ఇసుక నిల్వలకు..బరితెగింపు!

Jun 15 2021 @ 23:48PM
వేమూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఇసుక నిల్వకోసం గుట్టలు పోస్తున్న చిత్రం

ఇసుక కాంట్రాక్ట్‌ పొందిన సంస్థ ప్రతినిధుల బెదిరింపులు

మాన్‌సూన్‌ ప్లాన్‌ జీవో సాకుగా భారీగా ఇసుక నిల్వలకు సిద్ధం

మార్కెట్‌ యార్డులు, పాఠశాల స్థలాలను వదలడం లేదు..

ఏ స్థలంపై కన్నేస్తే దానిని అప్పగించాల్సిందే!

జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు పేరు చెప్పి అన్ని శాఖల అధికారులపై దందా

కనీస అద్దె ఒప్పందాలు కూడా లేకుండానే స్వాధీనం


రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకోసం కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ(జయప్రకాష్‌ పవర్‌ సెక్యూర్స్‌) సంస్థ వ్యవహారం చాలాచోట్ల వివాదాస్పదంగా మారుతోంది. ఇసుక స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుకు అవసరమైన స్థలాల ఎంపిక విషయంలో అడ్డుగోలుగా దందాకు దిగుతుండటం అటు స్థానికులు, చివరకు అధికార పార్టీ వర్గాల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతులు ఆ కంపెనీ ప్రతినిధులను అడ్డుకుంటే, మిగిలినచోట్లకూడా వరుసగా నిరసన సెగ తగులుతోంది. ప్రభుత్వం ఇసుక అమ్మితే ప్రైవేటు స్థలాలకు రూ.వందల కోట్లలో అద్దెలు చెల్లిస్తారు... ప్రైవేటుకు ఇచ్చేశాక ప్రభుత్వ స్థలాలను అప్పగించేస్తారా..? అంటూ ప్రతిపక్షాలు విమర్శలకూ దిగుతున్నాయి. 


తెనాలి, జూన్‌ 14, (ఆంధ్రజ్యోతి): ఇసుక కాంట్రాక్ట్‌ పొందిన జేపీ(జయప్రకాష్‌ పవర్‌ సెక్యూర్స్‌) సంస్థ ఇసుక నిల్వల కోసం బెదిరింపులకు దిగుతోంది. ఆ సంస్థకు ఏ స్థలం అవసరం, తమ వ్యాపారానికి ఏది అనువుగా ఉంటుందనుకుంటే దానిని స్వాధీనం చేసుకుంటోంది. చివరికి మార్కెట్‌ యార్డు స్థలమైనా, క్రీడామైదానాలైనా వదలడం లేదు. ఇదేం దౌర్జన్యమని ఎవరైనా అడ్డుకుంటే వారికి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులున్నాయని, అవసరమైతే రాష్ట్రంలోని ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలున్నాయని, ఎవరు అడ్డుపడినా ఊరుకునేదిలేదంటూ బెదిరింపులకు దిగుతారు. ఈ విషయంలో ఎవతవరకైనా వెళ్లటానికి అధికార యంత్రాంగాన్ని పుష్కలంగా వాడేసుకుంటున్నారు. 


మాన్‌సూన్‌ జాగ్రత్తలు ఇప్పుడే గుర్తొచ్చాయి..

