సమాజ్‌వాదీ టోపీకి రక్తం మరకలు: యోగి

ABN , First Publish Date - 2022-01-29T21:57:44+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వెడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై..

సమాజ్‌వాదీ టోపీకి రక్తం మరకలు: యోగి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వెడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని, 1500 మందికి పైగా హిందువులను జైళ్లలోకి నెట్టారని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారని ఎద్దేవా చేశారు. బాగ్‌పట్‌లో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ , నేరగాళ్లకు వాళ్లు (ఎస్‌పీ) టిక్కెట్లు ఇచ్చారని చెప్పారు. మొరాదాబాద్‌లో పార్టీ అభ్యర్థులను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. వారిలో ఒకరు ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లను చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తాలిబన్లు అంటే మానవత్వానికి వ్యతిరేకులనీ, అలాంటి వారిని సపోర్ట్ చేయడం సిగ్గుచేటని యోగి అన్నారు.


ఎస్‌పీ, బీఎస్‌పీల మధ్య పోటీని ఆయన వివరిస్తూ, ఎవరు ఎంత పెద్ద నేరస్థులకు టిక్కెట్లు ఇచ్చామనే విషయంలోనే వారి మధ్య పోటీ ఉందని చెప్పారు. ఈ నేరగాళ్లే ఎమ్మెల్యేలయితే వాళ్లు తయారు చేసేది తుపాకులే కానీ, ఫ్లవర్స్ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి వాళ్లకు జేసీబీలు, బుల్డోజర్లతోనేతో సమాధానం చెప్పాలని అన్నారు.


యూపీలో 2017కు ముందు శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉండేదని, మహిళకు భద్రత ఉండేది కాదని, ఆ కారణంగానే ఆడపిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లలేకపోయేవారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మగపిల్లలు తప్పుచేస్తారంటూ ములాయం సింగ్ సైతం మాట్లాడేవారని, వారికి మహిళలు, యువత పట్ల ఎప్పుడూ సానుభూతి లేదని ఆయన విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీతో మొదలై ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.



Updated Date - 2022-01-29T21:57:44+05:30 IST