సమత.. మమత.. మానవత

ABN , First Publish Date - 2022-04-22T05:30:14+05:30 IST

ఏసు ప్రభువు బోధలు సంచలనాత్మకాలు. అవి నాటికీ, నేటికీ... విశ్వం మొత్తాన్ని

సమత.. మమత.. మానవత

    • ఏసు ప్రభువు బోధలు సంచలనాత్మకాలు. అవి నాటికీ, నేటికీ... విశ్వం మొత్తాన్ని చీకటి మత్తు నుంచీ మేలుకొలిపే కొంగొత్త అరుణోదయ కిరణాలు. మానవునికి ప్రేమ తత్త్వాన్నీ, సమానత్వాన్నీ ఆచరణాత్మకంగా నేర్చించిన మహోన్నత మానవతా సూత్రాలు. 

ఆయన పుట్టుక ఒక పశువుల పాకలో... మూగ జీవాల మధ్య జరిగింది. ఆయన ఎటువంటి నిరాడంబరమైన, సాదాసీదా జీవితాన్ని ఎన్నుకున్నాడనేది దీనిని బట్టే అర్థమవుతుంది. ప్రభువు గమనం కూడా ఆ దిశగానే సాగింది. ఆయన ప్రసంగించినా చిన్న చిన్న కథలు, సామెతలు చెప్పినా, అద్భుతాలు చేసినా, చుట్టూ ఉన్న వారితో కలిసి మెలిగినా... అన్నీ సామాన్య జనులను సమర్థించేలా సాగాయి. నిజానికి... చారిత్రకంగా చూస్తే... ఆయన దావీదు మహారాజ వంశీకుడు. ఆధ్యాత్మికంగా... క్రైస్తవ ఆచార ప్రకారం... తండ్రి- కుమారుడు -పరిశుద్ధాత్మ అనే మూడంచె స్వరూపంలో ఆయనది రెండవ రూపం. అయినప్పటికీ ఆయన చూపు హీనులు, దీనుల బతుకుల మీద పడింది. అమానుషమైన హెచ్చు తగ్గులను తొలగించింది. వారికోసం ఏదైనా చేస్తామని ప్రగల్భాలు పలికేవారు చాలామందే ఉంటారు. కానీ మానవుడిగా జన్మించి... ప్రాణాలనే అర్పించిన మహనీయుడు క్రీస్తు. దైవశక్తిగా తిరిగి లేవడం అనేది తరువాతి విషయం.


జీవితంలో ఆయన ప్రదర్శించిన అద్భుతాలు ఎన్నెన్నో. మరణించిన పేద లాజరును తిరిగి బతికింపజేశాడు. జాలరులను తన సత్య వాక్య ప్రచారం కోసం శిష్యులుగా చేసుకున్నాడు. పాపం చేసిన ఒక మహిళను రాళ్ళతో జనం కొట్టి చంపబోయినప్పుడు... ‘‘మీలో తప్పు చేయని వాడే ముందుకు వచ్చి... ఆమె మీద రాయి విసరండి’’ అని చెప్పాడు. ఆమెను క్షమించి, క్రూరులైన జనంలో మార్పు తెచ్చాడు. 


కానా పల్లెలో... ఒక పేద ఇంటి పెళ్ళికి వెళ్ళి... అక్కడ వారి లోటుపాట్లు తీరే విధంగా ఆయన చూపిన ఔదార్యం అద్భుతం. దీనులు ధన్యులనీ, నిందలు భరించేవారు ధన్యులనీ పలికిన ఆయనలో దీనజన రక్షకుడు కనిపిస్తాయు. ప్రజల మీద ఇంత కృపారసాన్ని ఆయన కురిపించబట్టే... ఒక వైపు సమతాతత్త్వం, మరోవైపు మమతాతత్త్వం... ఈ రెండూ మానవతా మహోదయానికి దారి తీశాయి. ‘పొరుగువాడిని ప్రేమించు’ అనేది ఆయన నేర్పిన ప్రధాన సూత్రం. ‘గుడ్‌ సమరిటాన్‌’ కథ చెప్పి... ఒక వ్యక్తి తన జాతివాడు కాకపోయినా ప్రేమగా ఎలా చూడాలో వివరించాడు. స్వార్థంతో తమ వారిని ప్రేమగా చూడడం మామూలే. కానీ ఇతరులను, ముఖ్యంగా శత్రువులను సైతం ప్రేమతో చూడడం ఎలాగో ప్రభువు నేర్పించాడు... కాదు, చేసి చూపించాడు. తనను శిలువపై వధించేటప్పుడు కూడా ఆ సైనికుల కోసం ప్రార్థించాడు. ‘‘వీరు చేసేది వీరికే తెలియదు. వీరిని క్షమించండి తండ్రీ!’’ అంటూ వేడుకున్నాడు. 


క్రీస్తు పుట్టకముందు కూడా విశ్వమంతటా అందరినీ సమదృష్టితో చూడాలనే సిద్ధాంతం ఉంది. కానీ అది ఆచరణలో మృగ్యం. అది పరిపూర్ణంగా క్రీస్తు ఆచరణలో వికసించడాన్ని గమనించవచ్చు. సమత ద్వారా మమత, మమత ద్వారా సమత - తద్వారా మహోన్నత మానవతను తన మాటల్లో, చేతల్లో చూపించిన మహనీయుడు క్రీస్తు నాథుడు. ఆయన బోధనలు అనంతర కాలంలో అనేక ధోరణుల్లో సూక్తులుగా మొలకెత్తాయి. మానవీయ దృక్పథ పరిణామానికి  దారితీశాయి. నేడు విశ్వగోళంపై ఆయన స్వరం సుస్వరమై... ఆయన గళం అనర్గళమై నినదిస్తూనే ఉంది.  


శత్రువులను సైతం ప్రేమతో చూడడం ఎలాగో ప్రభువు నేర్పించాడు... కాదు, చేసి చూపించాడు. తనను శిలువపై వధించేటప్పుడు కూడా ఆ సైనికుల కోసం ప్రార్థించాడు. ‘‘వీరు చేసేది వీరికే తెలియదు. వీరిని క్షమించండి తండ్రీ!’’ అంటూ వేడుకున్నాడు. 

 డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు 

9866755024




Updated Date - 2022-04-22T05:30:14+05:30 IST