ఇసుక ఇక్కట్లు ఇంకెన్నాళ్లు?

Nov 29 2021 @ 00:00AM
బాపట్లలో ఇసుక లేక నిలిచిపోయిన నిర్మాణాలు

 అందుబాటులో, తక్కువ ధరల్లో ఇసుకంటూ ప్రభుత్వం ప్రకటనలు

ఆచరణలో మాత్రం అమలు కాని వైనం

పది టన్నుల ధర రూ.16 వేలు! 

ఎన్నిసార్లు పాలసీలు మార్చినా ఇదే పరిస్థితి 

సమయానికి ఇసుక దొరక్క సామాన్యుడి గగ్గోలు 

మందకొడిగా నిర్మాణాలు  

భవన నిర్మాణ కార్మికులకు ఇంకా ఇక్కట్లే

 

సామాన్యులకు ఇసుక కష్టాలు తీరేలా లేవు. నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నామంటూ రోజూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా అవి ఆచరణలో అమలు కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పది టన్నుల ఇసుక రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యన ఉండగా.. ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. అయినా సమయానికి అందడం లేదు. నగదు చెల్లించి నాలుగైదు రోజులు ఎదురు చూడాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. చెంతనే ఉన్నా.. కృష్ణాతీరంలో ఉన్న గ్రామాలకూ ఇసుక గగనమైపోయింది. దీంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇసుక సరఫరా ఎప్పుడు సులభతరం అవుతుందో.. ఎప్పుడు ధరలు తగ్గుతాయో అని సామాన్యులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 29: వైసీపీ ప్రభుత్వం ఇసుకని ఆదాయవనరుగా పరిగణించి ప్రజలపై భారం మోపుతోంది. ఇసుక సరఫరా సులభతరం చేస్తున్నామని ఇప్పటికి నాలుగుసార్లు పాలసీలు మార్చారు. అయినప్పటికీ ప్రజలకు మాత్రం ఊరట లభించలేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యన 10 టన్నుల ఇసుకని లారీలో తీసుకొచ్చి ఇంటి వద్ద డంపింగ్‌ చేసేవారు. అలాంటిది ఇప్పుడు నాలుగురెట్లు ధర పెరిగింది. ప్రభుత్వం చేసే ప్రకటనలకు క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. 10 టన్నుల ఇసుక లారీ కోసం సప్లయర్లకు ఫోన్‌ చేస్తే రూ.16 వేలు చెల్లించాలని అడుగుతున్నారు. ఇసుక సరఫరా, ధరల్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇసుకని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంలో సీఎం జగన్‌ ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 గుంటూరు నగరంలో ఇలా..

ప్రస్తుతం గుంటూరు నగరానికి అమరావతి నుంచి మీడియం ఇసుక వస్తోంది. అది కేవలం గోడల ప్లాస్టింగ్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. శ్లాబు, కట్టుబడికి అవసరమైన గండర ఇసుక కావాలంటే మాత్రం కృష్ణా జిల్లాలోని కీసర వద్ద ఉన్న స్టాక్‌యార్డు నుంచి తెచ్చుకోవాల్సిందే. దీంతో ఇసుకతో పాటు రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో సప్లయర్లకు ఫోన్‌చేస్తే అదే రోజు సాయంత్రమో, రాత్రికో లారీ తీసుకొచ్చి ఇసుక డంపింగ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం మూడు, నాలుగు రోజులైనా నగదు చెల్లించి నిరీక్షించాల్సి వస్తోంది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆర్థికంగా భారమైనప్పటికీ చేసేది లేక 10 టన్నుల లారీని రూ.16 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 

  - వినుకొండలో ఇసుక అందని ద్రాక్షలా మారింది. మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన ఇసుక డంపింగ్‌ యార్డు కాంట్రాక్టర్‌ అద్దె చెల్లించకపోవడంతో  20రోజుల పాటు ఇసుక సరఫరా నిలిచిపోయింది. సుమారు రూ.6.17లక్షలు మార్కెట్‌యార్డుకు చెల్లించాల్సి రాగా రూ.60వేలు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాలుగురోజుల నుంచే ఇసుక అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానాన్ని తొలగించి కౌంటర్‌ వద్దనే నగదు చెల్లించే అవకాశం ఉండటంతో అక్రమార్కులు ఇసుకను బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు పోటీ పడుతున్నారు. దీంతో గృహనిర్మాణదారులు ఇసుక కోసం రోజుల తరబడి పాయింట్ల వద్ద ఇసుకకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. 

