ఇసుకపై దృష్టేది

ABN , First Publish Date - 2020-07-14T10:04:14+05:30 IST

ఇసుక, మద్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) విభాగాన్ని ప్రవేశపెట్టింది.

ఇసుకపై దృష్టేది

అక్రమాలను విస్మరిస్తోన్న ఎస్‌ఈబీ

భవన నిర్మాణదారుల ఇక్కట్లు పట్టని అధికారులు

ఆన్‌లైన్‌ బుకింగ్‌ జరిగి 20 రోజులు అవుతున్నా పత్తా లేదు

డిపో వద్దకు వెళ్లి రూ.4 వేలు ముట్టజెబితేనే లారీ కదిలేది


గుంటూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఇసుక, మద్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) విభాగాన్ని ప్రవేశపెట్టింది.   ఈ వ్యవస్థ ఇసుకాసురుల భరతం పడుతుందని అందరూ ఆశించారు. అయితే ఈ విభాగం కేవలం మద్యంపైనే దృష్టి సారించిందే కాని ఇసుక అక్రమాలను విస్మరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ నుంచి పెద్దఎత్తున వస్తున్న మద్యం కేసులను ఈ విభాగం పట్టుకుని కేసులు నమోదు చేస్తోంది. అయితే జిల్లాలో ఇసుక అందక అవస్థలు పడుతున్న వారి గురించి పట్టించుకోవడంలేదు. ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇసుక కొరత కారణంగా అటు కూలీలకు పనులు లేక.. ఇటు భవన నిర్మాణదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వలే స్టాక్‌యార్డు/డిపోల సిబ్బంది, లారీ యజమానులు కుమ్మక్కై పిండేస్తోన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ చేసుకొని 20 రోజులు గడిచినా ఇప్పటివరకు లారీ పత్తా లేదని భవన నిర్మాణదారులు వాపోతున్నారు. ఇసుక టోల్‌ఫ్రీ నెంబరు. 14500కు ఫోన్‌ చేస్తే కాల్‌ కనెక్టు కావడానికి కనీసం 15 నిమిషాల నుంచి 25 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ కనెక్టు అయినా సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు డిపో వద్దకు వెళ్లి లారీ యజమానికి అదనంగా రూ.4 వేలు ముట్టజెబితే రెండు రోజుల్లో ఇసుక లారీ తీసుకొచ్చి డంపింగ్‌ చేస్తోన్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.


ప్రభుత్వం మాత్రం పైకి ఇసుక కొరత లేదు. సమృద్ధిగా స్టాక్‌యార్డులు, డిపోల్లో నిల్వలు ఉన్నాయని చెబుతున్నది. అలాంటప్పుడు ఇసుక ఎక్కడికి మాయమైపోతుందో వారికే తెలియాలి. స్టాక్‌యార్డుల్లో పని చేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది లారీ యజమాని వద్ద ఒక్కో ట్రిప్పుకి రూ.2 వేల వరకు తీసుకుంటూ వారు తీసుకొచ్చిన బుకింగ్‌ ఆర్డర్‌కు డిశ్పాచ్‌ కొడుతున్నారు. దీనికి అదనంగా మరో రూ.2 వేలు కలిపి లారీకి రూ.4 వేల వరకు లారీ యజమాని వసూలు చేసుకుంటున్నాడు. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టే లక్ష్యంతోనే ఏర్పాటైన ఎస్‌ఈబీ కూడా ఈ అక్రమాల గురించి పట్టించుకోవడంలేదు. రీచ్‌లు వారీగా పెండింగ్‌ జాబితా తీసుకుని ఇప్పటివరకు జరిగిన డిశ్పాచ్‌లు చూస్తే అక్రమాలు ఇట్టే వెలుగులోకి వస్తాయి.  

Updated Date - 2020-07-14T10:04:14+05:30 IST