మంజీరాలో ఇసుక దోపిడీ నిజమే

ABN , First Publish Date - 2020-07-13T20:18:01+05:30 IST

మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిఽధిలో మంజీరా నదిలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరిగిటన్లు విచారణ అధికారులు తేల్చారు.

మంజీరాలో ఇసుక దోపిడీ నిజమే

అనుమతులకు మించి తవ్వినట్లు నిర్ధారణ

సీనరేజ్‌  ఛార్జీలు  వసూలు చేయని తహసీల్దార్‌  

439 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక సీజ్‌

ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్‌కు గనుల శాఖ ఏడీ నివేదిక


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌ (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిఽధిలో మంజీరా నదిలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరిగిటన్లు విచారణ అధికారులు తేల్చారు. ఘణపురం ఆనకట్ట వద్ద ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు, తరలింపులో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు  నివేదిక సమర్పించినట్లు సమాచారం. సీనరేజ్‌ చార్జీలను చెల్లించకపోయినా ఉద్దేశపూర్వకంగానే స్థానిక అధికారులు ఉపేక్షించినట్లు నిర్ధారించారు. అక్రమంగా తరలించిన 439 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఉన్నతాధికారులు బాధ్యులైన అధికారులపై ఏ విధమైన తీసుకుంటారో వేచి చూడాలి.


ప్రభుత్వ పనుల పేరుతో ఇష్టారాజ్యం

మండలంలోని అభివృద్ధి పనుల కోసమంటూ జిల్లా అధికారులు మంజీరా నది నుంచి ఇసుకను తరలించేందుకు ఇటీవల అనుమతులు ఇచ్చారు. పంచాయతీరాజ్‌ అధికారులు 2వేల క్యూబిక్‌  మీటర్లు అవసరమని అంచనాలు రూపొందించగా.. తహసీల్దార్‌ ఆమేరకు పర్మిట్లు జారీ చేశారు. ఏ రోజు ఏ గ్రామం వారు ఇసుక తరలించాలో స్పష్టంగా పేర్కొంటూ అనుమతులిచ్చారు. అనుమతి వచ్చిందే తడవుగా ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. గ్రామాల్లో పెద్దఎత్తున ఇసుక నిల్వలను డంప్‌ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్‌ ఛార్జీలను సైతం ఎగ్గొట్టారు. ఈ వ్యవహారంపై గత జూన్‌ 30న ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో మంజీరాను తోడేస్తున్నారు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా మైనింగ్‌ ఏడీ జయరాజ్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపారు. 


పలుచోట్ల అక్రమంగా నిల్వ చేసిన 439 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక నిల్వలను సీజ్‌ చేశారు. సీనరేజ్‌ ఛార్జీలను కూడా చెల్లించలేదని నిర్ధారించారు. విచారణ జరుగుతున్న విషయం తెలుసుకున్న మండల అధికారులు అప్పటికప్పుడు సీనరేజ్‌ చెల్లించినట్లు  విచారణ అధికారికి రశీదులు సమర్పించారు. ఇసుక తరలించడానికి ముందే ఛార్జీలను వసూలు చేయాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే ఉపేక్షించినట్లు ఏడీ పేర్కొన్నారు. సీజ్‌ చేసిన ఇసుక నిల్వలను తహసీల్దార్‌ సహదేవ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇసుక దోపిడీపై కలెక్టర్‌ ధర్మారెడ్డికి మైనింగ్‌ ఏడీ నివేదిక సమర్పించారు. అధికారులు సీజ్‌ చేసిన మొత్తం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలించారనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-07-13T20:18:01+05:30 IST