సంబురం.. అంబరం

ABN , First Publish Date - 2021-10-17T04:43:02+05:30 IST

దసరా సంబురాలు అంబరాన్నం టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆలయాల్లో, సాయంత్రం శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

సంబురం..  అంబరం
మహబూబ్‌నగర్‌ పట్టణంలో రవాణ దహనాన్ని సెల్‌ఫోన్‌లలో బంధిస్తున్న పట్టణ ప్రజలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా సంబురాలు

పాలమూరులో ధ్వజధారి ఉరేగింపు

రావణ దహనం... బాణసంచాతో మారుమోగిన జడ్పీ ప్రాంగణం

కొండారెడ్డిపల్లిలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ పూజలు

జనం రాకతో సందడిగా మారిన పల్లెలు


దసరా సంబురాలు అంబరాన్నం టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆలయాల్లో, సాయంత్రం శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శమీ పత్రులను ఇచ్చి పుచ్చుకొని, పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వాహనాలకు పూజలు చేయించారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రావణ దహనం, బాణసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. అలంపూర్‌లో నదీ హారతి, తెప్పోత్సవాన్ని భక్తులు వేలాదిగా హాజరై, తిలకించారు. 

 మహబూబ్‌నగరు, అక్టోబరు 16: దసరా వేడుకలను ప్రజలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘ నంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా న గరాలు, పట్టణాల నుంచి జనం గ్రామాలకు చేరుకో వడంతో పల్లెలు సందడిగా మారాయి. జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, మునిసపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, పట్టణ ప్రముఖులు, దసరా ఉత్సవసమితి సభ్యులు పాల్గొన్నారు. 


 ఆర్యసమాజ్‌ నుంచి ఊరేగింపు

 మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆర్య సమాజ్‌ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది ధ్వజధారిగా ఉత్సవ సమితి సభ్యుడు గౌలి వీరు వ్యవహరించారు. ఆర్యసమాజ్‌ వద్ద పెద్దలు ఆయన చేతికి ధ్వజాన్ని అప్పగించారు. ముందుగా ఆర్య సమాజ్‌లో పూజలు చేసి, యజ్ఞం నిర్వహిం చారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి, హారతి ఇచ్చారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, డోలు, సన్నాయి మేళంతో ర్యాలీగా రాంనగర్‌లోని దసరా కట్ట వద్దకు చేరుకున్నారు. ఆర్య సమాజ్‌ నాయకులు దసరా కట్ట(పోల్‌)కు జెం డాను ఎక్కించారు. షమీ వృక్షానికి పూజ చేశారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనం లో ధ్వజధారి ఊరేగింపు ప్రారంభమైంది. గడియారం చౌరస్తా వద్ద ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో మైనారిటీలు  ఊరేగింపునకు స్వాగతం పలికారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అశోక్‌టాకీస్‌ చౌరస్తా, బస్టాండ్‌ మీదుగా 7:30 గంటలకు జడ్పీ మైదానం వద్దకు చేరుకుంది. అప్పటికే ముఖ్య అతిఽథులు వేదికపైకి చేరుకున్నారు. జనం వేలాదిగా మైదానానికి వచ్చారు.


చెడును జయించినప్పుడే విజయం: మంత్రి

 చెడుపై మంచి సాధించిన విజయమే విజయ దశమి అని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. జడ్పీ మైదానికి తరలివచ్చిన అశేష జనాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంస్కృతి, సంప్రదాయాలు, సభ్యత, సంస్కారాలను పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పక్కవాడు బాగుపడుతున్నాడంటే సంతోషించాలే తన్ప అసూయ పడకూడదని అన్నారు. మనసులో చెడు ఆలోచన ఉన్నదంటే మనలో రావణాసురుడు, మహిసాసురుడు ఉన్నట్లే అని చెప్పారు. పాలమూరు పట్టణాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకుపోతున్నా, అక్కడక్కడ కొంతమంది దుష్ప్రచారం చేస్తూ అభివృద్ధికి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వారిని పట్టించుకోకుండా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, తాటిగణేష్‌, ఎ.అంజయ్య, దసరా ఉత్సవ సమితి సభ్యులు డా.మనోహర్‌, మోహన్‌ యాదవ్‌, చంద్రయ్య, కెఎస్‌ రవికుమార్‌, భాస్కర్‌ పాల్గొన్నారు. 


