Manipur అమ్మాయిని విదేశీ పర్యాటకురాలిగా పొరబడిన SP నేత.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2022-06-24T02:30:54+05:30 IST

మణిపూర్ అమ్మాయిని విదేశీ యాత్రికురాలిగా పొరబడి యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ

Manipur అమ్మాయిని విదేశీ పర్యాటకురాలిగా పొరబడిన SP నేత.. బీజేపీపై తీవ్ర విమర్శలు

లక్నో: మణిపూర్ అమ్మాయిని విదేశీ యాత్రికురాలిగా పొరబడి యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ (SP) నేతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మణిపురి అమ్మాయి లిచిప్రియ కన్‌గుజమ్ (Licypriya Kangujam) తాజమహల్ వద్ద ఓ ప్లకార్డు పట్టుకుని నిల్చుంది. దానిపై  ‘తాజ్‌మహల్ అందం వెనక ప్లాస్టిక్ కాలుష్యం ఉంది’ అని రాసి ఉంది. లిచిప్రియ ఈ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. 


సమాజ్‌వాదీ పార్టీ డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ మనీష్ జగన్ అగర్వాల్ (Manish Jagan Agrawal) కంట్లో ఈ ఫొటో పడింది. వెంటనే ఆయన ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘చివరికి విదేశీ యాత్రికులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అద్దం పట్టాల్సిన దుస్థితి నెలకొంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో యమునా నది మురికి కూపంగా మారింది. తాజ్‌మహల్ (Taj Mahal) అందానికి ఇది మాయని మచ్చ. విదేశీ పర్యాటకులు కూడా ఇలా ఎత్తి చూపడం ప్రభుత్వానికి సిగ్గుచేటు’’ అని ఆయన రాసుకొచ్చారు. 


ఈ ట్వీట్ చూసిన లిచిప్రియ వెంటనే స్పందించింది. ‘‘హలో సర్.. నేను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నాను. నేను విదేశీ పర్యాటకురాలిని కాను’’ అని ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా మనీష్ జగన్‌ను ట్రోల్ చేశారు. భారతీయురాలిని పట్టుకుని విదేశీ పర్యాటకురాలు అంటారా? అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఆయన సోషల్ మీడియా కోఆర్డినేటరా?అని మరో నెటిజన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఇది తొందరలో చేసిన పొరపాటు కాదని, ఇది నిర్లక్ష్యమని మరికొందరు మండిపడ్డారు. మణిపూర్ ఎక్కడుందో తెలియని వ్యక్తి రాజకీయాల్లో ఎందుకని ప్రశ్నించారు.

Updated Date - 2022-06-24T02:30:54+05:30 IST