అఖిలేశ్ ఆరోపణలకు ఊతం.. ఈవీఎంల తరలింపులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న వారణాసి కమిషనర్

ABN , First Publish Date - 2022-03-09T22:36:09+05:30 IST

ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను అక్రమంగా తరలించారని సంచలన ఆరోపణలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ..

అఖిలేశ్ ఆరోపణలకు ఊతం.. ఈవీఎంల తరలింపులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న వారణాసి కమిషనర్

లక్నో: ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలను అక్రమంగా తరలించారని సంచలన ఆరోపణలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేశ్ యాదవ్ ఆరోపణలకు బలం చేకూరే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపులో అవకతవకలు నిజమేనని అంగీకరించారు. ఆ వెంటనే సర్దుకుని.. అవి శిక్షణ కోసం ఉపయోగించేవి మాత్రమేనని చెప్పుకొచ్చారు.  


‘‘ఈవీఎంల తరలింపులో ప్రొటోకాల్ గురించి మాట్లాడితే కనుక లోపం జరిగిన మాట వాస్తవమే. దానిని నేను అంగీకరిస్తాను. అయితే, ఓటింగులో ఉపయోగించిన ఈవీఎంలను తీసుకెళ్లడం మాత్రం అసాధ్యమని నేను గ్యారెంటీ ఇస్తాను. అక్కడ త్రీ గ్రేడ్ భద్రత ఉంది. అంతేకాదు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా బయట కాపలాగా ఉన్నారు’’ అని కమిషనర్ పేర్కొన్నారు.


ఈ వీడియోను షేర్ చేసిన సమాజ్‌వాదీ పార్టీ.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇదే జరిగిందని ఆరోపించింది. ఎవరి ప్రోద్బలంతో ఇది జరిగిందని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులపై ఒత్తిడి వచ్చిందా అని నిలదీసింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. 


అఖిలేశ్ యాదవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారణాసి కలెక్టర్ ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. అఖిలేశ్ ఆరోపణలకు బలం చేకూరేలా సమాజ్‌వాదీ పార్టీ నేడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-03-09T22:36:09+05:30 IST