ఇసుక..‘బల్క్‌’ మస్కా

ABN , First Publish Date - 2020-11-23T09:12:53+05:30 IST

బల్క్‌ అర్డర్స్‌తో గోదావరిలో ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, కట్టడాలకు ఇసుక సరఫరా పేరుతో పాటు వరంగల్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ కట్టడాలకు బల్క్‌ ఆర్డర్లతో నయా దందా మొదలెట్టారు

ఇసుక..‘బల్క్‌’ మస్కా

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరిట ఆర్డర్లు

ప్రైవేటు నిర్మాణాలకు కూడా సరఫరా

వేబిల్లు ఒక చోటికి.... వెళ్లేది బ్లాక్‌ మార్కెట్‌కు

టీఎ్‌సఎండీసీ కనుసన్నుల్లోనే దందా


భూపాలపల్లి, ఆంధ్రజ్యోతి :

బల్క్‌ అర్డర్స్‌తో గోదావరిలో ఇసుకను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు.  నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, కట్టడాలకు ఇసుక సరఫరా పేరుతో పాటు వరంగల్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ కట్టడాలకు బల్క్‌ ఆర్డర్లతో నయా దందా మొదలెట్టారు. వే బిల్లులు ఒక చోటికి ఉంటే.. ఇసుకను మరో చోటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 


భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో  రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీంతో గోదావరి బేసిన్‌లో నీటి నిల్వ పెంచేందుకు పూడిక తీయాలని 2017లో సుమారు 5.45 కోట్ల క్యూబిక్‌మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించింది. తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీఎ్‌సఎండీసీ) ఆధ్యర్యంలో ఇసుక అమ్మకాలు చేపట్టింది. రాష్ట్రంలో 60శాతం ఇసుకు కాళేశ్వరం ప్రాంతం నుంచే సరఫరా అవుతోంది.  


రాష్ట్రంలో ఎక్కడ ఏ భారీ ప్రాజెక్టు నిర్మించినా కాళేశ్వరం ఏరియా నుంచే ఇసుకను బల్క్‌ ఆర్డర్లతో తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కావాల్సిన ఇసుకను మహదేవపూర్‌ ఆరో క్వారీ నుంచి లిఫ్ట్‌ చేసేందుకు టీఎ్‌సఎండీసీ నుంచి అనుమతులు పొందారు. ఈ క్వారీలో 17,40,000 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉంది. ఇప్పటి వరకు సుమారు 13 వేల మెట్రిక్‌ టన్నులను తరలించారు. అయితే ఈ ఇసుకంతా ప్రాజెక్టులకు వెళ్తుందనేది ప్రశ్నార్థకమే. మల్లన్నసాగర్‌, పులిచింతల, దేవాదులతో పాటు ఇతర చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే ఇసుక తరలించినట్టు నాలుగేళ్లుగా లెక్కలు చూపిస్తున్నారు. ఈ బల్క్‌ ఆర్డర్‌లోనే అసలు మాయ ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ప్రాజెక్టుకు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం. ఈ ఇసుకను మహదేవపూర్‌ ఆరో క్వారీ నుంచి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి కాంట్రాక్టర్‌ రోజుకు 200 లారీల బల్క్‌ ఆర్డర్‌ ఒకేసారి తీసుకుంటాడు. దీంతో  ఒకేసారి 200 లారీల పేరుతో వేబిల్లు పొందుతారు. కానీ, వాటిలో లారీల నెంబరు ఉండదు. ఈ బల్క్‌ ఆర్డర్‌కు 15 రోజుల సమయం ఇస్తున్నారు.


ఈ 15 రోజుల్లో  200 లారీల్లో ఇసుకను లోడ్‌ చేసి సదరు ప్రాజెక్టుకు తరలించాలి. అయితే ఈ లారీలు ప్రాజెక్టుకు చేరకుండా అక్రమంగా వరంగల్‌లో కొన్ని, హైదరాబాద్‌కు మరికొన్ని వెళ్తున్నట్టు సమాచారం. వరంగల్‌ వరకు వెళ్లిన లారీ తిరిగి ఆ బల్క్‌ ఆర్డర్‌ పేరుతోనే మరోసారి అక్రమంగా ఇసుకను లోడ్‌ చేసుకొని వెళ్తుంది.  ఎన్ని లారీల్లో ఇసుక నింపేది ఎవరికీ  సమాచారం ఉండదు. కాంట్రాక్టరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు. ఇదంతా టీఎ్‌సఎండీసీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై బల్క్‌ ఆర్డర్‌ పేరుతో గోదావరి ఇసుకను కొల్లగొడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కోట్లాది రూపాయల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌కు అక్రమంగా తరలించి లారీ ఇసుకను రూ.60వేల నుంచి రూ.లక్ష  వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మహదేవపూర్‌ ప్రాంతంలోని కాళేశ్వరం ఇసుక రీచ్‌లలో ప్రైవేటు నిర్మాణాలకు కూడా బల్క్‌గా ఇసుక ఆర్డర్లు పొందుతున్నారు. ప్రస్తుతం డిమాండ్‌ లేకపోవటంతో భారీ ఎత్తున ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి నిల్వలు చేస్తున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో 26 టన్నుల సామర్థ్యం  ఉన్న లారీ ఇసుకకు రూ.60 వేల వరకు ధర ఉంది. వరంగల్‌లో కూడా ఇంచుమించుగా ఇదే ధర ఉంది. దీంతో ఇ సుకను విక్రయించకుండా బ్లాక్‌ మార్కెట్‌లో నిల్వ చే స్తున్నారు. వేసవిలో ఇదే ఇసుకను రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించేందుకు ఇసుక మాఫియా ప్ర యత్నిస్తున్నట్టు సమాచారం. అన్ని ఇసుక రీచ్‌లలో టీ ఎ్‌సఎండీసీ కనుసన్నుల్లో బల్క్‌ పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం సాగుతోందనే ప్రచారం ఉంది.  


నెంబర్‌ ప్లేట్లు మార్చి..

అక్రమార్కులు లారీల నెంబర్‌ ప్లేట్లు మార్చి ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఇటీవల రెండు లారీల ఇసుకను తరస్తూ మహదేవపూర్‌ పోలీసులకు చిక్కారు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నా తనిఖీ చేసే వారే కరువయ్యారు. టీఎ్‌సఎండీసీ, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అఽధికారులు తనిఖీల ఊసే ఎత్తరు. రోజుకు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమార్కులు నకిలీ బిల్లులతో మాయం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 


చోటా లీడర్‌ బడా దందా

 భూపాలపల్లి జిల్లాలో కాటారం సబ్‌ డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన చోటా లీడర్‌ ఈ ఇసుక బడా దందా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు బల్క్‌  సరఫరా పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఆ నేత ఇసుక అక్రమాల్లో ఆరితేరినట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ముఖ్య నేతల సపోర్టు ఉండటంతో ఈ చోటా లీడర్‌ పనులు టీఎ్‌సఎండీసీలో చకాచకా జరిగిపోతున్నాయట.

Updated Date - 2020-11-23T09:12:53+05:30 IST