ఇసుక రీచ్‌ల్లో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-12-02T05:40:44+05:30 IST

ఇసుక విధానంలో పారదర్శకత, ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకే ఇసుక విక్రయాలంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, వాటి ఊసుమాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించటంలేదు.

ఇసుక రీచ్‌ల్లో ఇష్టారాజ్యం

ప్రకటనల్లోనే.. పారదర్శకత

షరామామూలుగానే ఇసుక తీరు

కృత్రిమ కొరతతో అధిక ధర వసూలు

రీచ్‌ల్లో అదనపు వసూళ్లతో సిబ్బంది దందా

రూ.490 ధరకు ఎక్కడా అందుబాటులో లేని ఇసుక


ఇసుక ఇంకా ఇసిగిస్తూనే ఉంది. జిల్లాలో ఇసుక ఇక్కట్లు రోజురోజుకు అధికమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినట్లుగా ఇసుక ఎక్కడా దొరకడంలేదు.  ఒకవేళ దొరికినా ధర దోపిడీతో నిర్మాణదారులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం వారంవారం పెద్దఎత్తున కొన్ని ప్రత్రికల్లో ఇస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితి ఎక్కడా పొంతన లేదు. ‘అందరికీ అందుబాటులో.. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే నాణ్యమైన ఇసుక..’ అంటున్నా అదెక్కడో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇక రీచ్‌ల దగ్గర టన్ను రూ.475 మాత్రమే.. దీనికి మించి ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మితే రెండేళ్ల జైలు శిక్ష.. రూ.2 లక్షల వరకు జరిమానా..’ అన్న ప్రకటనలో నిజమెంతా ఎవరికీ తెలియడంలేదు. ఇలా ఇసుక విధానంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో పారదర్శకత మచ్చుకు కూడా కానరావడం లేదు. ఇసుక అక్రమాలపై ఒక్కరిపై కూడా చర్యలు కాదుకదా! కనీసం కేసు నమోదు చేసిన దాఖలాలే లేవు. 


తెనాలి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఇసుక విధానంలో పారదర్శకత, ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకే ఇసుక విక్రయాలంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, వాటి ఊసుమాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించటంలేదు. పోనీ ప్రకటనల్లో వారిచ్చిన నంబర్లకు ఫిర్యాదు చేస్తే కేసులేమైనా నమోదు చేస్తున్నారా అంటే అదీలేదు.  కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రెండున్నరేళ్లలో ఇసుక విధానంలో కొత్త మార్పులు తెస్తామంటూ అనవసరపు ఖర్చులు మినహా ఎక్కడా ఒక నిర్ధిష్ట విధానం అంటూ లేకుండా నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తూనే వచ్చారు. ఇసుకపై ఖజానాకు వచ్చే ఆదాయం అటుంచితే, ప్రజాధనాన్ని వృథా ఖర్చులతో జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్ట్‌ సంస్థ జేపీ పవర్‌ సెక్యూర్స్‌ కంపెనీ పేరుచెప్పి రోజుకొకరు తెరపైకొస్తున్నారు. ఇసుకను బల్క్‌ పేరుతో అధిక ధరకు దళారులకు అప్పగించేస్తున్నారు. టన్ను ఇసుక రీచ్‌లలో రూ.475కు మించి అమ్మటానికి వీలులేదని చెబుతుంటే, ఈ రేటుకు జిల్లాలో ఒక్క రీచ్‌లో అయినా ఇసుకను ఇప్పించగలిగితే జగనన్నకు పాలాభిషేకం చేస్తానని ఏ వెంకటేశ్వరరావు అనే నిర్మాణదారుడు చెబుతున్నారు. జిల్లాలో 48 వరకు రీచ్‌లుంటే వాటిలో ఒకటి, రెండు మినహా పూర్తి స్థాయిలో ఇసుక విక్రయాలు సాగించిన పాపానపోలేదు. కొల్లిపర మండలంలోని మున్నంగి దగ్గర రీచ్‌ ప్రారంభిస్తున్నామని చెబితే, అక్కడి సొసైటీదారులు అడ్డుకున్నారు.  ప్రస్తుతం బొమ్మువానిపాలెం, గొడవర్రు తాళ్లాయపాలెం దిడుగు రీచ్‌లను మాత్రమే తెరిచారు. వీటిలో తాళ్లాయపాలెం రీచ్‌లో ఇప్పటికే లక్ష టన్నులకుపైగా ఒడ్డుకు చేర్చినా అమ్మకాలు లేకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఇక్కడ   టన్ను రూ.800కు అమ్మారు. ప్రభుత్వం ప్రకటించిన ధర  రూ.600 ఉంటే ఆ రేటుకు అమ్మడంలేదు. మంగళగిరి దగ్గర స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి అక్కడికి తరలించాక అమ్మకాలు జరపాలనేది ఆలోచనగా చెబుతున్నారు. అంటే మరింత రేటుకు అమ్మకాలు జరిపేందుకు కుట్ర పన్నుతున్నారనేది స్థానికుల ఆరోపణ. దిడుగులో ఇసుక బాగలేకున్నా టన్ను రూ.630, తాళ్లాయపాలెంలో 800కి అమ్ముతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గొడవర్రు రీచ్‌లో అయితే అంతా గందరగోళమే.  ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మకుండా, అనధికారికంగా కొందరు వ్యక్తులకు, మధ్య దళారులకు రూ.475కు అమ్మాల్సిన ఇసుకను రూ.600 నుంచి రూ. 750 వరకు అమ్ముతున్నారు. బల్క్‌ పేరుతో కొనుగోలు చేసినవారు టన్ను రూ.900 నుంచి రూ. 1200 వరకు అవకాశం దొరికినంతకు అమ్మేసుకుంటున్నారు. 