- తెనాలికి 25కి.మీ దూరంలో ఉన్న బొమ్మువానిపాలెం, కొల్లిపర, చిలుమూరు, కొల్లూరు రీచ్‌ల నుంచి ఇసుకను తెస్తుంటారు. గతంలో రూ.15వేలున్న 24టన్నుల లారీ ఇసుక ధర ప్రస్తుతం రూ.25నుంచి 30వేల వరకు పలుకుతుంది. చిన్న లారీ గతంలో రూ.6వేలు, 8వేలుంటే ఇప్పుడు రూ.12నుంచి 15వేలు పలుకుతోంది. ప్రస్తుతం కాంట్రాక్టరు ఇసుక సరఫరా నిలిపివేయడంతో టైరు బండ్లు మాత్రమే దిక్కయ్యాయి. గతంలో రూ.1000-1100 అమ్మిన బండి ప్రస్తుతం రూ.2,500కు విక్రయిస్తున్నారు. అది కూడా అవసరానికి దొరకడం లేదు. 

 - కృష్ణానది పక్కన ఇసుక రేవులు ఉన్నప్పటికీ తాడికొండ మండలం గ్రామాలకు ఇసుక దొరకడం లేదు. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.1300 పలుకుతోంది. ట్రాక్టర్లు, టిప్పర్లుకు ఇసుక లోడింగ్‌ జరగటం లేదు. బల్క్‌గా ఇసుకను కొనుగోలు చేసేవారికి మాత్రమే ఇసుకను లోడ్‌ చేస్తున్నారు.  తాడికొండకు తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం, అమరావతి మండలం జిడుగు నుంచి ఇసుక తెచ్చుకుంటున్నారు. జిడుగులో దొరికే ఇసుక మెత్తగా ఉండటంతో నిర్మాణాలకు అంతగా ఉపయోగం ఉండదని నిర్మాణదారులు తెలియజేస్తున్నారు. ఇసుక కావాల్సినవారు 30 టన్నుల టిప్పర్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 30 టన్నుల ఇసుక రూ.39 వేలు పలుకుతోంది. చిన్న చిన్న నిర్మాణాలు చేసుకునే వారు 25 కిలోల బస్తాను రూ.150కు కొనుగోలు చేస్తున్నారు.  

 - సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలోకంటే ఈ ప్రభుత్వంలో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.5వేలు పెరిగింది. దీంతో నిర్మాణదారులు వెనక్కి తగ్గటంతో భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం మండలాలకు అచ్చంపేట మండలంలోని ఇసుకరీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది. ప్రభుత్వపరంగా కూడా కొత్తగా నిర్మాణపనులు లేకపోవటంతో కార్మికులు ఇతర పనులకు వెళ్తున్నారు.  

  

ఇసుక లేక వెలవెలబోతున్న పిడుగురాళ్ల ఇసుక డంపింగ్‌యార్డు

-  పొన్నూరుకు చేరాలంటే ఇసుక 20 టన్నులు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు ధర పలుకుతోంది. ఇసుక క్వారీల వద్ద టన్నుకు బ్రోకర్లకు  కమీషన్‌ రూ.వంద నుంచి రూ.150 వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. 

ఫ బాపట్ల వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇసుక పాయింట్‌ ఏర్పాటు చేశారు.   ఉన్న ఇసుక కాస్త సిఫార్సు చేసిన వారికి ఇచ్చి దీనిని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఇసుక కావాలంటే ట్రాక్టర్‌ ఇసుక రూ.7వేలకు పైగా విక్రయిస్తున్నారు.    

- గతంలో రేపల్లె మండలం పెనుమూడి, ఓలేరు ఇసుక రీచ్‌లు ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు రీచ్‌లు మూతపడటంతో కొల్లిపర దగ్గర నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రూ.1500కు ట్రాక్టర్‌ ఇసుక వస్తే ప్రస్తుతం రేపల్లెకు రూ.5,500, ఇతర మండలాలకు వెళితే రూ.7వేలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. టిప్పర్‌ ఇసుక అయితే రూ.35వేల నుంచి రూ.45వేల వరకు ప్రాంతాన్ని బట్టి అమ్మకాలు జరుపుతున్నారు.

- పిడుగురాళ్లలో ఉన్న ఇసుక డంపింగ్‌యార్డులో ఉన్న నిల్వలంతా అయిపోయి నేడు వెలవెలబోతుంది. ప్రస్తుతం అమరావతి, క్రోసూరు, అచ్చంపేట ప్రాంతాల నుంచి సరఫరా అయ్యే ఇసుక టన్ను రూ.1500 ధర పలుకుతోంది. 

-  నరసరావుపేటలో టన్ను ఇసుక మెత్తటి రకం అయితే రూ.1600, నాణ్యత కలిగిన ఇసుక టన్ను రూ.1,800 నుంచి రూ.2,000 వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా నేరుగా ఇసుక రీచ్‌ దగ్గరకు వెళితే అక్కడ ఇసుక లభిండంలేదు. ఇబ్రహీంపట్నం నుంచి నరసరావుపేటకు ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.6,300 నుంచి రూ.6,700 వరకు విక్రయిస్తున్నారు.  

