ప్రాణం తీసిన ఘర్షణ

Sep 26 2021 @ 00:06AM
కళాశాల ఎదురుగా రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాలు, కింద పడుకున్న మృతుడి తండ్రి భాస్కర్‌

- పాలిటెక్నిక్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

- హాస్టల్‌ భవనం నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

- వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలోని ‘బిట్స్‌’లో ఘటన

నర్సంపేట టౌన్‌, సెప్టెంబర్‌ 25 : ఒకే కళాశాలలో చదువుకుంటూ.. ఒకేగదిలో ఉంటున్న విద్యార్థులు చిన్న విషయానికే ఘర్షణపడి.. ఓ విద్యార్థి మృతికి కారణమయ్యారు. హాస్టల్‌లో రూమ్మేట్స్‌ మధ్య జరిగిన తోపులాటలో ఆ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే విద్యార్థిని కావాలని నెట్టివేయడంతోనే కిటికీలో నుంచి కిందపడ్డాడా? లేక ఒకరికొకరు కొట్టుకుంటున్న క్రమంలో జరిగిన తోపులాటలో పడిపోయాడా అన్నది తెలియరాలేదు. విద్యార్థులు, మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 

హనుమకొండ జిల్లా కమలాపురం మండలం వంగపల్లికి చెందిన నకీర్త భాస్కర్‌-కవిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ, తమ ఇద్దరు కొడుకులు సంజయ్‌, విజయ్‌ని చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌(18) నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బిట్స్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ డిప్లొమా ఈఈఈ విభాగంలో సెకండియర్‌ చదువుతూఅదే కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. విజయ్‌ కొత్తగూడెం పాలిటెక్నిక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. తరగతులు ప్రారంభం కావడంతో సంజయ్‌ 20న హాస్టల్‌కు వచ్చాడు. కళాశాలలోని బాలుర హాస్టల్‌ రెండో అంతస్తులోని గదిలో సంజయ్‌తో పాటు పాలిటెక్నిక్‌ సెకండియర్‌ చదువుతున్న నలుగురు విద్యార్థులు శివసాయి (దుగ్గొండి మండలం మహ్మదాపురం),  హరిరాజు (మహబూబాబాద్‌ జిల్లా గూడూ రు), మనోహర్‌ (హైదరాబాద్‌), కృష్ణంరాజు(చెన్నారావుపేట మండలం జల్లి) ఉంటున్నారు. 

ఈనెల 21న రూమ్మేట్స్‌ మధ్య జరిగిన చిన్నగొడవలో శివసాయి అనే విద్యార్థి గదిలోని కిటికీ అద్దాన్ని పగలగొట్టాడు. ఈ విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లగా.. గదిలో ఉంటున్న ఐదుగురు విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులను కళాశాలకు  పిలవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి తమ పిల్లలను మందలించి, గొడవలు పెట్టుకోవద్దని సూచించి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో శివసాయికి మిగతా రూమ్మేట్స్‌కు మధ్య కిటికీ అద్దం పగిలిన విషయంపై చర్చించుకున్నారు. పగిలిన అద్దానికయ్యే ఖర్చును భరించేవిషయంపై వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. సంజయ్‌ మధ్యలో కలుగజేసుకోగా అతడిపై కలియబడి కొట్టుకుంటూ ఒక్క సారిగా తోయ డంతో పక్కనే ఉన్న గ్రిల్స్‌లేని అద్దం పగి లి ఉన్న కిటికీలో నుం చి సంజయ్‌ కిందపడ్డాడు. పెద్దగా శబ్దం రావడంతో హాస్టల్‌ వార్డెన్‌తోపాటు విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకొని బిట్స్‌ యాజమాన్యానికి సమాచారం అందించారు. సంజయ్‌ను నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొం దుతూ అర్ధరాత్రి సంజయ్‌ మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలపగా, వారు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంనిమిత్తం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. 

కాగా, తమ కొడుకును కిటికీలో నుంచి తోసేయడం వల్లే చనిపోయాడని, గదిలో ఉంటున్న నలుగురితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని సంజయ్‌ తండ్రి భాస్కర్‌ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా హాస్టల్‌ గదిలో ఘర్షణ పడిన శివసాయి పరారీలో ఉన్నాడు. మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ ఫణీందర్‌ తెలిపారు.

యాజమాన్య నిర్లక్ష్యం..

కళాశాలలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే సంజయ్‌ మృతి చెందాడని పలువురు ఆరోపిస్తున్నారు. 21న ఘర్షణ తలెత్తినప్పుడు విద్యార్థులను వేర్వేరు గదుల్లోకి మార్చాల్సి ఉండగా యాజమాన్యం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మనిషి సులువుగా పడిపోయేంత పెద్ద కిటికీకి గ్రిల్స్‌ బిగించకపోవడంపై మండిపడుతున్నారు. కిటికీ అద్దం పగిలిన వెంటనే కొత్తది బిగించకుండా అద్దం ఖర్చును విద్యార్థులే భరించాలని చూడడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే భవనంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, ఇదే కళాశాలలో కుక్కల దాడిలో విద్యార్థి మృత్యువాత పడడం వంటి సంఘటనలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. 

తోపులాటలోనే కిందపడి ఉంటాడు..

 ఎ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి,  

బిట్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌

ఈనెల 21న సంజయ్‌ రూమ్‌లోని విద్యార్థులు గొడవపడితే పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. వారి తల్లిదండ్రులు కూడా వచ్చి తమ పిల్లలను మందలించి వెళ్లా రు. శుక్రవారం రాత్రి మళ్లీ గొడవ జరగడంతో విద్యార్థులు ఒకరికొకరు తోసుకోవడంతో సంజయ్‌ కిందపడి ఉంటాడు. సంజయ్‌ శరీరం లోపలి భాగంలో బలమైన గాయాలు కావడంతోనే మృతి చెందాడు. సంజయ్‌ను వెంటనే వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండాపోయింది. కిటికీలకు గ్రిల్స్‌లేని మాట నిజమే. భవనం కొత్తది కావడంతో నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నాం. విద్యార్థులే ముందస్తుగా గదుల్లోకి వెళ్లడం జరిగింది.

విద్యార్థి సంఘాల రాస్తారోకో..

బిట్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సంజయ్‌ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులు మృతుడి కుటుంబసభ్యులతో కలి సి కళాశాల ఎదుట నర్సంపేట-వరంగల్‌ ప్రధాన రహదారిపై శనివారం రాస్తారోకో చేపట్టారు. గంట పాటు జరిగిన రాస్తారోకోతో  వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టౌన్‌ సీఐ కరుణసాగర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొనిఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల నరేష్‌, మొగిలిచర్ల సందీప్‌, యార ప్రశాంత్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

Follow Us on: