అదే చెత్త.. అదే మురుగు!

ABN , First Publish Date - 2021-11-24T05:30:00+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి జాతీయ స్థాయిలో 70వ స్థానం దక్కింది.

అదే చెత్త.. అదే మురుగు!

  1. నివాసాల మధ్యనే పందుల సంచారం
  2. ఇంటింటి చెత్త సేకరణ ఏదీ..?
  3. పారిశుధ్య పనులపై పర్యవేక్షణ లోపం
  4. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుపై పెదవి విరుపు


కర్నూలు (అర్బన్‌), అక్టోబరు 24: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి జాతీయ స్థాయిలో 70వ స్థానం దక్కింది. ప్రచారాలతో నగరాన్ని అందంగా చూపుతున్నారు. జూలై 1న నగర పాలక సంస్థ పాలక మండలి సమావేశం డంపింగ్‌ యార్డులో నిర్వహించారు. అక్కడే భోజనాలు చేశారు. మరో అడుగు ముందుకేసి నగరంలో డంపర్లను తొలగించారు. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు దక్కిన ఏడు పదుల ర్యాంకుపై నగరం అంతటా పోస్టర్లు అంటించి మురిసిపోతున్నారు. ఇదంతా చూసి నగర ప్రజల్లో చర్చ మొదలైంది. నిజంగానే నగరంలో పారిశుధ్యం మెరుగు పడిందా..? ఎక్కడా చెత్తలేదా..? డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తోందా..? వీటిపై పెద్ద పరిశోధన అవసరం లేదు. కళ్లెదుట కంపు కొడుతుంటే.. ర్యాంకు వచ్చిందని సంబరం చేసుకో వడం విడ్డూరం కాక మరేమిటని ప్రజలు విమర్శిస్తున్నారు. 


ఈ ర్యాంకు ఎలా వచ్చింది..? 


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద దేశంలోని నగరాలకు ర్యాంకింగ్‌లను ప్రకటించింది. ఇందులో కర్నూలు నగరం 70వ స్థానంలో నిలిచింది. నగర పాలిక పరిధిలో చేపట్టే పనుల ఫొటోలు, వీడియోలను స్వచ్ఛ సర్వేక్షణ్‌కు పంపించారు. కార్యక్రమాలను సైట్‌లో పొందుపరిచారు. ఇలాంటి చర్యలు నిరంతరం చేస్తూ వచ్చారు. ర్యాంకింగ్‌ ఇవ్వడంలో డంపింగ్‌ రహిత నగరం, చెత్త నుంచి ఎరువు తయారీ, ఇంటింటికి చెత్త సేకరణ, ప్లాస్టిక్‌ నిషేధం, ఆరుబయట మలవిసర్జన అరికట్టడం, చెత్త నుంచి సంపద తయారీ, మురుగు నీటి శుద్ధి యంత్రాలు, డంపర్‌ బిన్స్‌ తొలగించి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించడం, మరుగుదొడ్ల వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రం, సిటీ క్లీనింగ్‌, చెత్త రహిత నగరం, కాలనీల్లో వీధి మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడం లాంటి వంద అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 


గాడి తప్పిన పారిశుధ్య నిర్వహణ


నగర పాలిక పరిధిలోని 52 డివిజన్లలో 6.50 లక్షల జనాభా ఉంది. 1.10 లక్షల ఇళ్లకు కేవలం 1,200 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. 14 శానిటరీ డివిజన్లుగా విభజించి వాటికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. పర్యవేక్షించాల్సిన శానిటరీ సూపర్‌ వైజర్‌ను ప్రేక్షక పాత్రకు పరిమితం చేశారు. ఫలితంగా చెత్తను తీసుకెళ్లే కార్మికులు తమ ప్రాంతాల్లో కనిపించడం లేదని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. కార్పొరేటర్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. డంపర్లను తొలగించినా, అక్కడే చెత్త పడేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కొందరు ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు కీలక నాయకులకు సన్నిహితులు కావడంతో అధికారులు వారిని ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. 


అమలు ఎక్కడ..?

పాలక మండలి నిర్ణయాలు అమలు కావడం లేదు. డంపర్‌ రహిత నగరం, ప్లాస్టిక్‌ హాటావో.. కర్నూలు బచావో అన్నవి నినాదాలకే పరిమితం అయ్యాయి. నిధులు వెచ్చించి ప్రచారం చేశారు. కానీ ఇవేమీ అమలు కావడం లేదు. 


పందులతో బేజార్‌


శరీన్‌ నగర్‌లో నివాసాల మధ్యే పందులను పెంచుతున్నారు. వాటి ఆహారం కోసం మాంసపు వ్యర్థాలను తెచ్చి అక్కడే పడేస్తున్నారు. దీంతో స్థానికులు దుర్వాసనతో అల్లాడుతున్నారు. ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. 

డాక్టర్స్‌ కాలనీలోని ప్రధాన వీధిలో ట్రాక్టర్‌ చెత్త కనిపిస్తుంది. ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన వేస్టు అక్కడ పడేయటంతోపాటు ఇళ్లలోని చెత్తను అక్కడే పారబోస్తున్నారు. చెత్తను తొలగించకపోవడంతో అది కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. 

బి.క్యాంప్‌ హౌసింగ్‌ బోర్డు, ఎఫ్‌సీఐ కాలనీల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్త పడేస్తున్నారు. పందులు కూడా విచ్చలవిడిగా తిరుగుతుండడంతో అక్కడ అపరిశుభ్రత నెలకొంది. 

