ఏ సినిమా అయినా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు: సీఎం

ABN , First Publish Date - 2022-02-11T00:25:28+05:30 IST

ఏ సినిమా అయినా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని

ఏ సినిమా అయినా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు: సీఎం

అమరావతి: ఏ సినిమా అయినా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని సీఎం జగన్ అన్నారు. సినీ పరిశ్రమ వర్గాలతో పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నంతలో మంచి పాలసీని తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. పెద్దా, చిన్నా తేడా లేకుండా సినిమాలకు న్యాయం జరగాలన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తూనే ఇండస్ట్రీ నిలబడాలనే తపన, తాపత్రయంతో ఉన్నామన్నారు.  కొంతమందిని ఎందుకు తగ్గించాలి, మరికొంతమందికి ఎందుకు పెంచాలనే అంశాలపై చిరంజీవి అన్నతో చర్చించానన్నారు. ఒక్కొక్కళ్లకి ఒక్కో రేట్లు అనేవి ఉండవన్నారు. టికెట్ల ధరలు అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాలనేది తమ అభిప్రాయమని ఆయన అన్నారు. భారీ బడ్జెట్ సినిమాల అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ సినిమాల రెమ్యునరేషన్లు  విషయంలోనూ ఆలోచన చేయాలన్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఛార్జీలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 


వైజాగ్‌లో సినీ పరిశ్రమకు స్థలాలు ఇస్తామన్నారు. మనందరం అక్కడకు వెళ్ళాలని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్  సినిమాలను తప్పనిసరిగా పెద్ద సినిమాలుగా ట్రీట్ చేయాలన్నారు. పెద్ద సినిమాలకు మొదటి వారం రేట్లు పెంచుకునేలా ఏర్పాటుచేయాలన్నారు. అమెజాన్ ఏడాదికి  వేయి సినిమాలు అందిస్తోందని ఆయన తెలిపారు. రాజమౌళి లాంటి దర్శకుడు చేసే పెద్ద సినిమాలు, ఇతర చిన్న సినిమాలను కూడా మనం రక్షించుకోవాలని ఆయన అన్నారు. విశాఖలో జూబ్లీహిల్స్ లాంటి  ప్రాంతాన్ని మనం  ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్‌తో విశాఖ పోటీ పడగలదన్నారు. విశాఖ ఫిల్మ్ సిటీగా ఇప్పటికిప్పుడు కాకపోయినా పదేళ్లకు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-11T00:25:28+05:30 IST