సినిమా రివ్యూ : సామాన్యుడు

Published: Fri, 04 Feb 2022 15:20:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : సామాన్యుడు

చిత్రం : సామాన్యుడు 

విడుదల తేదీ : 04-02-2022

నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, రాజా, బాబూరాజ్, తులసి, రవీనాదేవి, మనోహర్, యోగిబాబు తదితరులు

సంగీతం : యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం : కెవిన్ రాజా

ఎడిటింగ్ : ఎన్.వి.శ్రీకాంత్

నిర్మాత : విశాల్

దర్శకత్వం : తు.ప. శరవణన్

యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. ఆసక్తికరమైన కథాంశాలతో సినిమాలు చేస్తూంటాడు. ఈ సారి కూడా ‘సామాన్యుడు’ అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సంక్రాంతికే విడుదల కావల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్‌లో విడుదలైంది. ‘వీరమే వాగై సూడుమ్’ తమిళ చిత్రానికిది డబ్బింగ్ వెర్షన్.  మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో థ్రిల్ చేసింది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

కథ

పోరస్ (విశాల్) పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ సామాన్య యువకుడు. అయితే అన్యాయాన్ని సహించలేడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. కొడుకు ఆవేశానికి అడ్టకట్టవేయాలని ప్రయత్నిస్తుంటాడు. అమ్మ, నాన్న, అన్న తన ప్రపంచంగా బతకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక (రవీనాదేవి) ఒక పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. ఆ పోకిరి నుంచి ద్వారకను కాపాడుకొనే క్రమంలో ఆమె హత్యకు గురవుతుంది.  ఆమెతో పాటు మరికొన్ని హత్యలు కూడా జరుగుతాయి. వాటి వెనుక కొన్ని రాజకీయ శక్తులుంటాయి. వాటిని ఛేదించి, హత్యల వెనుకున్న హంతకుల్ని బైటికి లాగి.. పోరస్ తన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నదే మిగతా కథాంశం. 

విశ్లేషణ 

రాజకీయ శక్తుల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా ఎలా మారుతారు? జరిగింది అన్యాయం, అక్రమమే అని తెలిసినా పోలీసు డిపార్ట్ మెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎలా చిక్కుకుంటుంది? వాళ్ళు చేయలేని పనిని ఓ సామాన్యుడు, ధైర్యవంతుడైన యువకుడు తన తెలివితేటలతో వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో స్ర్కీన్ ప్లే బేస్డ్ గా చక్కటి కథని రాసుకున్నాడు కొత్త దర్శకుడు శరవణన్. అయితే ఇంట్రవెల్ పడే వరకూ అసలు పాయింట్ లోకి రాకపోవడం వల్ల.. ఫస్టాఫ్ అంతా బోరింగ్ గా సాగుతుంది . కృతకమైన సన్నివేశాలు, అతిగా అనిపించే కామెడీ.. వల్ల సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే సెకండాఫ్ నుంచి కథనం గాడిలో పడుతుంది. ఆసక్తికరమైన సన్నివేశాలతో.. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో సన్నివేశాలు చకచకా సాగుతాయి. హీరో చెల్లెలు ద్వారక, దివ్య అనే మరో అమ్మాయి, సామాజిక కార్యకర్త కథల్ని ముడిపెట్టి.. వాటిని ఒకే కోణంలోకి తీసుకురావడం ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురి పరిచయాలు, వారి మర్డర్స్ ప్రధమార్ధం జరిగితే.. వాటిని హీరో ఛేదించడం ద్వితీయార్దంలో సాగుతుంది. ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఇంట్రవెల్ ముందు సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మధ్యలో కొంత అరవ అతి మినహాయిస్తే.. ద్వితీయార్ధంలో వచ్చే సీన్స్ ఆసక్తిగా ఉంటాయి. 


పోరస్‌గా మధ్యతరగతి యువకుడి పాత్రలో విశాల్ మెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కథానాయికగా డింపుల్ హయతి పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికీ.. ఆమె  గ్లామర్ ఎపీరెన్స్, నటన మెప్పిస్తాయి. విశాల్ చెల్లెలుగా రవీనా, తల్లిగా తులసి, విలన్ గా మలయాళ నటుడు బాబూ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే విలన్ తమ్ముడిగా రాజా చెంబోలు నటన ఆకట్టుకుంటుంది. కెవిన్ కెమేరా పనితనం మెప్పిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద కొత్త దర్శకుడు శరవణన్ .. ఆసక్తికరమైన కథాకథనాలతో ప్రభావం చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ‘సామాన్యుడు’ చిత్రం బెటర్ ఆప్షన్. 

ట్యాగ్ లైన్ : సామాన్యమే 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International