ఇసుక జలగలు

ABN , First Publish Date - 2020-11-18T06:25:26+05:30 IST

సొంత ఇంటి కలను సాకారం చేసుకుందామనుకునే సామాన్యుడిని ఇసుకాసురులు జలగల్లా దోచేస్తున్నారు.

ఇసుక జలగలు

సామాన్యులను దోచేస్తున్న అధికార పార్టీ నేతలు

మంత్రితో జత కలిసి మైలవరం కృష్ణుడి దందా

మరో మెట్ట ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడిదీ అదేదారి

జిల్లా రీచ్‌ల్లో 300 టిప్పర్లు నేతల బినామీలవే

వారికి లబ్ధి చేకూర్చే విధంగా రవాణా బాదుడు

5 నెలల్లో లారీకి రూ.2వేలకుపైగా పెరిగిన చార్జీలు


సొంత ఇంటి కలను సాకారం చేసుకుందామనుకునే సామాన్యుడిని ఇసుకాసురులు జలగల్లా దోచేస్తున్నారు. టన్ను ఇసుక రూ.375కే అమ్ముతున్నామని చెబుతున్న ప్రభుత్వం రవాణా కాంట్రాక్టులను మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కట్టబెట్టి అధికారిక దోపిడీకి పాల్పడుతోంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి, మైలవరం కృష్ణుడిగా చెలామణి అవుతున్న ఓ ప్రజాప్రతినిధి, మెట్ట ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే తమ్ముడు జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో తిష్టవేసి, సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

టన్ను ఇసుక రూ.375. సామాన్య గృహ నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో పది, లేదా 18 టన్నుల వరకు ఇసుక బుక్‌ చేసుకునే వెసులుబాటుంది. జిల్లాలో ఒక మూల నుంచి మరో మూలకు వెళ్లాలంటే గరిష్ఠంగా 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కిలోమీటరుకు డీజిల్‌ ఖర్చు రూ.10 అనుకున్నా రూ.1500 ఖర్చవుతుంది. ఇసుక లోడింగ్‌ అన్‌లోడింగ్‌ ఇతర ఖర్చులు వేసుకున్నా మరో రూ.2వేలు అవుతుంది. గరిష్ఠంగా ఇసుక రవాణాకు రూ.3500 నుంచి 4వేల లోపే అవుతుంది. ప్రస్తుతం దూరం దగ్గర తేడా లేకుండా ఏ రీచ్‌ నుంచి ఇసుక బుక్‌ చేసుకున్నా రవాణా చార్జీ రూ.11,803 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, మైలవరం కృష్ణుడిగా నీతులు చెప్పే ఓ ప్రజాప్రతినిధి, మెట్ట ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే తమ్ముడు జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో తిష్టవేసి సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. 


జలగల్లా పీల్చేస్తున్నారు..

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేశారు. అప్పట్లో 10 టైర్ల లారీ ఇసుక రూ.3 వేల నుంచి నాలుగు వేలకు లభ్యమయ్యేది. ప్రస్తుతం అదే ఇసుకను ఐదు రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఉచిత ఇసుక’ నిలిపివేసింది. దీంతో భవన నిర్మాణరంగం ఘోరంగా దెబ్బతింది. కార్మికులు పనుల్లేక వలసలు పోయారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ సర్కార్‌ నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించింది. ఇక అక్కడి నుంచి అధికారిక దోపిడీకి తెరలేచింది. రీచ్‌ల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కాంట్రాక్టర్ల రూపంలో.. టిప్పర్ల యజమానుల రూపంలో అధికార పార్టీ నేతలు రీచ్‌లను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. తమకు లాభాలను తెచ్చేలా రవాణా చార్జీలను పెంచుకుంటూ పోయారు. రవాణా చార్జీ జూన్‌లో 81 కిలోమీటర్లకు రూ.9,643 కాగా, ఈ నెలలో 51 కిలోమీటర్లకు రూ.11,803కి పెరిగింది. కిలోమీటర్లు తగ్గినా రవాణా చార్జీ మాత్రం భారీగా పెరిగిపోయింది. దీని వెనుక జిల్లా మంత్రి, మైలవరం కృష్ణుడు, మెట్ట ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి రవాణా చార్జీల రేట్లను అడ్డగోలుగా పెంచుకున్నారని సమాచారం.

 

రూ.400 ఇస్తే 2 టన్నులు ఎక్కువేయిస్తా..!

రీచ్‌ల్లో అధికారిక దోపిడీతోపాటు అనధికార దోపిడీ కూడా సాగుతోంది. 18 టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్న గృహ నిర్మాణదారులకు 14 నుంచి 16 టన్నుల ఇసుకే  వస్తోంది. మిగిలిన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లోడింగ్‌ చేసే ముందు బుక్‌ చేసుకున్న వారికి రెండు టన్నులు ఎక్కువేసుకొస్తాం రూ.400 ఇవ్వండి అని టిప్పర్‌ డ్రైవర్లతో చెప్పిస్తున్నారు. బుక్‌ చేసుకున్న దానికే దిక్కు లేకుంటే అధిక ఇసుక వేసుకొస్తానంటూ మభ్యపెట్టి సామాన్యులను దోచుకోవడం టిప్పర్‌ డ్రైవర్లకు పరిపాటిగా మారింది. టిప్పర్లన్నీ అధికార పార్టీ నేతలకు చెందినవే కావడంతో వారి అనధికార దందాను ఎలా నిలువరించాలో అర్థం కాక అధికారులు మిన్నకుండిపోతున్నారు. 


వారి సంపాదన రోజుకు రూ.కోటి 

ఇసుక దందా ద్వారా జిల్లా మంత్రి, మైలవరం కృష్ణుడు, మెట్ట ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడు రోజువారీ రూ.కోటి వరకు సంపాదిస్తున్నారని సమాచారం. ఒక్క రవాణా చార్జీల్లోనే అరకోటి వరకు మిగులుతుండగా అక్రమంగా ఇసుకను తరలించడం ద్వారా మరో అరకోటికిపైగా సంపాదిస్తున్నారు. జిల్లాలోని పలు రీచ్‌ల్లో 300కుపైగా టిప్పర్లు ఈ ముగ్గురు నేతల బినామీలవేనని తెలుస్తోంది. ఇసుక రవాణా చేసే టిప్పర్లకు ట్రిప్పులు వేసేటప్పుడు వరుస క్రమాన్ని పాటించాల్సి ఉండగా అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు వ్యక్తుల టిప్పర్లకు వారానికి ఒకటో రెండు ట్రిప్పులు దక్కుతుండగా, ప్రజాప్రతినిధుల టిప్పర్లకు మాత్రం రోజుకు రెండు ట్రిప్పులకు అవకాశం దక్కుతోంది. ఒక్కో ట్రిప్పు రవాణా చార్జీ రూ.11803 కాగా, అందులో గరిష్ఠంగా అయ్యే ఖర్చు రూ.4వేలలోపే. మిగిలిందంతా సామాన్యుడిని దోచుకోవడమే. ఈ లెక్కన సుమారు రూ.అరకోటి వరకు కేవలం రవాణా ద్వారానే ఈ ముగ్గురు నేతలు అధికారికంగా దోచుకుంటున్నారు.

Updated Date - 2020-11-18T06:25:26+05:30 IST