కార్పొరేట్లు ఇసుకలోకి

ABN , First Publish Date - 2021-01-22T06:31:34+05:30 IST

ఇసుక వ్యాపారంలోకి కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఇసుక వ్యాపారం విషయంలో ప్రభుత్వం రాష్ర్టాన్ని ఇప్పటికే మూడు జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ ఒక జోన్‌ ఉంటుంది.

కార్పొరేట్లు ఇసుకలోకి

  నాలుగు జిల్లాలకు  ఒకే కాంట్రాక్టర్‌?

  జిల్లాలో 43 ర్యాంపులు

  మొదలైన టెండర్‌ ప్రక్రియ

  29కి తుది నిర్ణయం

  ఫిబ్రవరి 19 నుంచి   కొత్త విధానం

 పాత కాంట్రాక్టర్ల   గుండెల్లో రైళ్లు

  ఈలోపే చక్కబెట్టుకునేలా ఎడాపెడా దోపిడీ


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)ఇసుక వ్యాపారంలోకి కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ఇసుక వ్యాపారం విషయంలో ప్రభుత్వం రాష్ర్టాన్ని ఇప్పటికే మూడు జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ ఒక జోన్‌ ఉంటుంది.  పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఒంగోలు వరకూ మరో జోన్‌. తర్వాత నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలన్నీ ఒక  జోన్‌గా చేశారు. ఒక జోన్‌ను ఒక కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పగించనున్నట్టు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ ఏకంగా ఒకే కాంట్రాక్టు సంస్థ. ఇది కార్పొరేట్‌ సంస్థ కావొచ్చు. ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న ర్యాంపులన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంటాయి. కొత్త విఽధానం కోసం గురువారం నుంచే టెండర్ల ప్రక్రియ మొదలైంది. 23 వరకూ టెండర్లు స్వీకరిస్తారు. 29న ఫైనల్‌ చేసి, కాంట్రాక్టర్‌ను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 19 నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. జోన్‌ అంటే మన జిల్లాతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంఽధించి టెండర్‌ పాల్గొనేవారు రూ.40 కోట్లు డిపాజిట్‌ చేయాలి. ఇక కొత్త విధానానికి సంబంధించి జిల్లాలో 42 నుంచి 43 వరకూ ర్యాంపులు సిద్ధం చేస్తున్నారు. 5 హెక్టార్ల పరిధిలో ఒక్కో ర్యాంపు ఇస్తారు. ఇక్కడ 50 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తీతకు అనుమతిస్తారు. అది పూర్తయిన తర్వాత మళ్లీ అనుమతిస్తారు. ఏసీఎంండీసీ ద్వారా ఆన్‌లైన్‌లోనే వినియోగదారులు ఇసుక బుక్‌ చేసుకుంటారు. కానీ ఏ ప్రాంతం వారికి అదే ప్రాంతంలోని ర్యాంపుల నుంచి ఇసుక విక్రయిస్తా మని చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకూ ఉన్న ఇసుక విధానం రద్దయినట్టే. స్టాక్‌ పాయింట్లను ఎత్తివేస్తూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. డోర్‌ డెలివరీ కూడా ఉండదు. పట్టా భూముల్లోనూ అనుమతి ఇవ్వరు. ఓపెన్‌ ర్యాంపులు, పడవల మీద మాత్రమే ఇసుక తీయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో స్టాక్‌ పాయింట్లతో కలుపుకుని 82 ర్యాంపులు ఉన్నాయి. వాటిలో కొన్ని పనిచేయడం లేదు. ఇవన్నీ తగ్గిస్తారు. కేవలం 42గానీ, 43 గానీ ర్యాంపులు ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానం ఎత్తేసి, వైసీపీ ప్రభుత్వం 2019 సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానాన్ని అమలు లోకి తెచ్చింది. కానీ అది విజయం కాలేదు. దీంతో భవన  నిర్మాణరంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల పాల య్యారు. పలుచోట్ల ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. అయినా అసలు ఇసుక సరఫరా జరిగేది కాదు. అంతా గందరగోళమైంది. చివరకు గతేడాది ఫిబ్రవరి తర్వాత ఇసుక విధానం ఒక కొలిక్కి వస్తుందనే సమయంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ వల్ల మళ్లీ ఇసుక ఆగింది. తర్వాత చాలా ర్యాంపులు అమలులోకి వచ్చాయి. ఇసుక సరఫరా మొదలైంది. కానీ భారీఎత్తున దోపిడీ కూడా మొదలైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇసుక ర్యాంపుల నిర్వాహకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేశారు. ర్యాంపులన్నీ రాజకీయనేతల కనుసన్నల్లోకి వెళ్లాయి. స్టాక్‌పాయింట్లు కూడా  రాజకీయ నేతలే నిర్వహించారు. ఇటు ఇసుక ధరలు విపరీ తంగా పెరిగిపోయాయి. నాణ్యమైన ఇసుక కూడా సరఫరా కాలేదు. కానీ జిల్లాలో ఎక్కువమంది ఇసుక వ్యాపారులు తయారయ్యారు. మరోవైపు పట్టా భూముల్లో కూడా ఇసుక అనుమతులు ఇచ్చారు. ఇటీవల ఇసుక ఒక దారిన పడుతున్న సమయంలో ప్రభుత్వం మరో విధానం తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకే కాంట్రాక్టు సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించనుండడం తో దీనిని ఎలా నిర్వహిస్తారనేదానిపై స్పష్టత లేదు. నాలుగు జిల్లాలో అనేక ర్యాంపులుంటాయి. మన జిల్లాలోనే 43 వరకూ సిద్ధంచేస్తున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ అక్కడ ఉద్యోగుల నుపెట్టి నిర్వహిస్తుందా, సబ్‌కాంట్రాక్ట్‌ ఇస్తుందా అనేది స్పష్టత లేదు. దీంతో చాలాకాలం నుంచి ఇసుక వ్యాపారం చేస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇసుక తరలింపు, తవ్వకాల్లో అనేక సొసైటీల భాగస్వామ్యం ఉంది. అందులో వంద లాది మంది సభ్యులు ఉన్నారు. వారంతా రోడ్డున పడే ప్రమా దం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా రైతులకు డబ్బు ఇచ్చి, పట్టా భూములు లీజుకు తీసుకున్న వ్యాపారులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి కూడా అయోమయమే.