 - కృష్ణానది ఒడ్డున ఉన్న తాడేపల్లి మండలంలో ఐదు ఇసుక క్వారీలు ఉన్నా అవి తెరుచుకోకపోవడంతో ఇసుక కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో దుగ్గిరాల మండల పరిధి నుంచి ఇసుక వచ్చేది. కొద్దికాలంగా నదికి వరదల రాకతో ప్రకాశం బ్యారేజీ ఎగువన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రోసూరు నుంచి ఇసుక వస్తుంది. దీనికి కూడా దళారులే పెత్తనం చేస్తున్నారని కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.6,500కు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా సమయానికి రాక నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

  - మాచర్ల నియోజకవర్గంలో ఇసుక కొరత అధికంగా ఉంది. ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.6,500 వరకు ఉంది. సచివాలయంలో ఇసుక బుకింగ్‌ చేయడం లేదు. బ్లాక్‌లోనే ఇసుక దొరుకుతోంది. బ్రోకర్‌ టన్నుకు రూ.300 దాకా మార్జిన్‌ వసూలు చేస్తున్నారు. 

  - గడచిన 15 రోజుల వరకు టన్ను ఇసుక చిలకలూరిపేట ప్రాంతంలో రూ.980కు విక్రయించగా ప్రస్తుతం ఇక్కడ టన్ను ఇసుక రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ధర పలుకుతోంది. బుకింగ్‌ చేసుకున్న పదిరోజులకు కూడా ఇసుక అందే పరిస్థితి లేదు. అమరావతి ప్రాంతంలోని కృష్ణానది నుంచి వస్తున్న ఈ ఇసుక నాణ్యత లేకపోయినప్పటికీ నిర్మాణదారులు గత్యంతరం లేక అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక గోదావరి ఇసుక కూడా అడపా దడపా వస్తున్నప్పటికీ అధికారులు ఆ లారీలను అడ్డుకుంటున్నారు. దీంతో ఇసుక ధర మరింత పెరిగే అవకాశం ఉంది.  

 - అమరావతి మండల పరిధిలో దిడుగు గ్రామంలో ఇసుకను నదీ గర్భంలో ఎక్స్‌వేటర్‌ల సహాయంతో లారీలకు లోడింగ్‌ చేస్తున్నారు. ఇక్కడి నిర్వహణ సంస్థవారు స్థానిక నేతలకు వేల టన్నుల ఇసుకను బల్క్‌గా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బల్క్‌గా కొనుగోలు చేసిన వారికి సుమారు రెండువందల లారీలకు ఇసుకను అధికధరలకు విక్రయిస్తున్నారు. అధికారికంగా మాత్రం రూ.475 వసూలు చేసినట్లు బిల్లులు ఇస్తున్నారు.  

 

ఉదయం నుంచి వేచి చూస్తున్నా..

 మా ఇల్లు శ్లాబ్‌ దశకు వచ్చింది. నాలుగు టన్నుల ఇసుక కోసం కొన్ని రోజుల నుంచి ఇసుక కోసం ప్రయత్నిస్తుండగా మార్కెట్‌యార్డు దగ్గరకు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఉదయం నుంచి వేచి చూస్తున్నాను. ఇళ్లు పూర్తయ్యే లోపు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో  అర్ధం కాని పరస్థితి ఏర్పడింది.  

- పరస చిన్నప్ప, సంగినీడుపాలెం, బొల్లాప్లల మండలం 

-------------------------

ఇసుక దొరకడం కష్టంగా మారింది..

సమయానికి ఇసుక లభ్యత లేకపోవడంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. వడ్డీలకు అప్పులు తెచ్చినా మధ్య తరగతి ప్రజలు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కంటే ఇసుక లభ్యత గగనమైపోయింది. ఇసుక సమయానికి రాకపోవడంతో పనులు ఉన్నా సంపాదన తగ్గిపోయింది. 

- పరిటాల శ్రీనివాసరావు, తాపీ మేస్త్రి, తాడేపల్లి  

------------------------

నూతన విధానంతో ఇబ్బందులు..

నూతన ఇసుకవిధానంతో భవన నిర్మాణ కార్మికులకు రెండు సంవత్సరాల కాలంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గృహాలు నిర్మించుకునే వారుకూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండటంతో కార్మికులందరికీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుక రూ.600 ఉండగా నేడు టన్ను ఇసుక రూ.1600కు చేరటంతో ఇసుక పెరుగుదల నిర్మాణ రంగంపై పడింది. ప్రభుత్వం ఇసుక ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. 

- అవ్వారు ప్రసాదరావు , భవన నిర్మాణ కార్మికసంఘం నేత , సత్తెనపల్లి 

  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.