సముద్రఖని, యోగిబాబు కాంబినేషన్‌ చిత్రానికి టైటిల్ ఫిక్స్

Jul 26 2021 @ 18:41PM

ప్రముఖ దర్శకుడు సముద్రఖని, హాస్యనటుడు యోగిబాబులు కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. 11:11 ప్రొడక్షన్‌ అధినేత డాక్టర్‌ ప్రభు తిలక్‌ సమర్పణలో తి కమిటీ పిక్చర్స్‌ పతాకంపై సి. ఆనంద్‌ జోసఫ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దీనికి ‘యావరుం వల్లవరే’ అనే టైటిల్‌ను పెట్టారు. ‘వాల్టర్‌’, ‘ప్యారిస్‌ జయరాజ్‌’ వంటి సినిమాలను నిర్మించి ప్రేక్షకులను మెప్పించిన డాక్టర్‌ ప్రభు తిలక్‌.. ప్రస్తుతం అరివళగన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా ‘బార్డర్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎన్‌.ఏ.రాజేంద్ర చక్రవర్తి దర్శకత్వంలో ‘యావరుం వల్లవరే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. 


ఇందులో సముద్రఖని, యోగిబాబుతో ‘నాన్‌ కడవుళ్‌’ రాజేంద్రన్‌, రమేష్‌ తిలక్‌, ఇళవరసు, బోస్‌ వెంకట్‌, మయిల్‌స్వామి, జో మల్లూరి, పోస్టర్‌ నందకుమార్‌, రిత్వికా, సైతాన్‌ అరుంధతి మేనన్‌, దేవదర్శిని తదితరులు నటించనున్నారు. ఈ చిత్రం గురించి డాక్టర్‌ ప్రభు తిలక్‌ మాట్లాడుతూ, ‘మా సంస్థ నిర్మించే చిత్రాలన్నీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఆ కోవలోనే ఇపుడు ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా నాలుగు కోణాల్లో జరిగే వేర్వేరు సంఘటనలను ఒకే హైపర్‌లింకులో చూపించే చిత్రంగా ఇది వుంటుంది. ఈ చిత్రం స్ర్కీన్‌ప్లేను దర్శకుడు రాజేంద్ర చక్రవర్తి వివరించే సమయంలో ఎంతో విభిన్నంగా ఉండటంతో వెంటనే సినిమా చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. ఎన్‌ఆర్‌ రఘునందన్‌ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి జైస్‌ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు’ అని తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.