సమస్యల పరిష్కారానికి బాధ్యతగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2022-10-01T06:55:37+05:30 IST

స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతులను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి బాధ్యతగా వ్యవహరించాలి
అర్జీదారుల సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

అధికారులకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం

స్పందనలో 67 వినతులు స్వీకరణ 


పాడేరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమంలో స్వీకరించిన వినతులను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో డీఆర్‌వో బి.దయానిధి, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌లతో కలిసి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే సమస్యలు పరిష్కారానికి నోచుకోవన్నారు. రెవెన్యూ, ఇంజనీరింగ్‌, సంక్షేమ శాఖలపై కోర్టు కేసులు వున్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. భూ సర్వే, ఇతర అంశాలకు సంబంధించి మండలస్థాయిలో సర్వేయర్లతో సమావేశాలు నిర్వహించాలని సబ్‌ కలెక్టర్‌కు సూచించారు. ప్రజల సమస్యలను సాధ్యమైనంత వరకు గ్రామ, మండల స్థాయిల్లోనే పరిష్కరించడానికి కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

స్పందనలో 67 వినతులు

స్పందన కార్యక్రమంలో పలు సమస్యలపై గిరిజనులు 67 వినతులను అధికారులకు అందించారు. జీకేవీధి మండలం జర్రెల పంచాయతీ పరిధిలో అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల పలుగ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయని, వాటి నిర్మాణానికి అనుమతి ఇప్పించాలని ఎంపీటీసీ సభ్యురాలు అడపా లోవకుమారి వినతిపత్రం సమర్పించారు. అదే మండలంలోని నూతులు గ్రామానికి రోడ్డు సదుపాయం  కల్పించాలని గ్రామస్థులు గుంట బుజ్జిబాబు, కె.మోహనరావు కోరారు. కొయ్యూరు మండలం గదబపాలెం సర్పంచ్‌ ఉల్లి నర్సమ్మ.. పంచాయతీ పరిధిలో డ్రైనేజీలు, చెరువులు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. జీకేవీధి మండలం మొండిగెడ్డ సర్పంచ్‌ అడపా ప్రియాంక.. జర్రెల కాలనీ, తోటలగొంది గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ మొండికోట గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కిముడు అనసూయ.. తనకు 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన వేతన బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఇదే మండలం పెదలోచలి పంచాయతీ పనసలపాడు గ్రామానికి చెందిన కొర్రా బుల్లమ్మ తనకు ఆశ కార్యకర్త ఉద్యోగం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, డీఈవో డాక్టర్‌ పి.రమేశ్‌, టీడబ్ల్యూ డీడీ ఐ.కొండలరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T06:55:37+05:30 IST