నగరంలోని ప్రతి కాలనీలో పందుల పెంపకం ఒక పరిశ్రమలా తయారైంది. చాలా కాలనీల్లో ఇళ్ల మధ్యలోనే పెంపకం చేపట్టారు. డాక్టర్స్‌ కాలనీ బీసీ బాలుర వసతి గృహం వద్ద ట్రార్టర్లలో పందులు తీసుకువచ్చి వదిలి వెళ్తున్నారని విద్యార్థులు వాపొతున్నారు. వీరికి కొందరు రాజకీయ నాయకుల వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పెంపకందారుల ఆగడాలకు అడ్డ్డూ అదుపు లేకుండా పోయింది. బాలాజీ నగర్‌, బి క్యాంప్‌, పెద్దాసుప్రతి, ప్రముఖ హోటళ్లు, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, ఇళ్ల కూడళ్లలో పందుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కృష్ణా నగర్‌లో ఇళ్ల వద్దనే పందులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. పొరపాటున చిన్నారులు వాటి వద్దకు వెళితే దాడికి దిగుతున్నాయి. 


 నగరం ఎలా ఉంది..?


ప్రధాన కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. నగరంలో దాదాపు 1400 కాలనీలు, 300 మురికి వాడలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంటింటికీ చెత్త సేకరణ అటకెక్కింది. కార్మికులు వచ్చిన రోజే చెత్త వారికి ఇవ్వాలి. అప్పటి వరకూ చెత్తను ఇళ్లలోనే ఉంచాలి. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి వాడలతోపాటు శరీన్‌నగర్‌, డాక్టర్స్‌ కాలనీ, ఏ, బీ, సీ క్యాంప్‌లు, బుధవారపేట, చౌరస్తా, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్‌, సీతారామ్‌నగర్‌, రాజవిహార్‌, పాతబస్తి కాలనీల్లో రోడ్ల పక్కనే చెత్తను పడేస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో ఇలా జరుగుతోంది. 


ప్రతిభ వల్లే అవార్డు


నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్లే అవార్డు వచ్చింది. ప్రజలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం. కనీసం రోజు విడిచి రోజైనా చెత్తను సేకరించాలని సూచిస్తున్నాం. కార్మికులు, ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాల సమష్ఠి కృషి వల్లే నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 


- పద్మావతి, డిప్యూటీ కమిషనర్‌


కాలనీలు కంపు


చెత్తను పడేద్దామంటే డంపర్లు తొలగించారు. ఇళ్ల వద్దకు కార్మికులు రావడం లేదు. ఏవరికి ఫిర్యాదు చేయాలో అర్థంగాని పరిస్థితి. పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త సేకరణ ప్రక్రియ సరిగా జరగడం లేదు. అధికారులు వ్యవస్థను గాడిలో పెట్టాలి. లేకపోతే రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది.


- ఎం నాగమ్మ, జోహరాపురం


గాడి తప్పింది


పారిశుధ్య కార్మికులపై నియంత్రణ గాడి తప్పింది. ఇంటింటి చెత్త సేకరణ జరగడం లేదు. కానీ చెత్తను బయట పడేస్తే జరిమానా అని భయపెడుతున్నారు. ఒక్కోసారి వారం రోజులు చెత్తను ఇంట్లోనే పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కార్మికులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. 


- సురేష్‌, చౌరస్తా


రోడ్లపై మురుగు నీరు


పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. కాలువలను శుభ్రం చేసేందుకు ఒక ప్రణాళిక లేదు. సిబ్బంది కొరత అంటూ కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా రోడ్లపైకి మురుగు నీరు చేరుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలుసో లేదో..! వాహనాల కొరత అంటున్నారు. డంపర్లు తొలగిండం వల్ల కాలనీల్లో చెత్త పడేసేందుకు ఇబ్బంది పడుతున్నాం.             


 - ఎం రాంబాబు, కవాడీ వీధి


ప్రజలు నిలదీయాలి


చెత్తను తీసుకువెళ్లని కార్మికులను ప్రజలు నిలదీయాలి. చెత్తను తీసుకెళితేనే పన్ను చెల్లిస్తామని చెబితే కార్మికులకు భయం ఉంటుంది. వాహనాల కొరత వల్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. కార్మికుల స్థానంలో బినామీలు పారిశుధ్య పనులు చేస్తున్నారని ఆరోపణలూ ఉన్నాయి. వ్యవస్థను మార్చలేం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే పనులు చేయించుకోవాలి. 


- భాస్కర్‌రెడ్డి, ఎంహెచ్‌వో, ఆరోగ్య విభాగం


నగరాభివృద్ధిపై ఆర్థిక మంత్రితో భేటీ


  1.  హాజరైన నగర మేయర్‌, కమిషనర్‌ 


కర్నూలు(అర్బన్‌), నవంబరు 24: నగర అభివృద్ధిపై మేయర్‌, కమిషనర్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని కలిశారు. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఏపీ స్టేట్‌ గెస్టు హౌస్‌లో మంత్రి జిల్లా అఽధికారులతో సమీక్షించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఎంపిక చేసిన ర్యాంకింగ్‌లో నగరానికి 70 స్థానం దక్కిడం పట్ల మంత్రి అభినందించారు. అనంతరం అభివృద్ధి పనుల ప్రణాళికను మేయర్‌, కమిషనర్‌ మంత్రికి వివరించారు. సమీక్షలో ఎస్‌ఈ పాండురంగారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌సీపీహెచ్‌ శ్రీనాథ్‌రెడ్డి, కార్పొరే షన్‌ ఏఈ జనార్దన్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:30:00+05:30 IST