ఏటా మాదిరిగానే కేంద్ర విపత్తుల శాఖ మాన్‌సూన్‌ జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. తుఫానులు, వరదలను సమర్ధంగా ఎదుర్కొనటానికి, నిర్మాణాలు ఆగకుండా అవసరమైన ఇసుక వంటి వాటిని ముందుగానే నిల్వ ఉంచుకొనేందుకు, తాగునీటి వంటి జాగ్రత్తలు, ఆహార నిల్వలు ఉండేలా చూసుకోవాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. అయితే రాష్ట్రంలో ఎప్పుడూ ఇసుక నిల్వ ఉంచే విషయంలో ఈ ఉత్తర్వులను పట్టించుకోని ప్రభుత్వం ఈసారి ప్రైవేటు సంస్థకు అప్పగించాక ఉత్సాహం చేపుతోంది. గతేడాది ప్రభుత్వమే ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టిన సమయంలోనూ ఈ ఉత్తర్వులు కేంద్రం నుంచి వెలువడ్డాయి. అయితే వరదల రాకముందు వరకు ఇసుక తవ్వకాలు జరిపిన ఏపీఎండీసీ ఒక్క ఇసుక మూటను కూడా బయట నిల్వ ఉంచలేదు. పైగా వీరికిందే డంపింగ్‌ యార్డులు ఉన్నా వాటిని ఖాళీగానే ఉంచి ప్రైవేటు వ్యక్తులకు అద్దెలు చెల్లించారే కానీ, నిల్వలకు సిద్ధ్దపడలేదు. ఈ సంవత్సరం ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం అప్పగించేసింది. ఏ కాంట్రాక్టు ఒప్పందంలో కూడా ప్రభుత్వ స్థలాలను అప్పగించేలా ఒప్పందాలు జరిగిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అయితే తాజాగా జె.పి సంస్థకు మాత్రం దీనికి విరుద్దంగా ప్రభుత్వ స్థలాలను అనధికార ఉత్తర్వులతో, అదికూడా నామమాత్రపు లీజులతో అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


ఏ స్థలంపై కన్నేస్తే దానిని అప్పగించాల్సిందే!

ఆ సంస్థ ఏ ప్రభుత్వ స్థలం కావాలని కోరితే దానిని ఆ సంస్థ అప్పగించకుండానే వారే స్వాధీనం చేసేసుకుంటున్నారు. జిల్లా మైనింగ్‌ అధికారుల రికార్డుల ప్రకారం వేమూరు మార్కెట్‌ యార్డు స్థలం, అచ్చంపేటలోని ఓర్వకల్లు, కోనూరులలో ఇసుక డంప్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మూడు చోట్ల అవసరమైన స్థలం విషయంలో విభిన్న పద్ధతులు అమలవటం విశేషం. ఓర్వకల్లు, కోనూరులలో మాత్రం ప్రైవేటు స్థలాన్నే లీజుకు తీసుకుని ఇసుక నిల్వచేస్తుంటే, వేమూరులో మాత్రం మార్కెట్‌ యార్డులోని ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి అధికారిక ఒప్పందాలు ముందుగా జరగలేదనేది సమాచారం. కేవలం ఒక లేఖను మార్కెటింగ్‌ శాఖకు అందించి స్థలాన్ని వాడేసుకుంటున్నారు. దీనిపై మార్కెట్‌ యార్డు కార్యదర్శి మురళీధర్‌ను వివరణ అడిగితే.. ఒప్పందాలన్నీ జరుగుతున్నాయని, ఇంజనీరింగ్‌ శాఖకు రాశామని, వారి నుంచి చదరపు అడుగుకు ఎంత అద్దె వసూలు చెయ్యాలనేది వారు సూచించాక నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అంటే దీనిప్రకారం అద్దె ఖరారు కాకుండానే 3.5 ఎకరాల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకున్నారనేది అర్ధమవుతుంది. అయితే ఎంత విస్తీర్ణాన్ని వారికి అప్పగించారని నిర్ణయించలేదు. చివరు రైతులు గోదాములో తమ వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు ఉంచాల్సిన దారిలోనూ ఇసుక అడ్డుగా పోసేశారు. వాహనాలు వెళ్లేందుకు ఖాళీ లేకపోవటం, తడి ఇసుక తీసుకురావటంతో గుట్టల నుంచి కారుతున్న నీరు గోదాములను చుట్టేయటంతో వాటి మన్నిక కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇదంతా ఒకెత్తయితే మెయిన్‌ రోడ్డు మీద నుంచి యార్డులోకి వచ్చేందుకు ఇటీవల నిర్మించిన సిమెంటు రోడ్డుపైనా అడ్డుగా ఇసుక గుట్టలు పోసేశారు. కేవలం ఒక వాహనం వెళ్లేందుకు వీలుగా దారి వదిలారు. 30 నుంచి 40 టన్నుల భారీ లోడుతో వస్తున్న లారీల కారణంగా ఈ రోడ్డుకూడా పగిలిపోయింది. యార్డుకు చుట్టూ ప్రహరీపె వరకు ఇసుక గుట్టలు పోయటంతో ఆ బరువుకు నిలవలేక రైతుల పంటకు రక్షణ ఇవ్వాల్సిన ప్రహరీ కూడా కూలిపోయింది. ఒక్కోచోటయితే గోదాము పైకప్పుకు మించి ఎత్తులో ఇసుక గుట్టలు పోస్తున్నారు. అయితే యార్డు స్థలంలో ఏది పాడయినా వాటిని సరిచేసి ఇవ్వాల్సిన బాధ్యత వారిదేనని అధికారులు చెబుతుంటే, ఏ ఒప్పందాలు జరగకుండానే ఇంతటి హంగామా చేస్తున్న ప్రైవేటు సంస్థ వీటి పునఃర్‌నిర్మాణ బాధ్యత ఎంతవరకు తీసుకుంటుందనేది ప్రశ్నార్ధకమే.


