ఇసుక.. ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-09-30T05:23:03+05:30 IST

ఇసుక లేదు.. ఇల్లెలా కట్టాలో తెలియడంలేదు. రోజులు గడుస్తున్నాయి కాని అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.

ఇసుక.. ఇక్కట్లు
నరసరావుపేటలోని జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణం

జగనన్న కాలనీల్లో నిలిచిన నిర్మాణాలు

లబ్ధిదారులకు గత నెల నుంచి సరఫరా నై 

ఏజెన్సీ మార్పుతో రోజురోజుకు సమస్య తీవ్రం

బహిరంగ మార్కెట్‌లో కాసులు కురిపిస్తోన్న ఇసుక

అక్రమ రవాణాపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ 


నరసరావుపేట, సెప్టెంబరు 29: ఇసుక లేదు.. ఇల్లెలా కట్టాలో తెలియడంలేదు. రోజులు గడుస్తున్నాయి కాని అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడు ఇసుక అందుబాటులోకి వస్తుందో ఎప్పుడు నిర్మాణాలు ప్రారంభించాలో అర్థంకాక అటు అధికారులు, ఇటు లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. గత నెల నుంచి జిల్లా అంతటా ఇసుక కొరత నెలకొంది. జగనన్న కాలనీల్లోని పేదింటి లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో 198 జగనన్న కాలనీల్లో  42,899 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో 11,115 గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ప్రభుత్వ ఉచితంగా సరఫరా చేయాలి. గత నెలలో ఇసుక సరఫరా చేశారు. ఇసుక సరఫరాకు సంబంధించిన ఏజెన్సీని ప్రభుత్వం మార్చింది. దీంతో ఇసుక సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోంది. కొత్త ఏజెన్సీకి ఇసుక సరఫరాను ప్రభుత్వం అప్పగించినప్పటికీ ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇసుక సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చిలకలూరిపేట స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుక తీచ్చుకోవాల్సి రావడంతో రవాణా  ఖర్చుల భారం పడుతున్నదని అధికారులు వాపోతున్నారు.  

యథేచ్ఛగా బ్లాక్‌ దందా 

ప్రభుత్వ నిర్మాణాలకు కొరతగా ఉన్న ఇసుక బ్లాక్‌లో పుష్కలంగా లభిస్తున్నది. ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఇసుక సరఫరా చేపట్టకపోయినా అక్రమార్కులు రీచ్‌ల నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలిస్తున్నారు. నరసరావుపేటలో ఇసుక టన్ను రూ.1300 నుంచి రూ.1400 వరకు విక్రయిస్తున్నారు. అమరావతి, నెల్లూరు ప్రాంతాల నుంచి అక్రమమార్గంలో జిల్లాకు సరఫరా అవుతున్నది. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అక్రమ ఇసుకను కొందరు అధికారులు ఆదాయ వనరుగా మర్చుకున్నారన్న విమర్శలున్నాయి. సెబ్‌ అధికారులు   చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం వారం వారం ప్రకటిస్తున్న ధరకు ఇసుక ఎక్కడా లభించడంలేదు. 

Updated Date - 2022-09-30T05:23:03+05:30 IST