తోడేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-11T05:46:35+05:30 IST

కోహెడ మండలంలో మోయ తుమ్మెద వాగు నుంచి రేయింబవళ్లు ఇసుకను తోడేస్తున్నారు. మల్లన్నసాగర్‌, ఇతర అభివృద్ధి పనుల పేరిట అనుమతి లేని చోట నుంచి కూడా రోజు వందల టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నది. వేసవి కాలం కావడం వాగులో నీరు లేకపోవడంతో భారీ ఎత్తున ఇసుక దందాను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

తోడేస్తున్నారు!

మల్లన్నసాగర్‌, ఇతర అభివృద్ధి పనుల పేరిట ఇసుక రవాణా

అనుమతి ఓ చోట.. తవ్వకం మరో చోట

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం


కోహెడ, మే  10 : కోహెడ మండలంలో మోయ తుమ్మెద వాగు నుంచి రేయింబవళ్లు ఇసుకను తోడేస్తున్నారు. మల్లన్నసాగర్‌, ఇతర అభివృద్ధి పనుల పేరిట అనుమతి లేని చోట నుంచి కూడా రోజు వందల టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నది. వేసవి కాలం కావడం వాగులో నీరు లేకపోవడంతో భారీ ఎత్తున ఇసుక దందాను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 

మండలంలోని తంగళ్లపల్లి గ్రామ పరిధిలోని మోయ తుమ్మెద వాగులో ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతించింది. కానీ అక్రమార్కులు రామచంద్రాపూర్‌, వింజపల్లి, కూరెళ్ల, బస్వాపూర్‌, వరుకోలు గ్రామాల పరిధిలోని వాగు వెంట కూడా ఇసుక అక్రమ రవాణాను చేస్తున్నారు. మోయ తుమ్మెద వాగు రెండు వైపులా ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడికక్కడ స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకుని మరీ విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చట్టాలను అమలు చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రవాణా, పోలీసు, మైనింగ్‌ శాఖలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతోనే ఇసుక దందా కొనసాగుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే ఏ అధికారి ఇటువైపు తొంగి చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.


 గ్రామ అభివృద్ధి కమిటీ పేరిట వసూళ్లు

మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు లారీలు ఆరు ట్రాక్టర్లుగా సాగుతోంది. ఇక్కడ గ్రామ అభివృద్ధి పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అక్రమ వసూళ్ల కోసం కొంతమంది నాయకులు కుమ్మక్కై ఈ కమిటీ వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమిటీ టాక్టర్‌కు రూ.200 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. మల్లన్నసాగర్‌కు ఇసుక సక్రమంగా సరఫరా కావాలంటే కమిటీకి డబ్బు కట్టాలని, లేదంటే గ్రామస్థులతో అడ్డుకుంటామని బెదరించి బేరం కుదర్చుకున్నట్లు తెలిసింది.  పలుచోట్ల ఇసుకను డంపు చేసి మరీ వ్యాపారం చేస్తున్న అడిగే నాఽథుడు లేడు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు. 


అనుమతి తంగళ్లపల్లికి అయితే కూరెళ్ల పరిధిలో ఎలా తీస్తారు?

కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెళ్ల గ్రామాల పరిధిలోని మోయతుమ్మద వాగులో ఉన్న రైతుల మోటార్లను ధ్వంసం చేసి ఇసుక తరలించడంపై అఖిలపక్ష నాయకులు సోమవారం నిరసనకు దిగారు. అభివృద్ధి పనుల కోసం తంగళ్లల్లి గ్రామ పరిధిలో ఇసుక రవాణాకు అనుమతినిస్తే కూరెళ్ల పరిధిలో ఇసుక ఎలా తీస్తారు అని అఖిలపక్షం ఆధ్వర్యంలో వాగులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మల్లన్నసాగర్‌ కోసమని చెప్పి మోయతుమ్మెద వాగులో రోజుకు వందల లారీలు, టిప్పర్లలో ఇసుకను ఇష్టారీతిగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వద్దని వారిస్తున్నా రైతులను అధికారబలంతో బెదిరించి నోరు మూయిస్తున్నారని మండిపడ్డారు. ఇష్టారీతిగా ఇసుకను తోడితే రైతుల బోరుబావులు ఎండిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి రైతుల మోటార్లను ధ్వంసం చేయడంపై టిప్పర్లకు ఎదురుగా నిరసనకు దిగారు. దీంతో హుస్నాబాద్‌ సీఐ రఘు, ఎస్‌ఐ రాజకుమార్‌ సంఘటన స్థలానికి వద్దకు చేరుకొని రెవెన్యూ అధికారులతో హద్దులపై మాట్లాడారు. కలెక్టర్‌ అనుమతితోనే తరలిస్తున్నట్లు నాయకులకు వారు వివరించారు. తంగళ్లపల్లి గ్రామ శివారులో ఇసుక తరలించేలా చేయడంతో నాయకులు, రైతులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ దృష్టి సారించాలని, అక్రమ తరలింపును ఆపాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, కాంగ్రెస్‌ నాయకుడు గాజుల వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకుడు బండారు లక్ష్మయ్య, నాయకులు బొమ్మగాని శివకుమార్‌,  లింగయ్య, కొండేటి నగేష్‌, సాయికుమార్‌, వేణు,  రాజయ్య, ఐలయ్య,  బాలయ్య,  రాజశేఖర్‌,  కనకయ్య, సత్తయ్య  రైతులు ఉన్నారు.


Updated Date - 2021-05-11T05:46:35+05:30 IST