డెప్యూటేషన్‌పై వచ్చి మంత్రి గంటా శ్రీనివాసరావు వద్ద పీఏగా పనిచేసిన ప్రసాదరావును గడువు ముగిసిన వెంటనే పాఠశాల విద్యా శాఖకు సరండర్‌ చేశారు. మరో సెక్టోరియల్‌ అధికారి పోస్టులో వున్న వ్యక్తి అల్లూరి జిల్లాకు వెళ్లాల్సి ఉండగా...ఆ పోస్టును అనకాపల్లికి కేటాయించినట్టు తెలిసింది. 


నిబంధనల మేరకు విభజించండి

జి.చిన్నబ్బాయ్‌, ప్రఽధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా యూటీఎఫ్‌

సమగ్ర శిక్షా అభియాన్‌లో ఉద్యోగుల విభజన నిబంధనల మేరకు జరగాలి. అంతే తప్ప అధికారులు ఇష్టానుసారంగా చేయడం మంచిది కాదు. రివర్స్‌ సీనియారిటీ మేరకు ఉద్యోగులను అల్లూరి, అనకాపల్లి జిల్లాకు పంపాలి. సిఫారసు లేఖలతో విశాఖ కార్యాలయంలో కొందరిని కొనసాగించడం దారుణం. అటువంటప్పుడు నిబంధనలు రూపకల్పన ఎందుకు?. అధికారుల అండదండలుంటే ఒకలా..లేకపోతే మరోలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. 


నిబంధనల మేరకే విభజన

- బి.శ్రీనివాసరావు, అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌, సమగ్రశిక్షా అభియాన్‌, విశాఖపట్నం

సమగ్రశిక్షా అభియాన్‌ విశాఖ కార్యాలయం నుంచి కొంతమంది ఉద్యోగులను అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కేటాయించాం. ఇందుకోసం సిబ్బందిని నిబంధనల మేరకు విభజించాం. అయితే మూడు జిల్లాల్లో కార్యాలయాలు, కేజీబీవీలు, ఇతర ఉద్యోగులకు జీతాలు, కేజీబీవీల్లో ఫుడ్‌ బిల్లులు, పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ, గ్రాంట్లు విడుదల వంటివి విశాఖ కార్యాలయం నుంచి మాత్రమే చేయాల్సి ఉంది. అందువల్ల ఇక్కడ ఫైనాన్సింగ్‌, ఆడిట్‌ విభాగాలను పటిష్ఠం చేసుకునే క్రమంలో ముగ్గురు ఉద్యోగులను కొనసాగిస్తున్నాం. రెగ్యులర్‌, కాంట్రార్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వేర్వేరుగా గుర్తించి రివర్స్‌ సీనియారిటీని అమలుచేశాం.

Updated Date - 2022-09-26T06:40:58+05:30 IST