 ఆకట్టుకున్న బాణసంచా

 పూణె నుంచి తెచ్చిన బాణసంచా ఆకట్టుకుంది. హరినాఽథ్‌ బృందం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. ముందుగా ఆరు ఆకాశ దీపాలను గాలిలోకి వదిలారు. అందులో ఒకటి ఫెయిల్‌ అవగా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.  ఆ తరువాత మల్లె వృక్షం, కల్ప వృక్షం, భూగోళం, సూర్యుడు రూపాలలో ఉన్న బాణసంచా కాల్చారు. విషం చిమ్ముతున్నట్లుగా ఆది శేషు, వాసుకు సర్పాల రూపాల్లో ఉన్న బాణసంచా అందరినీ ఆకట్టుకుంది. భారీ శబ్దాలతో పిడుగు స్థంభాలను పేల్చడంతో మైదానం మారుమోగింది. చివరగా 20 అడుగుల ఎత్తులో తయారు చేసిన రావణ దహనం వేడుకలను ముగించారు. బాణ సంచా కాలుస్తున్నంత సేపు జనం సెల్‌ఫోన్‌ ఫొటోలు, వీడియోలు తీశారు.


కొండారెడ్డిపల్లిలో పీసీసీ చీఫ్‌

వంగూరు: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శుక్రవారం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్థులు, పార్టీ శ్రేణులు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మఽధ్యాహ్నం రెండు గంటలకు గ్రామానికి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలొచ్చి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో స్థానిక మైసమ్మ ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి గ్రామస్థులతో కలిసి శమీ చెట్టు వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు చేశారు. జమ్మి ఆకు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తిరిగి వస్తుండగా గ్రామ పంచాయతీ సమీపంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలతో మాట్లాడారు. ఆక్కడి నుంచి హన్‌మాన్‌ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 12 గంటల వరకు ఉండి, తర్వాత కల్వకుర్తి వెళ్లారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కేవీఎన్‌ రెడ్డి, సర్పంచ్‌ భారతమ్మ, బొజ్జ కృష్ణారెడ్డి, వేమారెడ్డి, లాలుయాదవ్‌ ఉన్నారు.


జయహో జోగుళాంబ

అలంపూర్‌: విజయదశమి వేడుకల సందర్భంగా ఐదో శక్తిపీఠం జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు వేలాది మంది భక్తులతో కిటకిటలాడాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు జయహో జయహో జోగులాంబ అంటూ భక్తులు చేసిన నినాదాలు మిన్నంటాయి. శుక్రవారం ఉదయం ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి, అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. ఉదయం మహాపూర్ణహుతి, అవభృత స్నానం, సాయంత్రం శమీ చెట్టుకు పూజ నిర్వహించారు. సాయంత్రం యోగ నరసింహస్వామి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. ఊరేగింపులో భక్తులు అడుగడుగున స్వామివారికి బ్రహ్మరథం పట్టారు. వేంకటేశ్వరస్వామికి శేషవాహన సేవ నిర్వహించారు. రాత్రి నదికి అర్చకులు వేద మంత్రాల నడుమ ఐదు హారతులను ఇచ్చారు. అనంతరం నదిలో హంస వాహనంపై అమ్మవారిని, స్వామి వార్లను ఉంచి, నదీ విహారం చేయించారు. ఈ నదీ విహారాన్ని వేలాది మంది భక్తులు వీక్షించారు. విజయ దరహాసంతో నదీ విహారం చేయటం భక్తులు తన్మయత్వంతో తిలకించారు. భక్తులతో నదీ తీరంలోని పుష్కర ఘాట్‌ కిక్కిరిసిపోయింది. హంసవాహన, నదీ విహార సేవలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌లు బాలబ్రహ్మేశ్వరస్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.


భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు 

దసరా సందర్భంగా బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలొచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు చెల్లించుకున్నారు. వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహన పూజల కోసం పుష్కరఘాట్‌ సమీపంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాలకు అర్చకులు పూజలు నిర్వహించారు.















Updated Date - 2021-10-17T04:43:02+05:30 IST