జిల్లా అంతా ఇసుక దందానే


కొద్దిరోజుల్లో కొత్త విధానం రానుండడంతో ఇసుక వ్యాపా రులు రెచ్చిపోయారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవా లనే ఆలోచనతో జిల్లా అంతా ఇసుకతీత ముమమ్మరం చేశారు.  ఏజెన్సీ ఏరియా, సీతానగరం మండలం, రాజమహేంద్రవరం అఖండ గోదావరి,  జొన్నాడ, కోనసీమ ప్రాంతాల్లో ఇసుక ఇష్టానుసారం తీసే స్తున్నారు. రాజోలు పరిసరాల్లో విప రీతమైన దోపిడీ జరుగుతోంది.


ఇక రెండు ‘ఇసుక గోదార్లు’


ఇసుక కోసం జిల్లాలను మూడు జోన్లుగా విభజించడంతో గోదావరి రెండు ఇసుక గోదారులయ్యింది. ఒక టవ జోన్‌లో తూర్పుగోదావరి జిల్లా ఉండగా, రెండో జోన్‌లో పశ్చిమగో దావరి ఉంది. దీంతో అఖండ గోదావ రిలో సరిహద్దు తగాదాలూ రావొచ్చు. ఇసుక తవ్వకాల్లో సరిహద్దు తగాదాలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. మొదట్లో ఇసుక ఆదాయం పంచాయతీలకు వెళ్లేది. తర్వాత ఈ ఆదాయంపై ప్రభుత్వం కన్నేసింది. ఇసుక వ్యాపారం సక్రమంగా నిర్వ హిస్తే రూ.వేల కోట్ల ఆదాయమే. కానీ ఇవాళ కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిం చడం వల్ల ఈ ఆదాయం సక్రమంగా వస్తుందో లేదో చూడాలి. లేదంటే దోపిడీ ఒకరి చేతిలోకే పోతుంది.

Updated Date - 2021-01-22T06:31:34+05:30 IST