అధికార పార్టీ వారినుంచే వ్యతిరేకత వచ్చినా...

జిల్లాలో అధికారికంగా వేమూరు, అచ్చంపేట మండలాల్లోనే ఇసుక నిల్వలు చేస్తున్న ప్రయివేటు సంస్థ తాజాగా కొల్లూరు మండలం దోనేపూడి, తెనాలిలో కొన్నిచోట్ల, దుగ్గిరాల, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి వంటి పట్టణాలు, దూర ప్రాంతాల్లోకూడా డంపింగ్‌ చేసేందుకు స్థలాలను అన్వేషిస్తోంది. అయితే తాజాగా దోనేపూడిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంటే, దానికి సంబందించి పిల్లలు అడుకునే క్రీడా మైదానాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ స్థానికులు, అధికార పార్టీకి చెందిన యువకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రీడా మైదానానికి రక్షణగా రూ.2 కోట్లతో కట్టిన గోడను రెండు చోట్ల పగులగొట్టి దారి ఏర్పాటు చేసుకునేందుకు వచ్చిన పొక్లెయిన్‌ను యువకులు అడ్డుకున్నారు. వీటిపై విశాఖకు చెందిన నేత ఆదేశాలున్నాయని, మేము కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేయటంతో చివరకు యువకులు తాడోపేడో తేల్చుకుంటామని, ఆటస్థలంలో ఇసుక ఎట్లా నిల్వచేస్తారో చూస్తామని భీష్మించారు. దీంతో ఆదివారం జరగాల్సిన దారి పనులు సోమవారం ఆగిపోయాయి. ఇదే తరహాలో కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానం, తెనాలిలోని మరికొన్ని స్థలాలు, దుగ్గిరాల మండలంలో కొన్ని స్థలాలు పరిశీలిస్తే అక్కడకూడా కొన్నిచోట్ల ఎవరూ అడ్డుచెప్పకుంటే, మరికొన్నిచోట్ల మాత్రం స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని సమాచారం. దీంతో అడ్డుతగిలిన చోట మాత్రం అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పనులు చక్కబెట్టేందుకు వారి ప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న స్థలాలు చూసుకోవటం కానీ, ప్రైవేటు స్థలాలను తీసుకుని లీజులు చెల్లించుకోవటం వంటివి చెయ్యాల్సిన ఆ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని స్థానిక ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. అయితే అడ్డంకి ఉన్న ప్రతిచోట కలెక్టర్‌ ఉత్తర్వుల పేరుతో బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉంటే, దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే జిల్లా పాలనాధికారి అందుబాటులో లేరు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.