అదే ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-05-25T06:21:40+05:30 IST

కొత్తపల్లి మండలంలో ఉపాధి అధికారిగా పని చేస్తున్న మద్దిలేటి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అదే ‘ఉపాధి’
ఏసీబీ అధికారులకు చిక్కిన ఏపీవో మద్దిలేటి

15 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఉపాధి ఏపీవో

కొత్తపల్లి మండలంలో నాలుగేళ్లలో ముగ్గురు


కొత్తపల్లి, మే 24: కొత్తపల్లి మండలంలో ఉపాధి అధికారిగా పని చేస్తున్న మద్దిలేటి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ స్వామి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు తేజేశ్వరరరావు,  కృష్ణారెడ్డి, ఇంతియాజ్‌బాషా, వంశీనాథ్‌ కొత్తపల్లిలోని ఉపాధి హామీ అధికారి కార్యాలయాలపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చిన్న నాగమ్మకు గతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పట్టు గుడ్ల పెంపకానికి మల్బరీ షెడ్డు మంజూరయింది. దీనికి ఆమెకు ఇంకా రూ. 1.3 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉంది. దీన్ని మంజూరు చేయాలంటే రూ. 15 వేలు లంచం ఇవ్వాలని ఏపీవో మద్దిలేటి డిమాండ్‌ చేశాడు. నాగమ్మ కుమారుడు రాధాకృష్ణ తమకు ఫిర్యాదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.    ఈమేరకు వలపన్నామని..... రాధాకృష్ణ నుంచి ఏపీవో మద్దిలేటి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 


నాలుగేళ్లలో ముగ్గురు..

 

 కొత్తపల్లి మండలంలో నాలుగేళ్లలో ముగ్గురు అధికారులు ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయారు. 2018 నవంబరులో హౌసింగ్‌ ఏఈ రంగస్వామి, 2019 మార్చి నెలలో కొక్కెరంచ వీఆర్‌వో హనుమాన్‌,  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇప్పుడు ఉపాధి శాఖ కు చెందిన మద్దిలేటి అరెస్టయ్యాడు. 

Updated Date - 2022-05-25T06:21:40+05:30 IST