సగిలేరులో ఇసుక దందా

ABN , First Publish Date - 2022-07-06T05:50:14+05:30 IST

జగన్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల ఇసుక బంగారమైంది. ఇసుకకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొందరు వైసీపీ నేతలు బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాగువంక చేను అనేది లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటడంతో పాటు పొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నా వారి గోడు పట్టించుకునే నాథుడే లేడు. సగిలేరు సాక్షిగా అనుమతులు లేకుండా ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.

సగిలేరులో ఇసుక దందా
ఇసుక తవ్వకాలతో సగిలేరులో ఏర్పడ్డ గోతులు

అనుమతులు లేకుండా తవ్వకాలు 

భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని రైతుల ఆందోళన 

పట్టించుకోని అధికారులు 


జగన్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల ఇసుక బంగారమైంది. ఇసుకకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొందరు వైసీపీ నేతలు బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాగువంక చేను అనేది లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటడంతో పాటు పొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నా వారి గోడు పట్టించుకునే నాథుడే లేడు. సగిలేరు సాక్షిగా అనుమతులు లేకుండా ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.


(కడప ఆంధ్రజ్యోతి) : సగిలేరు వాగు ప్రకాశం జిల్లా నుంచి మొదలై కలసపాడు, కాశినాయన, బికోడూరు, బద్వేలు మీదుగా ప్రవహిస్తుంది. నంద్యాల జిల్లాలోని నల్లమల్ల, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో కురిసే భారీ వర్షాలకు వచ్చే నీరు ఈ సగిలేరు ద్వారా పారుతుంది. కలసపాడు మండలం ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉంటుంది. దీనినే కొందరు ఇసుక అక్రమార్కులు క్యాష్‌ చేసుకుంటున్నారు. కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం సమీపంలోని ఉన్న సగిలేరు నుంచి అనుమతులులేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను ఎక్సకవేటర్ల ద్వారా తవ్వేస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ దిగువ తంబాళ్లపల్లె, సింగరాయపల్లె, ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన కొందరు ఎక్సకవేటర్లు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. పట్టపగలే అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాలను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తీసే ట్రాక్టర్‌ ఇసుకను రూ.3 వేల చొప్పున కలసపాడు ప్రాంతంలో విక్రయిస్తున్నారు. రోజూ కనీసం 10 నుంచి 20 ట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే అడ్డంగా ఇసుకను త వ్వేస్తున్నా కలసపాడు రెవెన్యూశాఖ, పోలీసులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

రైతుల ఆందోళన  

జిల్లాలో కలసపాడు మండలం వెనుకబడిన ప్రాంతం. కడప - ప్రకాశం జిల్లాలకు సరిహద్దులో ఉంది. ఇక్కడ ఏమి జరిగినా జిల్లా స్థాయి అధికారులకు తెలియదు అనే ఉద్దేశంతో కొందరు బరితెగిస్తున్నారు. ఇందులో భాగమే ఇసుక తవ్వకాలని చెబుతున్నారు. మండలంలో తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చాలా మటుకు గ్రామాలకు సాగు నీరు అందుతోంది. అయితే ఎగువరామాపురం, ఎగువతంబళ్లపల్లె, రెడ్డిపల్లె, గంగాయపల్లె, నీలాపురం, దిగువతంబళ్లపల్లె, సింగరాయపల్లె, బ్రాహ్మణపల్లె, రాజుపాళెం, సుండుపల్లె, గోపాలపల్లె గ్రామాలకు నీరు అందదు. ఇక్కడ కేవలం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తుంటారు. సగిలేరుకు నీరు వస్తే ఈ గ్రామాల్లోని రైతుల పొలాలకు నీరు అందుతుంది. ఒక్క సారి భారీగా ఏరుపారితే సగిలేరు పరివాహక ప్రాంతాల్లో బోర్లలో సమృద్ధిగా నీరు ఉంటుంది. దీంతో బోర్ల పరిఽధిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముద్దంవారిపల్లె సమీపంలోని సగిలేరు నుంచి యధేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ తవ్విన ఇసుకను జల్లెడపట్టి సమీపంలోని పోరుమామిళ్లకు తరలించి ట్రాక్టర్‌ రూ.2500 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. రోజుకు కనీసం 10 ట్రాక్టర్ల ఇసుకయినా ఇక్కడ తవ్వేస్తున్నారు. వాల్టాకు తూట్లు పొడుస్తున్నా రెవెన్యూ, పోలీస్‌ అధికారుల పట్టించుకోకపోవడం పలు ఆరోపణలకు తావిస్తోంది.


వాహనాలను సీజ్‌ చేస్తాం

- పూజితా నీలం, ఏఎస్సీ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో

అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తాం.



Updated Date - 2022-07-06T05:50:14+05:30 IST