 రీచ్‌ల్లో తమిళ తంబిల హవా

జేపీ సంస్థ ఆదాయం ఎలా ఉందో తెలియదు కానీ, కింది స్థాయి సిబ్బంది చెల రేగిపోతున్నారు. వీరిపై అజమాయిషీ లేదు. రీచ్‌లలో పనిచేసే వారంతా తమిళనాడువాసులు. వారు సొంతగా లారీలు కూడా తె చ్చుకున్నారు. వీటిలో ఒక్కటి కూడా నిబంధనలకు అనుకూలంగా లేవు. ఓవర్‌లోడ్‌కు వీలుగా బాడీ మార్చి మరీ ఇసుకను తరలిస్తున్నారు. 12 టైర్ల లారీల్లో సాధారణంగా 25 టన్నులకు మించిన లోడు అనుమతించరు. అయితే వీరి లారీలు మాత్రం 45 నుంచి 50 టన్నుల లోడుతో వెళుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. స్థానిక లారీలకు రోజుకు ఒక లో డ్‌ అందుతుంటే, వీటికి మాత్రం రోజుకు ఐదు నుంచి పది ట్రిప్పుల వరకు అందుతున్నాయి. తమకు వే బ్రిడ్జిలతో పనిలేదని, ఎంత ఇసుకైనా అమ్ముకునే అధికారం ఉందంటూ సిబ్బంది దందా చేస్తున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదు. రీచ్‌లలో అదనపు వసూళ్లు, లెక్కకు అందని అమ్మకాలు, రేట్లకు రెక్కలు తెచ్చిపెడుతున్నాయి. సీరియల్‌ ప్రకారం కాకుండా వచ్చిన లారీకి వెంటనే లోడ్‌ చేసిపంపేందుకు రూ.1500 నుంచి రూ. 2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. అదనపు వసూళ్ల వాటాల విషయంలో సిబ్బంది మధ్య గొడవ వచ్చి కొల్లిపర రీచ్‌లలో ఘర్షణ పడ్డారు. ఇక్కడి వసూళ్లతో గుంటూరులో ఒకరు రూ.కోటిన్నరతో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా, మరో ఇద్దరు ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.65 లక్షల చొప్పున నూతక్కి, మంగళగిరి, నంబూరు ప్రాంతాల్లో అడ్వాన్స్‌లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. 


పట్టించుకోని అధికారులు

స్టాక్‌ యార్డుల్లో, రీచ్‌లలో ఓవర్‌ లోడు ఇసుక లారీలకెత్తుతున్నా నియంత్రించే విషయం అధికారులు మరిచారు. ఒకవేళ ఎక్కడైనా పోలీసులు రంగంలోకి దిగినా ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేయటం, సిఫార్సులుంటే వదిలేయటం పరిపాటిగా మారింది. రీచ్‌, స్టాక్‌ యార్డుల వద్ద కాటా ఏర్పాటు చేయకుండా వందల లారీల ఇసుకను అమ్మేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.  నదికి వరద తగ్గిపోయినా అన్ని రీచ్‌లను ప్రారంభించలేదు. ఉన్న రీచ్‌ల నుంచి ఇసుకను అధిక ధరలకు అమ్మేస్తున్నా పట్టించుకునే అధికారే లేరు. ప్రకాశం బ్యారేజి దిగువున కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె, మంగళగిరి మండలాల పరిధిలో రీచ్‌లు తెరిచేందుకు అవకాశం ఉన్నా, కాంట్రాక్టర్‌ సిబ్బంది పట్టించుకోకపోవటం, అధికారులూ రీచ్‌లు తెరిపించే ప్రయత్నంకూడా చేయకపోవటంతో ఈ ప్రాంతాల్లో ఇసుక బంగారమే అయింది. అదనంగా పోస్తున్న ప్రతి ఎక్స్‌కవేటర్‌ బొచ్చెకు రూ.1300 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తూ ప్రైవేటు సంస్థ సిబ్బంది జేబులు నింపుకుంటుంటే, మాపై కేసులు నమోదు చేయడం ఏమిటని లారీల యజమానుల సంఘం ప్రశ్నిస్తుంది. పైగా ట్రాన్స్‌పోర్టర్లు సిండికేట్‌ కావటం వల్లే జిల్లాలో ఇసుక అధిక ధర పలుకుతోందంటూ గనుల శాఖ ఇచ్చిన ప్రకటనల్లో ఆరోపించడం దారుణమంటూ మండిపడుతున్నారు.

Updated Date - 2021-12-02T05:40:44+05:30 IST